పుట:Himabindu by Adivi Bapiraju.pdf/279

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వస్తువులు మరొకచోటికి చేర్చుటలో పడినపాటు రెండుపణములు విలువయుండు ననుకొన్నను, లాభము ఆరుపణములు మిగులుచున్నది. ఈ రీతిగ ప్రోగైన పాపమే తనతండ్రి మహాసంపద యుంతయు.

తనకై, తనభర్తకై, తన బిడ్డలకై, లోకమునకై, భగవంతునికై జీవితము ధారపోయని యువతిజన్మము వృథాయనికదా అమృతపాదార్హతులు చెప్పినది. ఈ భావములు హిమబిందు హృదయములో నెలకొన్నవి. ఆమెకు తగని ఆవేదన, నిలుచుండలేదు, కూరుచుండలేదు. పాటలీపుత్ర పురముననున్న సంఘారామములు, చైత్యములు ఎన్నిసారులో తిరిగినది. అమృతలతాదేవితో ధాన్యకటకమునుండి వచ్చిన బాలనాగిని వేపుకొని తినుచున్నది.

“బాలనాగీ, ఎటులనే!” “బాలనాగీ నాకు జ్వరము తగిలినట్లున్నది, చూడవే!” “బాలనాగీ! నాకు మంచివిషమును కొనిరావే” ఈ రీతిగ బాలనాగి నలిగిపోవుచున్నది.

పాపము బాలనాగి ఏమిచేయగలదు? ఆమె ఇటు పరుగిడును, అటు పరుగిడును. యజమానురాలితో పాటు ఆమెయు నాబాధ లన్నియు పడుచున్నది. ఆమెకు హర్షగోపుడు మనస్సునకు వచ్చును. తానును హర్ష గోపునికై బాధ నందుచుంటినని యనుకొనును. హర్షగోపుడు వచ్చునట. ఆతని విశాలవక్షము ఆమెహృదయమున తోచును. తన్నాపక్షమున కదిమివేసిన ఆతని పృధుబాహుద్వయ మామె హృదయ పథముల తోచి దేహ ముప్పొంగును. హిమబిందునకు వివాహమైనగాని తాను వివాహము చేసి కొనరాదు. హర్షగోపుడు తన్ను ద్వాహమగుటకు ఇంద్రగోపుడు అనుమతించినాడట. తనతల్లి తండ్రు లిదివరకే అనుమతించిరి. తన తండ్రి మంచి వ్యవసాయకుడు. చారుగుప్తుని గ్రామములో ముఖ్య గ్రామమైన జయస్థలి యందు పెత్తన మాతనిదే. చారుగుప్తుని పొలములన్నియు ఎంత చక్కగా పండించును! ఆ గ్రామమే అందమైనది. అది శ్రీకాకుళమున కెగువను కృష్ణాతీరమున నున్నది. వ్యవసాయము, పొలములుదున్నుట, కలుపు తీయుట, పంటకోయుట, నూర్చుట, ధాన్యాదు లింటికి తెచ్చుట, సంక్రాంతి! ఎంత చక్కనైనపాటు! ఆ పాటును అందగింపజేసే పాటలో! తన ఇల్లు పేరుగానుండును. తనకెన్ని పశువులుండును! అవి అంబా అని అరచును. ఆవులపాలు తాను పిదుకును, తనభర్తయు పితుకును. బిడ్డలు “అమ్మా గుమ్మపాలు” అందురు.

“బాలనాగీ!” అను హిమబిందు కేకతో బాలనాగి కలలు ఎగిరి పోయినవి.

హిమబిందు పరుగున వచ్చి, “బాలనాగీ! రావే నా బట్టలన్నియు సర్దు. గోండువీరుల నిరువదిమందిని సిద్ధముచేసితిని. మన రథము సిద్ధము. నేనును, నీవును వెంటనే బయలుదేరవలెను. ఈ రాత్రి రాత్రి గంగ ఒడ్డునే బయలుదేరి కాశికాపురము పోవుచున్నాము. వారణాసీపురముకడ, బుద్ధ దేవుని ప్రథమాశ్రమమైన హరిణవన మున్నది. అచ్చట అతిపవిత్రమైన మహాచైత్య మున్నది. ఆ చైత్యము అశోకచక్రవర్తి నిర్మించినాడు. మన మా క్షేత్రము దర్శించి రావలయును తండ్రిగారికి తెలియదు. మన రథము మహా వేగమున పోవును. లే! లే!” అని తొందరపరచెను.

వా రా రాత్రి ప్రయాణమైరి. మహావేగముతో వారిరథము మహా రాజపథమున వెడలిపోవుచుండెను. తెల్లవారుసరికి వారొక పట్టణము చేరిరి. అచ్చటనుండి హంసవలె నున్న ఒక చక్కని నావను మాటలాడుకొని, వారు గంగానదిలో పడవ ప్రయాణము సాగించిరి.

అడివి బాపిరాజు రచనలు - 2

• 269 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)