పుట:Himabindu by Adivi Bapiraju.pdf/250

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

“నీవు హిమబిందుకుమారిని చూచితివా? యని అడుగదలచితివి. ఆమె యేమనినది? ఎట్లున్నది? ఇవీ నీ ప్రశ్నలు, నిజముకాదూ?”

సువర్ణుడు మెత్తని సెల్లాలచే దేహము తుడుచుకొని, నాగబంధునిక వస్త్రము లందీయ ధరించుచుండెను.

“అవును చెల్లీ! హిమబిందు పై ప్రేమ వదలలేను. ఆ దేవి యువరాణి కాబోవుచున్నది. అదియు నాకు సంతోషము. ఆమె ఆనందమే నాకు కడుగూర్చునది.” .

“ఓహో ఎంతటి ఉదారహృదయము అన్నది!”

“నామాట అటు లుంచు. నీహృదయమున ఉన్న ప్రశ్న నేను గ్రహించితిని.”

“అది వట్టి ఊహమాత్రమే యగును.”

“కానిమ్ము, నీవు సమవర్తిని గురించి యడుగదలచితివి. తథాగతుని తలచి నిజముచెప్పు, అవునా కాదా?”

“అవును అన్నా! చిన్నతనాననుండియు నాకు నీవే ఎక్కువ స్నేహితుడవు. నా స్నేహితురాం డ్రెవ్వరికిని చెప్పని రహస్యములునీకు గదా చెప్పుచుంటిని.”

“సమవర్తి ఉత్తమవీరుడు, మహాపురుషుడును. ఉజ్జయినికోట నాతడు రక్షించిన విధానము, ఆ నగరప్రజల నాతడు కాపాడిన రీతి, వారిపై ఆ వీరుడు వర్షముకురిపించిన ప్రేమ, ఆంధ్రసైనికుల ఆ సైన్యాధ్యక్షుడు తండ్రివలె కాపాడిన చరిత్ర-ఒక్క మహా ప్రబంధమునకు విషయమయి తీరును.”

“మగధదేశములో నుంటిమి, నీవు మాగధుడవై పోయితివా ఏమి?”

“ఓసి వెఱ్ఱిపిల్లా! మంచివారినిగురించి చెప్పుటలో మాగధులైన నేమి, వందులైన నేమి? సమవర్తికి ఉత్తమస్థితి నందవలెనని కాంక్ష యున్నది. ఆతడు హిమబిందును వివాహమాడ సంకల్పించుకొనుటయు తన ఆశలకు సిద్ధిని సమకూర్చుకొనుటకే!”

“హిమబిందుకు ఆయనకు వివాహ మెట్లు?”

“హిమబిందు నాతడు ప్రేమింపలేదు. సమవర్తి ధర్మహృదయుడు. ఆతనికి ఎవ్వరి పైనను ప్రేమ కలగనేలేదు. ఆతడు ఒకరిని ప్రేమించి, వేరొక బాలిక నుద్వాహమగు అధర్మ చిత్తవృత్తి కలవాడుకాడు. ఆర్య గృహస్థునివలె వివాహమాడిన భార్యను తన ప్రేమచే ముంచివేయును.”

“ప్రేమింపక, వివాహమాడినవెనుక ప్రేమ కలుగుటెట్లు అన్నా!”

“ప్రేమ రెండువిధములు చెల్లీ! ఒక పురుషుడు, ఒక స్త్రీయు ఒక మహాప్రేమ ఫలభాగులై జన్మింతురు. వారుకలుసుకొందురు, ప్రేమింతురు ఆమెకు అతడే దైవము, ఆతనికి ఆమెయే దేవి. ఆమె వినా ఆతడు పర వనితను కన్నెత్తి చూడలేడు. ఆమె తన సహధర్మచారిణి కానినాడు ఆతడు భిక్షుకుడే! ఆమెయు నంతియే.”

“అవును అన్నా!”

“ఇంక రెండవ జాతివారు. ఆజాతి యువతీయువకులు వివాహితాత్పూర్వము ఎవరిని ప్రేమింపరు. వారు ప్రేమోన్ముఖులై మాత్ర ముందురు. వారు వివాహమాడిన వెనుక యువతులు తమ భర్తలను, యువకులు తమ భార్యలను గాఢముగ ప్రేమింప ప్రారంభింతురు.”

అడివి బాపిరాజు రచనలు - 2

• 240 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)