పుట:Himabindu by Adivi Bapiraju.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిన్న చెల్లెలి నెత్తుకొని, ముద్దులు పెట్టుకొని, బుజ్జగించి, నాగబంధునిక కందకుండ వారి తోటయంతయు పరుగిడును.

ఆ రోజున నాగబంధునిక చిన్నచెల్లెలు చేయిపట్టుకొని, వయసు రాబోవు ఆడుపులివలె అన్నగారి శిల్పమందిరములోని పోయెను.

ధర్మనంది హర్మ్యము, భవనము, శిల్పమందిరము ఒక విశాల వనవాటికయందు మహాసంఘారామమునంటి, ఆ సంఘారామమున కాగ్నేయమున కృష్ణానదీతీరమున నున్నవి. కృష్ణానది పొంగి, పరపళ్ళు తొక్కుచు ప్రవహించునప్పుడు, ధర్మనంది శిల్పమందిర సోపానముల నెక్కి మందిరోత్తరకవాట ప్రాంతమునకు వచ్చి, యా యుత్తమశిల్ప విన్యాసముల నవలోకింప తొంగిచూచు చుండును.

జనకుని శిల్పమందిరమునకు ముప్పదిరెండు ధనువుల దూరమున కుమారుని శిల్పమందిరమున్నది. సంపూర్ణ విన్యస్తశిల్పమైన వజ్రభూగర్భస్థ చంద్రశిలాఫలకము పదుగురు సేవకులచే నెత్తించుచుండిన అన్నగారి కడకు నాగబంధునిక పరుగునవచ్చి “అన్నా! నీవు ఎద్దులబండి పందెమున గెలిచితీరెదవు. అట్లు జయమందినప్పుడు నాకేమిబహుమతి నొసంగెదవు?” అని ప్రశ్నవేసినది.

సువర్ణశ్రీ నవ్వుచు, తనకన్న గుప్పెడుమాత్రము తక్కువ పొడుగున్న చెల్లెలి భుజముచుట్టు చేయిడి, దగ్గిరకుతీసికొని, యామె మూర్ధముపైచేయుంచి, కేశభారము సవరించుచు “చెల్లీ! గిరిపురమునం దుత్తమలోహ కారుడు నిర్మించిన వనితాకృపాణమొకటి, అగ్ని శిఖవంటి దానిని శుక్లపక్ష విదియనాటి నెలవంకవంటిదానిని, కాన్కనీయగలను సుమా! నీకు నగలయం దభిరుచి లేదాయెను. మొన్ననే ప్రసిద్ధ వ్రాయసకాడగు గోపాలకుల వారు తాళపత్రముల లిఖించిన దివ్యగుణాఢ్య పండిత విరచితమగు బృహత్కథను కాన్కతెచ్చితినాయెను! నీవు వలదంటివి. వ్యాసభగవద్విరచిత భారతమును, వాల్మీకి విరచిత రామాయణము నెన్నిమార్లు చదువు చుందువో. ఒక్కసారియైన త్రిపీటకమును చదువవు. నీవు నాకు తమ్ముడవై ఏల జన్మింపలేదో!” అని యనుచు పకపక నవ్వినాడు.

నాగబంధునిక: అన్నా! బుద్ధభగవానుని బోధ నాకు విసుగుజనింపచేయును. అహింసయట, అష్టమార్గములట, కాలము చెల్లిన వృద్ధుల కీశ్రమణకుని బోధ నచ్చునేమో. నాకుమాత్రమూ స్థాలతిష్యమహర్షి బోధనలు ఆనందోత్సాహములు కలుగజేయును. వృషభేశ్వరుడైన కాలకంఠుడు చండ విక్రముడు, ఆయన అర్ధాంగి దుర్గ వీరధర్మస్వరూపమైన దివ్యమూర్తి. కాదుఅన్నా?

సువర్ణశ్రీ: వెర్రితల్లీ! నీ యభిప్రాయములు నాన్నగారికి తెలియవు. ఆయన అవి విన్నచో భయకంపితహృదయులు కారా?

నాగబంధునిక: నాన్నగారికి భయమా? అమ్మ కేభయములేదే!

సువర్ణశ్రీ: అవును. నీవువట్టి మాటలప్రోవువని అమ్మకు తెలియదా?

నాగ: నేను మాటలప్రోగునా? నీవు పనులప్రోగువా? నీపనులన్నియు నీ ఎదుటనే ఉన్నవి. పలుచనివి, గంభీరరాగములు లేనివి, రుచులు లేనివి, చప్పిడిభావాలు తెలియజేయు నీ బొమ్మలన్నియు నీ పనులేకావూ?

నాగబంధునిక చప్పట్లు కొట్టుచు పక పక నవ్వెను. సిద్ధార్థినిక అక్కమాటలకు వెరగుపడుచు - “అక్కా! ఇప్పటికిని నీ వాడదానివను నమ్మకము నాకులేదే” అన్నది.

అడివి బాపిరాజు రచనలు - 2

• 18 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)