పుట:Himabindu by Adivi Bapiraju.pdf/280

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తన స్వామిని తాను కలుసుకొనుటకు పోవుచున్నది. విమానములు, గంధర్వాశ్వములు బృహత్కథా సందోహములో మాత్రమున్నవి. లేనిచో మరుక్షణములో అచ్చటికిపోయి వాలియుండునుకదా!

ఆ సుందరశ్రీవికాసిత వదనుడు, తన మనోనాథుడు వారణాసీపుర ప్రాంత కురంగ వనమున నుండునా? అచ్చటినుండి కౌశాంబికో, కుశ నగరమునకో, లంబినీ వనమునకో పోయియుండునా? ఎక్కడకు పోయినను తాను నిర్నిద్రయై ఏడులోకములు వెదకియైన తనప్రాణేశుని పట్టుకొనును.

శిల్పకుమారుడు పురుషులలో మహాకిరీటము. ఆయన కన్నులలో చిత్రలేఖనములు కలలు తిరుగును. ఆశిల్పి నవ్వులలో కావ్యములు గానము చేయును. ఆయన రూపమున సర్వశిల్పములు చైతన్యము నందును.

తా నెంత యదృష్టవంతురాలు! ఆ దివ్యమూర్తి తన్నుచూచిన ప్రథమ క్షణమందే తన్ను ప్రేమించెను. తన్ను శిల్పమూర్తిని చేసెను. తన్ను చోరులు తస్కరించికొనిపోయినప్పు డేమియు వెరవక తన్ననుసరించి, విరోధుల నుక్కడగించి తన్ను రక్షించెను. తనకై ఆత డుద్భ వించినాడు, ఆతనికై తా నుద్భవించినది.

తండ్రి తన్ను శ్రీకృష్ణమహారాజున కుద్వాహమొనరించెదనని తనతో తెలిపినప్పుడు, వెంటనే హృదయము వణకి ప్రాణముపోయి నేలపై పడిపోక, సిగ్గులేక తల ఊపినది. తనలోని యవనరక్తమట్లు చేసినది. “ప్రభూ! ఆత్మేశ్వరా! నీకెంత ప్రణయద్రోహము చేసితిని! ఆనాడు తోటలో ఈ కర్కశహృదయ వచించిన మాటలకు నీవు ఎంత కుంది నావో!” ఈ ఆలోచన ఆమె హృదయమున మెఱిసిపోవుటయు ఆమె కన్ను లార్ద్రము లయ్యెను.

ఒకవైపు తనప్రభువగు శ్రీకృష్ణసాతవాహనమహారాజున కిచ్చెద రనుకొనిన బాలిక! ఆ బాలిక ఆ వివాహమున కొప్పుకొనినట్లు కనంబడుట. ఈ రెండును ఆ మహాభాగుని ఇటుల దేశాలపాలుచేసిన వని యామె యనుకొనెను.

ఒకవేళ నందమహారాజు దీక్ష గయికొనిన వెనుక సుందరీదేవిగతియే తనకును బట్టునేమో! తనహృదయేశ్వరుడు, తన సువర్ణశ్రీ భిక్షువే యైనచో ఓ సమంతభద్రా! నీ పరమప్రేమకు అర్థమేలేదని ఆమెకన్నుల నీరు కారిపోయినది.

“బాలనాగీ! మనయానమును తొందరగ బోనిమ్మనుము. త్వరగ మనల కాశీపురికి తీసికొనిపోయినచో వారు కని విని ఊహించలేని పారితోషికమత్తు నని తెల్పవే!” అని ఆమె తొందరపెట్టెను.

రెండు రాత్రులు, రెండు పవళ్ళు పడవలోనే ప్రయాణించిరి. పడవలోనే బాలనాగి వంటచేయుచుండెను. చారుగుప్తుడు వచ్చి, హిమబిందును వెనుకకు గొనిపోవునేమో యను భయమున హిమబిం దట్లొనరించినది.

ఒకచోట తండ్రి రథములతో, గుఱ్ఱములతో, ఏనుగులతో పది గోరుతముల దూరమున నున్నాడని ఒక గోండుడు వచ్చి చెప్పినాడు. ఆమె వెంటనే పడవ నాపి తానును, బాలనాగియు, గోండులు గంగ అవలిఒడ్డున దిగి వెనుకకు కొంతదూరము పోయి, నదిఒడ్డునుండి మహావేగముతో రెండు గోరుతములు తీరమువదలి వెళ్ళి, అచ్చటనుండి చుట్టి గ్రామముల వెంబడి కాశీనగరము ప్రయాణము చేసిరి. చారుగుప్తుడు గంగానది తీరముననే కాశీనగరము ప్రయాణము చేయుచున్నాడని గోండులు వార్తలు తెచ్చిరి.

అడివి బాపిరాజు రచనలు - 2
హిమబిందు (చారిత్రాత్మక నవల)
• 270 •