పుట:Himabindu by Adivi Bapiraju.pdf/252

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పనిపై వెడలిపొమ్ము. నేను సమదర్శి ప్రభువును దర్శించి యీ యాజ్ఞాపత్రము వారికి సమర్పింతును” అని తెలిపినాడు.

“పొమ్ము. నాగూ, నీతో మనవీరులను పదిమంది గోండునాయకులను కొని పొమ్ము .”

ఆ బాలవీరుడు సంపూర్ణ కవచధారియై ఉత్తమాజానేయు మధివసించి, కతిపయ వీరులను తీసికొని, మహాగోపురముకడ జరుగు యుద్ధమును జేర బోయెను.

ఆ బాలుని హృదయము ప్రథమమున ఆ భీకరయుద్ధమునుగాంచి కొంచెము వెరపునందెను. కాని యాతడు వెంటనే సమ్మాళించుకొని, ఆంధ్రదళపతులకు, చమూ పతులకు, ముఖపతులకు సర్వసైన్యాధ్యక్షుల ఆజ్ఞాపత్రము చూపించుచు, కోటనుండి సువ్వున ప్రాణబలికోరివచ్చు నిశిత శరముల తప్పించుకొనుచు, ఫలకమును ఒడ్డుచు, తన గుర్రమును విచిత్ర గతుల నడుపుకొనుచు, ముందునకు పోయినాడు.

సమవర్తి తాత్కాలికముగ నక్క డేర్పరచిన ఒకచిన్న మట్టి బురుజుపై నుండి యుద్ధము నడుపుచుండెను. ఇంతలో ఆతని చారు డొకడు సమవర్తిని డాసి, “మహాప్రభూ! సర్వసైన్యాధ్యక్షుల ఆజ్ఞకొని యొకవీరు డరుదెంచినాడు” అని మనవిచేసినాడు.

“ప్రవేశపెట్టు” మని సమవర్తి ఆజ్ఞనిడి యుద్ధయంత్రముల ప్రయోగించు యాంత్రికులకు నాజ్ఞలిడు పనిలో మునిగిపోయెను.

“మహాప్రభూ! జయము, జయము!” అను మధురస్వరము వెంటనే వినవచ్చెను. మధురము, గంభీరము, నిషాదస్వరపూరితమైన యా మాట విని సమవర్తి యాశ్చర్యమంది యావైపునకు జూచెను.

ఎదుట చిరునవ్వుతో సంభ్రమగౌరవపూరితదృష్టుల బరపు సుందరుడగు బాలవీరుడు సర్వాయుధోపేతుడై, కవచధారియై నమస్కార మిడుచు నిలిచియుండెను.

“ఎవరయ్యా నీవు?”

“మహాప్రభూ! తమ సేవకుడను. సర్వసైన్యాధ్యక్షుల యాజ్ఞాపత్రం గొనివచ్చితిని” అని ఆ బాలకుడా పత్రము సవినయముగ సమవర్తి కందించెను. సమవర్తి ఆ పత్రము చుట్టవిప్పి, చదువుకొని “ఏమయ్యా, నిన్ను నాకడ నంగరక్షకాధికారులలో నొకనిగ నియమించినారు. నీ వయసు పదునేను వత్సరములకు మించియుండదు. నీవు నన్నెట్లు రక్షించగలవు?” అని ప్రశ్నించినాడు.

“మహాప్రభూ! నేను అంగరక్షకులలో మేటిని.”

“మాటలు వేరు, పనులు వేరు. నీవుబాలుడవు, ముక్కుపచ్చ లారలేదు. ఆ చెంపలనుండి పాలింకను స్రవించుచున్నట్లే యున్నది.”

“సైన్యాధ్యక్షా! నా పనిని పరిశీలించుడు. నేను తమకు ఉపయోగించుచో ఉంచుకొనుడు, లేనిచో పంపివేయుడు.”

“ఒకసారి నీవు చేరినవెనుక పంపివేయుట ఉండదు. సరే, పని యందు ప్రవేశింపుము.

“కృతజ్ఞుడను.”

వెంటనే ఆ బాలవీరుడు సమవర్తి అంగరక్షకులలో నొకడయ్యెను. ఆ బాలకుడు సమవర్తిపై ఈగనైన వాలనీయడు. తన్ను తోడివీరులు పరిశీలించుచుండ ఆతడు తన

అడివి బాపిరాజు రచనలు - 2

• 242 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)