పుట:Himabindu by Adivi Bapiraju.pdf/27

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


6. నాగబంధునిక

ధాన్యకటకనగరము కృష్ణానదీతీరమున నాలుగు గోరుతముల పొడవున నున్నది. నదీతీరమునుండి నగరగర్భమున ఒక గోరుతమున్నర యున్నది.

ఈ మహానగరము చుట్టును అనేక గ్రామములు వనములు, ఫలపుష్పోద్యాన వాటికలు, ధనికుల ఉత్తమ అధికారుల సామంత ప్రభువుల ఉత్తుంగకుడ్య రక్షిత భవనములు, హర్మ్యములు, మందిరములు, మహాగృహములు, సౌధములు కలవు. ఈ నగరమునకు తూర్పున కృష్ణానదీతీరమున ద్విశతనివర్తన ప్రదేశమునందు మహా సంఘారామమున్నది.

మహాసంఘారామ మధ్యమున మహాచైత్యమును, ఆ చైత్యముచుట్టు చైత్య మందిరములున్నవి. మహాసంఘారామమునకు, కులపతియగు అమృతపాదార్హ చేతుల విహారము ఇరువది ధనువుల దూరమున నున్నది. ఆ విహారమును చేరి కుడ్యరక్షిత వనాంతరమున బాలికా విద్యాలయ విహారమున్నది. ఉత్తమ విద్యాదీక్షితలగు నగర బాలికలందరునందు సర్వ విద్యాగ్రహణోన్ముఖులై, ప్రజ్ఞాపరిమితాదేవీసదృశలై, శుక్లపక్ష సప్తమీచంద్రికలవలె, వసంత నవోదయ హరివల్లభాపుష్పములవలె, రాగరంజిత పరీమళ హృదయలై, విద్యామృతాఫ్లావితచిత్తలై ఆంధ్రనగరమునకే యశము సముపార్జించు చుందురు.

ఆ బాలిక లందరిలో ఉత్తములు హిమబిందు, నాగబంధునికయును. నాగబంధునిక శిల్పాచార్యులగు ధర్మనంది కొమరిత పదునేడేండ్ల యెలప్రాయపు జవ్వని. పొడుగరి పదహారువన్నెల బంగారుఛాయగలది. వీర్యయుత దేహపుష్టికలది. పరుగులో, ధనుర్విద్యలో, కత్తిసాములో ప్రసిద్ధాంధ్ర యువకవీరుల కేమాత్రము నామె తీసిపోదు.

ఈ బాలికకు కాటుకకండ్లు. మోము ఫాలముకడ విశాలమై, చుబుకముకడ సన్నమై పవిత్ర బోధిపత్రమును తలపింపజేయును.

నాగబంధునిక కడ హోయలు గురిపించు శృంగారలక్షణములకన్న నిశితకృపాణ సదృశమగు వీరవనితాలక్షణములు పెక్కులున్నవి. ఆమె తోడి బాలికలు ప్రాచీన శృంగార గాథాపరిస్ఫురణానంద హృదయలై, అర్ధనిమీలిత నేత్రలై, నిట్టూర్చుచు, అజ్ఞాతనాయకుల కలలగాంచుచు నుప్పొంగుచుండ, నాగబంధునిక ఆంధ్రవీరగాథలు, రామాయణ భారతాది గాథలు, భూర్జపత్ర గ్రంథసంపుటముల తీక్షణదృష్టితో సర్వకాలా పోశనము చేయుచుండును. నాగబంధునికకు శిల్పము, చిత్రలేఖనము ఉగ్గుపాల విద్యయాయెను. చిన్ననాటనుండియు జనకహస్తగతశిల్ప జ్యోత్స్నాపరిపోషిత యగు నా బాలిక చిత్రకారిణి యగుటలో నాశ్చర్యమేమున్నది.

నాగబంధునిక అల్లరిపిల్ల, అన్నగారగు సువర్ణశ్రీకుమారునితో కలసి అశ్వారూఢయై నగరబాహ్య ప్రదేశాలకు విహారార్థము పోయి అన్నగారితో పందెము వేయుచుండును. ఇంటికడ వారితోటలో అన్నగారితో కత్తిసాము చేయును. చెల్లెలగు సిద్ధార్థినిక నవలీలగనెత్తి, బంతివలె నెగుర వైచి పట్టుకొనుచుండును. సిద్ధార్థినిక కేకలు వేయుచు, “అమ్మా చూడవే! అక్కనన్ను బంతివలె చుక్కలవరకు నెగురవేయుచున్నది” అని అల్లరి చేయును. వారి యన్నయగు సువర్ణశ్రీ పరుగిడివచ్చి, నాగబంధునికను భుజముపట్టి యూపి, నవ్వుచు,

అడివి బాపిరాజు రచనలు - 2
హిమబిందు (చారిత్రాత్మక నవల)
• 17 •