పుట:Himabindu by Adivi Bapiraju.pdf/278

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్థౌలతిష్యు డాయనను మాటలాడవలదనియు, కదలవలదనియు సంజ్ఞ యొనర్చి లోనికిపోయి, తేనెతో రంగరించిన ఒక ఔషధము కొని వచ్చి, అమృతపాదులచే సేవింపచేసెను.

“నాయనా! నీ పేరు నందిదత్తుడు కాదా?”

అవునని అమృతపాదులు తలయూపెను.

“నీ భార్య పేరు అపరాజితాదేవి కాదా?”

“అవు” నని అమృతపాదు లస్పష్టముగ ననెను.

“నే నెవరు?”

“నా పితృపాదులు!”

స్థౌలతిష్యుని కన్నుల నీరు తిరిగినది. ఆయన కంఠమున ముడులు పోవ ఒక్క నిమేష మటులుండి, శాంతించి “తండ్రీ, నిద్రపో! తర్వాత అంతయు చెప్పెదను” అనెను.

“నాయనగారూ! పడవలో మునిగిపోయిన వారందరు క్షేమమా?” అని అమృతపాదు లస్పష్టధ్వనిని ప్రశ్నవేసిరి.

స్థౌలతిష్యుడు మాటలాడవలదని పెదవులకడ చూపుడువ్రేలుంచెను.

ఔషధప్రభావముచే అమృతపాదులు నిదురగూడిరి.

స్థౌలతిష్యుడు రూపెత్తిన బ్రహ్మతేజమువలె నట్లే నిలుచుండి, రూపెత్తిన బౌద్ధమువలె నున్న కుమారుని చూచుచుండెను.

ఇతడు, ఈ ప్రియబాలకుడు, తనకన్నతండ్రి. ఈ రీతిగ దొరికినాడేమి! ఈ సంఘటనలోని మహాభావ మేమి? తనపూర్వజ్ఞానమే పోగొట్టుకొని, బౌద్ధ సన్యాసియై, ఆచార్యుడై, అర్హతుడై, కులపతియై, సర్వభారతీయ బౌద్ధసంఘములకు ఏడుగడయైనాడు. తాను ఆర్యధర్మదీక్షాపరతంత్రుడు, తన పుత్రుడు బౌద్ధధర్మాభిరతుడు. తాను త్రయీపఠన పవిత్ర వదనుడు, ఈత డభిధర్మాది మహాగ్రంథపఠనపవిత్రుడా? లేక అపవిత్రుడా? 

13. అన్వేషణ

సువర్ణశ్రీ ఎక్కడకుపోయినాడు? ఏమయినాడు? ఎందు కట్లు వెడలి పోయినాడు? తనకు సువర్ణశ్రీయే కావలెను. తనకు సామ్రాజ్యమెందుకు? సామ్రాజ్ఞిత్వ మెందుకు? సువర్ణశ్రీ తన నాథుడై, తా నాతని శిల్పము, చిత్ర లేఖనము చూచుచు, ఆనందమున దివ్యపథములకు బోవుచు, తన అద్భుత గాంధర్వమున ఆతని నోలలాడించుచు, ఆతనిచే చైత్యములు నిర్మాణము చేయింపుచు, ఈ జన్మము నొక మహదానందప్రవాహమును చేసికొన గలుగుటయే చరితార్థత!

తాను సువర్ణశ్రీతో భారతవర్షమంతయు యాత్రలు సలుపవలెను. బౌద్ధ క్షేత్రములు దర్శింపవలయును. ఈ ధన మెందుకు, రాజ్యమెందుకు? ఒక మంచివానికన్న ఇంకొక మంచివాడు ఇంకనెక్కువ బాగుగ రాజ్యము పరిపాలింపగలుగునా? రాజులేకదా, రాజ్యలోభముచే మహాయుద్ధములు సలిపి ప్రజానష్టము గొనివచ్చుచున్నారు!

తన తండ్రి కీ కోట్లెట్లు వచ్చినవి? ఇతరులధనమును వ్యాపారము పేర హరించుట వలనగదా! రెండుపణములకు కొన్నవస్తువు, పదిపణముల కమ్మును. ఒకచోటినుండి

అడివి బాపిరాజు రచనలు - 2

• 268 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)