పుట:Himabindu by Adivi Bapiraju.pdf/262

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విభ్రాంతులై చెప్పుకొందురు. అట్టి ఉత్తమఋషి మనుమరాలట ఈ బాలిక! ఈ బాల నెట్లు విషకన్యను చేయగలిగిరో?”

“అదియే నాకును ఆశ్చర్యము కొల్పినది. శ్రీకృష్ణుని నాశనము చేయు నీ బాలిక నా మహర్షి ప్రయోగించెనట స్వామీ!”

“అవును. ఆ విషయములన్నియు బయటపడినవి. మహారాజా! శ్రీకృష్ణుడు ఆ బాలికను ప్రేమించుచున్నాడనుటలో నాశ్చర్యమేమియు లేదు. ఆమె సౌందర్య మతిలోకము.”

“హిమబిందుకుమారి సౌందర్యవతి కాదా స్వామీ?”

“కావచ్చును. హిమబిందు శిల్పసూత్రలక్ష్యభూత, సౌందర్య సర్వస్వము. కాని ఈ విషకన్యలోని సౌందర్యము మహోత్తమాభిదత్త మగు మూర్తిత్వము. సుందరరేఖా సమన్వితమూర్తి. ఒక్క హిమబిందుమూర్తికి తగ్గునేమో! కావుననే యువరాజు తన సర్వస్వముతో నీమెను ప్రేమించు చున్నారు.”

“ఆ బాలిక విషబాల యగుటవలన ఆత్మాభిదత్తత కుంటుపడిపోదా?”

“ఆమెను విషకన్యను చేయుటలో, ఆమె దేహము విషయుక్తమైనది. ఆమె హృదయము, ఆమెలోని ప్రకృతి, ఆమె బుద్ధియు, అహంకారమును విషయుక్తములు కాలేదు. ఆమెలోని మనోబుద్ధ్యహంకారా లమృతములేయైనవి. అమృతము నిండిన నీచపాత్రతో మనము పోల్చవచ్చును. ఆ పాత్రవిషముతో నిర్మించినా రనుకొందము. అట్టిది ఈ బాలిక.”

“విషకన్యకకు శ్రీకృష్ణునకు వివాహ మెట్లు గురుదేవా?”

“అదియే ఆలోచింపవలసిన విషయము మహారాజా! నేను స్థౌలతిష్యులవారిని సందర్శించి వారిహృదయమును కరగింప ప్రయత్నింతును. ఆపై భగవాన్ బుద్ధదేవుని కరుణ!”

“ఆచార్యదేవా! చారుగుప్తుడు ఆంధ్రదేశమునకు శేషునివంటివాడు గదా!”

“అవును.”

“అతనికి సర్వప్రపంచము హిమబిందుకుమారి!”

“అవును.”

“ఆమెను యువరాణి య నాతనితపస్సు. అందుకే ఆమెకు సర్వవిద్యలు నేర్పించినాడు వర్తకచక్రవర్తి. ఆమెకై తన అనంతములైన సర్వైశ్వర్యములు నర్పింప సిద్ధముగ నున్నాడు.”

“ప్రభూ! బాలికలు సర్వసాధారణముగా నీడువచ్చినవెంటనే ప్రేమాభియుక్తలై యుందురు. ప్రేమ వ్యక్తి రూపమున సాక్షాత్కరింపదు. ఆ సమయములందు ఒక బాలికకు వరుని ఏర్పాటుచేయుదురు పెద్దలు. ఆ బాలిక తన వరుని ప్రేమించును. కాని ఒకసారి యుక్తవయస్కయగు నొకబాలిక వరుని తాన ఎన్నుకొని, ఆతని గాఢముగ ప్రేమించినచో ఆ బాలికను వేరొక్కని కిచ్చి వివాహముచేయుట ఆ బాలికచే వ్యభిచార మహా దోషము చేయించుటయే!”

“చిత్తము ఆచార్యదేవా!”

“హిమబిందు తనసర్వస్వము ఒక బాలునికి దత్త మొనర్చుకొన్నది. ఆ బాలు డామెను ప్రేమించుచున్నాడు. అట్టి బాలికను యువరాజున కెట్లు ఇత్తురు. చారుగుప్తుడైన అధర్మమున కెట్టియ్యకొనును?”

అడివి బాపిరాజు రచనలు - 2

• 252 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)