పుట:Himabindu by Adivi Bapiraju.pdf/266

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8. పెళ్లి రాయబారాలు

యుద్ధము ముగియగానే సమవర్తికడకు తల్లి వచ్చినది. “నాయనా మనము పోయి హిమబిందును నీకిచ్చి ఉద్వాహమొనరించు టెప్పుడు” అని మా యన్నగారి నడుగవలయును. “మానాయనను కలుసుకొని ఇక్కడకు తీసికొనిరా! ఇంక పెద్దలను కొనిరా!” యని యామె కొమరుని కోరెను.

అమృతలత కోటీశ్వరుని తనయ, కోటీశ్వరేశ్వరుని చెల్లెలు. ఆమె మహారాణివలె పెరిగినది. మహారాణియైనది. ప్రతిష్ఠానమునకు మహారాజై ప్రియదర్శి సాతవాహన మహారాజుభార్య, సాతవాహన రాజ వంశమున మెట్టుట అభిజనాభిమానమునకు దోడైనది.

సప్తమాతృక లొకరై కుమారస్వామి ప్రేమించినట్లు ప్రేమించిన దామె పుత్రుని. సమవర్తి తల్లిమాట కెప్పుడును ఎదురాడలేదు. తాను నాగబంధునికను ప్రేమించినాడు. తల్లి హిమబిందును తనకై వాంఛించు చున్నది. ఆమె తన యన్నను నిర్బంధించును. ఏది ఎట్లగునో?

అందరునుపోయి చారుగుప్తునడిగిరి. అమృలతాదేవితో చారుగుప్తుడు నిషర్షగ హిమబిందును శ్రీకృష్ణసాతవాహన మహారాజున కిత్తునని తెలిపివేసెను. సమవర్తి ఆనందమున నిట్టూర్పు విడిచెను. వినయభిక్కుకొమరితను చూచి, “తల్లీ! నాకు చారుగుప్తుని హృదయ మప్పుడ యవగతమైనది. నీవు కోప మేల చెందెదవు? సమవర్తి హృదయము నా కవగతమైనది. ఆతడు ధర్మనంది తనయను ప్రేమించుచున్నాడు. ఆమెయు వీనిని ప్రేమించుచున్నది. సువర్ణశ్రీ కాశికాదిపురములకు ప్రయాణమైపోవుటకు ముందు నా కడకు వచ్చి “తాతగారూ! శ్రీసమవర్తి మహారాజును, మా చెల్లెలును ఒకరినొకరు ప్రేమించుకొనుచున్నారు. ఆర్యశ్రీ చారుగుప్తులవారు కొమరితను శ్రీకృష్ణమహారాజున కిత్తుమని నిశ్చయించిరి. నేనును హిమబిందుకుమారియు ధాన్యకటకమున నున్నప్పు డొకరినొకరము ప్రేమించుకొంటిమి. కాని చారుగుప్తులవారు కొమరితకు తన నిశ్చయము తెలిపిరి. మేము విడిపోతిమి. మహారాజునకు రాణియగు బాలికను నేను ప్రేమించుట యేమి యని క్రుంగిపోతిని. నేను దేశయాత్ర చేసెదను. స్వామీ! తాము సమవర్తి ప్రభువునకు, నాగబంధునికకు వివాహమగునట్లు ప్రయత్నించుడు. తాము ఆశీర్వదించినచో కార్యము సఫలమైతీరును. సెలవు” అని తెలిపి వెడలిపోయినాడు. కాబట్టి నీవు నీ కొమరుని ఆనందము మనస్సున తలచుకొనుము. ఆతనితోడిదే నీలోకము. పుత్రునియానందమే నీ యానందము. నీ పుత్రుడు మహావీరుడు. అతిరథుడు, ఆతని నేదో రాజ్యమునకు చక్రవర్తి పట్టముగట్టును. సువర్ణగిరియగు ముసిక నగరదేశము మహోత్తమమైనది. ఆ మహారాజ్యమునకు నీ తనయుడు ప్రభు వగునని చక్రవర్తి భావము. ఆ విషయము మహామంత్రులవారు సెలవిచ్చియున్నారు” అని బోధించెను.

అమృతలతాదేవి తండ్రిమాటలన్నియు విన్నది. ఆమె ఆశలన్నియు కూలిపోయినవి. జగదేకసుందరి యగు బాల తనకు కోడలగునని యాశించినది. తన కుటుంబమున ఉన్న కోటులన్నియు తన కొమరునకు వచ్చునని యనుకొన్నది. సార్వభౌములకే ఏడుగడ యగు తనయన్నగారు తన కొమరుని సార్వభౌములకు సమ మొనరించును అనుకొన్నది.

అడివి బాపిరాజు రచనలు - 2

• 256 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)