పుట:Himabindu by Adivi Bapiraju.pdf/284

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చారు: ఏమమ్మా వణకిపోయెదవు! కన్నుల నీరు నిండుచున్నది? భయములేదు. నీకు కావలయునది మనవిచేసికొమ్ము.

పరిచారిక: ప్రభు! హిమబిందుదేవి తాను వారణాసి వెళ్ళుచున్నాననిచెప్పి, బాలనాగితో, గోండురక్షకభటులతో రథముపై వెళ్ళిపోయినది.

చారు: (సువ్వున లేచి) ఏమీ! హిమబిందు వారణాసి వెళ్ళినదా?

చారుగుప్తుడు తన ప్రజాపతిమిత్ర విగ్రహమువైపు పదినిమేషములు అనిమిషుడై చూచినాడు. దగ్గరనున్న జేగంటను మ్రోయించినాడు. ఆ మ్రోత “జయ్” అని మ్రోగినది. వెంటనే ఇంద్రగోపు డచ్చటకు వచ్చినాడు.

ఇంద్రగోపుడు: ఏమి సెలవు స్వామీ?

చారు: హిమబిందుదేవి వారణాసిపోయినదట. ఆమెకు కావలిగా రెండువేల సైన్యము పంపుము. ఆమె వెళ్ళినజాడ తీయుము. నేనును వారణాసికి ఈ సాయంకాలము ప్రయాణము. ఆశ్వికులు వేయిమంది నా వెనుక వత్తురు. నారథము సిద్ధముచేయు మని అంచెలవారిని పంపుము. నా ప్రయాణము సిద్ధముచేయుము. ఇప్పుడ మామగారికి హిమబిందు కుమారి వారణాసికి పోయిన విషయము తెలియజేసి వారు నాతో వచ్చుటకు నా ఆహ్వాన మ౦దింపుము.

ఇంద్రగోపుడు నమస్కరించి “చిత్తము మహాప్రభూ!” అని వెడలిపోయెను. చారుగుప్తుడు పరిచారికలవైపు చూచి, “మీరు మా అత్త గారికి ఈ విషయము తెల్పుడు. ఆమెను గూడ నాతో ప్రయాణమునకు సిద్ధముచేయుడు. మీలో నలుగురును, తారాదత్తయు, దాదులు నాతోవచ్చుటకు సిద్ధము కండు” అని ఆజ్ఞనిడెను. “చిత్త” మని వారు వెడలిపోయినారు.

వెంటనే చారుగుప్తుని దర్శింప శ్రీకృష్ణసాతవాహనమహారాజు వేంచేసినారని దౌవారికుడు మనవిచేసెను.

చారుగుప్తుడు చిరునగవున త్వరత్వరగ సభాభవనమునకు వచ్చినాడు. శ్రీకృష్ణ సాతవాహన మహారాజు విచ్చేయగనే చారుగుప్తుని మంత్రులు, సేనాపతులు సగౌరముగ వారి నెదుర్కొని, తోడితెచ్చి సువర్ణాసనముపై నధివసింపచేసిరి.

చారుగుప్తుడు వచ్చుటయు మహారాజులేచి ఆయనకు నమస్కరించి, వారిచ్చు ప్రతినమస్కార మందుకొని, “దయచేయుడు!” అని చారుగుప్తుడు ప్రేమపూరితముగతన్ను ప్రార్థింప ఆసన మలంకరించెను. చారుగుప్తుడును దాపున నున్న దంతాసన మలంకరించెను. మంత్రులు, సేనాపతులు సభామందిరమువీడి వెడలిపోయిరి.

శ్రీకృష్ణసాతవాహన ప్రభువు చారుగుప్తుని జూచి, “చారుగుప్తుల వారూ! నేను మీయెడ దోష మాచరించితిని. అందులకు క్షంతవ్యుడను” అనెను.

“మహాప్రభూ! అది భగవంతుని ఇచ్చ! తా మెట్లు తప్పు చేయగలరు?”

“నేను ఒక మహాభాగ్యమును చేతులార త్రోసివేసుకున్నాను.”

“మహారాజా! తాము మనస్సున నేవిధమగు కించయును జారనీయకుడు. నాబాలిక సువర్ణశ్రీని ప్రేమించినది. సువర్ణశ్రీ యామెనుప్రేమించి వాడు. ఆమె ధర్మమున పరకీయ యైనది. నేను నాతల్లివిషయమున మూర్ఖుడనై సంచరించితిని. ఆమె యిష్టాఇష్టములు విచారింపనైతిని. శకటపందెమున విజయమందిన గిత్తలను తమకు బంగారు సంతరించిన

అడివి బాపిరాజు రచనలు - 2

• 274 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)