పుట:Himabindu by Adivi Bapiraju.pdf/268

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఆనందదాయకమని తెలుపుచు, సంబంధము నిశ్చయముచేయవలసినది తనయన్న చారుగుప్తులవారే యని తెలిపినది.

చారుగుప్తునికడకు ధర్మనందియు, శ్వేతకేతులవారు, మహా మంత్రియు ఈ వివాహము విషయము రాయబారము వచ్చిరి. చారుగుప్తునకు వినయభిక్కు అమృతలతాదేవి యుద్దేశము తెలిపియుండుటచే చారుగుప్తులు సంతోషమున నియ్యకొనిరి.

రెండుదినములైన వెనుక ఒక శుభముహూర్తమున అమృతపాదులు, చారుగుప్తులు, మహామాత్యుడు, మహాసైన్యాధ్యక్షుడు, ధర్మనంది, సైన్యాధి కారులు, భిక్కులు, పండితులు కోటలో మహారాజ సమాలోచనమందిరమున జేరి సమవర్తి, నాగబంధునికల వివాహమును నిశ్చయము చేసిరి. చక్రవర్తియే తాంబూలము లిప్పించెను.

పలుపోకల బోవు ఆలోచనలతో సముచితవేషుడై, ఉత్తమాశ్వము నధిరోహించి సమవర్తి ధర్మనంది వసించు హర్మ్యమునకు బోయెను. సువర్ణశ్రీని చూడవలయుననియే యాతని యుద్దేశము. అంతరాంతరమున నాగబంధునిక కనబడదా యన్న యాలోచన!

ఆతడు “సమవర్తి వచ్చినా” డని లోనికి వార్త పంపెను. సేవకులు గుఱ్ఱముకడకు పరువిడి వచ్చి, గుఱ్ఱపు కళ్ళెమునంది పుచ్చుకొనిరి. శిల్ప విద్యార్థులు దారిచూప లోనికిబోయి సభామందిరమున నాతడు ఉచితాసనము నధివసించి యుండెను. సిద్ధార్థినికకు సమవర్తి వచ్చినట్లు తెలియదు.

“బావా బావా పన్నీరు
బావనుపట్టుక తన్నేరు”

అని పాడుచూ సభామందిరమునకు వచ్చి సమవర్తిని చూచి చటుక్కున ఆగిపోయెను. సమవర్తి “సువర్ణశ్రీ ఎచ్చటనమ్మా?” యని నువ్వుచు అడిగెను.

“మా అన్న పుణ్యక్షేత్రములు దర్శింప మహాబలగోండు యువరాజుతో పోయినాడు.

“అయ్యో! అతనితో మాటలాడవలెనని వచ్చినానే!”

“అలాగునా? మా అక్కవచ్చి మాటలాడునండి” యని యామె తుఱ్ఱుమనెను.

ఇంతలో “ఎవరండీ” యనుచు, చెల్లెలు మనచుట్టములు వచ్చినారని చెప్పుటచే నాగబంధునిక ఆ మందిరములోనికి వచ్చినది.

లోనికి ఆ బాల వచ్చుమార్గము సమవర్తి వెనుకవైపునున్నది. ఆ బాలికలోనికి వచ్చుటతోడనే ఎవరో కూరుచుండ యుండుట గమనించి “ఎవరండీ?” అని మరల ప్రశ్నించెను. సమవర్తి ఉలికిపడి లేచి నిలుచుండి ఆమెవైపు తిరిగి ఆమెను చూచెను.

“ఎవరండీ” అన్నమాట అచ్చటనే ఆగిపోయినది. ఆమె గుమ్మము కడ నిలుచున్నది. సమవర్తిని చూడగనే యామె చకితయై, లజ్జారుణిత వదనయై తలవాల్చి నిలుచుండి పోయినది.

9. ముక్తావళీదేవి

ముక్తావళీదేవి కిపుడు అరువది సంవత్సరము లున్నను ఏబది సంవత్సరముల స్త్రీవలె కనుపించును. ఆమె కీర్తిగుప్తుని భవనమున సగము యవనాలంకారాది మేచ్ఛాచారముల గొనివచ్చినది. యవనశిల్పులను కొందరిని రప్పించి యవనభవనములు

అడివి బాపిరాజు రచనలు - 2
హిమబిందు (చారిత్రాత్మక నవల)
258