ఈ విధముగ స్థౌలతిష్యమహర్షికి, అమృతపాదార్హతలకు వాదోప వాదములు ప్రారంభమైనవి.
అమృతపాదార్హతులు విషకన్యనుగూర్చి స్థౌలతిష్యుని అడుగుటకు ఆయన ఆశ్రమమునకు ఒక మధ్యాహ్నకాలమున వెళ్ళినారు. వెళ్ళిన రెండుగడియలవరకు మహర్షి దర్శన మాయనకు గలుగలేదు.
అమృతపాదులు మహర్షికి నమస్కరించి ఆశీర్వాదమంది, ఒక కృష్ణా జినముపై నుపవసించెను. ఈమాట లామాట లయిన పిమ్మట స్థౌలతిష్యుడు మీ బౌద్ధమత స్వరూప మెట్టిదని పృచ్ఛచేసినాడు. అచ్చటనుండి ఈ వాదన బయలుదేరినది.
ఈ భిక్షుకుడు, ఈ పతితుడు తనతో వాదింపవచ్చెనా యని స్థౌలతిష్యుడను కొనినాడు. స్థౌలతిష్యుని జ్ఞానమనంతము. బౌద్ధదర్శనము లన్నియు పేలపిండి. ప్రస్తానత్రయము ఆయనకు గళగ్రాహము. వేదములు, వేదాంగములు, స్మృతులు, శాస్త్రములు, పురాణములు, ఇతిహాసములు, ఆ మహాత్ముని ఎదుట నాట్యమాడును. ఈ పిచ్చివానిని మూడుమాటలతో దూదిఏకి పంపుదునని యాతడనుకొనెను.
“ఈ ముదుసలి మహాతపస్వి, సర్వతంత్రస్వతంత్రుడు. ఓహో! ఏమి వీరితేజస్సు! ఇట్టి మహానుభావుడు తన మనుమరాలిని విషబాలగా నెట్లొనర్చగలిగెను? ఈయన హృదయమున ఇంతకోప మెట్లు నిండియున్నది? ఈయన ఆర్యధర్మము బోధించెనేగాని స్థితప్రజ్ఞుడు మాత్రము కాదు” అని అమృతపాదార్హతులు అనుకొనినాడు.
స్థౌల: నీ వాదన దుఃఖముతో ప్రారంభించునా?
అమృత: స్వామీ! నా వాదన కాదు. ఇది ప్రతిమనుష్యుని హృదయములోని వాదన! ఎవరికివాడు విచారించుకొనవలెను. మధించినగాని వెన్నరాదు; రెండుకర్రల రాపిడివలనగాని అగ్ని జనింపదు. అటులనే మనుజుడు, అతని చుట్టునున్న సర్వసృష్టి ఇవి ప్రత్యక్షములు.
స్థౌల: అవి నిద్రపోవువాని కున్నవా?
అమృత: లేవు. అట్లు లేకపోవుటకు కారణమేమి? మరల నిదుర లేవగనే ప్రత్యక్షమగుటకు కారణమేమి? ఆ సృష్టియు, ఆ ప్రపంచమును అటులనే యున్నవనియు, తానుమాత్రము నిద్రపోయి లేచితిననియు మనుజుడేల యనుకొనవలెను? ఈ ప్రశ్నలు విచారించుకొనుటలో మనుష్యుడు నిజము గుర్తెరుగుచున్నాడు.
స్థౌల: మీరు వేదము లపౌరుషేయములని అంగీకరింపరు. నీ ముద్దు మాటలు విన మాకు చాలా కుతుహల మగుచున్నది.
అమృత: ఈ విచారణకు అవధి ఆశయసాఫల్యము.
స్థౌల: ఆశయ మెట్టిది? సంతోషమేకదా? దుఃఖము లేకయుండుటయేనా?
అమృత: అవును. అది ప్రాపంచికముకాదు. ప్రపంచములో దుఃఖము లేకపోవుట యనునది ఎచట నుండును? ఎప్పు డుండును? మనకు సద్గతి యున్నదా లేదా యను ప్రశ్న అవసరములేదు. సద్గతియు ఒక గతియే. గతికి అతీతమగుస్థితి కావలెను.
స్థౌల: గతియు, స్థితియు ఒకటికాదా? నీరుగతి ఆవిరి. ఆవిరి మేఘస్థితి నందును. అచ్చటనుండి నీరుగతి వర్షము. వర్షము వాపీకూప తటాక సముద్రస్థితి నందును ఇవియున్నియు నొకటి కాదా?
అడివి బాపిరాజు రచనలు - 2
• 262 •
హిమబిందు (చారిత్రాత్మక నవల)