పుట:Himabindu by Adivi Bapiraju.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సహాయముతో జరిపియుండుననికదా శుకబాణుల వారు అభిప్రాయ మందినారు. వారితో మహారాజును, మహామాత్యులు, సర్వ సైన్యాధక్షులు ఏకీభవించినారు.

రాజ్యమునకై ప్రయత్నమా? కసితీర్చుకొను ప్రతీకారమా? ముక్కుపచ్చలారని బిడ్డను కొనిపోవ వారి హృదయ మెట్లొప్పినది? శుకబాణుల చారులు దేశమునంతయు దువ్వెనతో దువ్వినారు. ప్రభువు అనుమానమును శుకబాణుల అనుమానమును, స్థౌలతిష్యమహర్షి మీదనే ఉన్నది. కాని ఎన్నివిధములైన మాయలు పన్నినను, అనుమానాత్మకమగు ఒక చిహ్నమైన స్థౌలతిష్యమహర్షి యాశ్రమమునందు గోచరింపలేదట. వారి ఆశ్రమములో వైద్యశాలలున్నవి. సర్పవైద్యమునకై అష్టఓషధుల తోటలున్నవట. మంత్రములకు కట్టుబడి పెద్దపులులు, సింహములు, చిరుతలు మొదలగు క్రూరమృగములెన్నేని యాతని మృగశాలయందున్నవట.

విద్యార్థులై దేశదేశములనుండి ఎందరో పండితులు, ఋషులు, కాపాలికలు, యోగులు వచ్చుచుందురు. వైద్యమునకు ముక్తికి మంత్రోప దేశములకు లక్షలమంది ఆ పవిత్రాశ్రమమునకు వచ్చుచుందురు. ఆ మహర్షి రాజకుటుంబమన్న ప్రేముడికలవాడు. తన తాతగారి సహాధ్యాయుడు సర్వతంత్ర స్వతంత్రుడు.

వారణాసిలో, తక్షశిలలో, విష్ణుప్రయాగలో, హృషీకేశములో, నవద్వీపమునందు, ధాన్యకటకమునందు, నర్మదాతీరమున, కావేరీతీరమున ఇట్టి మహాపండితుని, ప్రజ్ఞావంతుని ఎచ్చటను చూడలేము? అయినను స్థౌలతిష్యునిమాట తలచుకొన్నచో ఏదియో తనకు భయము కలుగును. శుకబాణులవారు కొందరిని అనుమానించి తనతమ్ముని మంజుశ్రీరాజకుమారుని తస్కరించుకుపోయినవారు వారేనని నిర్ధారణ చేసినారు. అయినను మూల కారణుడు స్థౌలతిష్యులవారేననియు శుకబాణుల యనుమానము. శ్రీకృష్ణుడట్లు కక్ష్యాంతరముల గడచి, చక్రవర్తియున్న సాహిత్యమందిరము చేరెను.

శ్రీముఖుడు చిరునవ్వుతో, “బాబూ, మీకు ధాన్యకటక నగరాతిథ్యము ప్రీతికరముగ నున్నదా?” యని ప్రశ్నించెను.

“మహాప్రభూ! నా విడిది యధానందదాయకమైయే యున్నది. అయిన నొక్కచిన్న సంఘటన జరిగినది. ఎచ్చటనుండియో ఒక తెల్లనిత్రాచు నేను తమ దర్శనార్థము వచ్చుచుండ నెదుటబడి, ఆడి, మరుక్షణమున మాయమైనది” అని శ్రీకృష్ణుడు జనకునకు విన్నవించెను.

ఇంతలో మాంత్రికుడగు నొకభిక్షుకు డచ్చటికివచ్చి “మహాప్రభూ! మహారాణీగారు యువరాజులుంవారికి పాము కనబడినదనియు, తత్సంబంధ మంత్రోచ్ఛాటనాదులచే యువరాజులకు ఆపద ఘటిల్లకుండ చూడవలె ననియు మహాసంఘారామమునకు గురుపాదులకు వార్తనంపిరి. వెంటనేవారు నన్నిక్కడకు పంపిరి” యని విన్నవించెను.

మహారాజు ప్రశ్నార్థకముగ నా బిక్షుకునివంక చూచుచు “దయచేయు” డని యొకపీఠము చూపించెను. ఆతడు పీఠ మథివసించుటయు,

“అది పాలవలె, వెన్నెలవలె తెల్లటిపాము” అని యువరాజనియెను.

“మహాప్రభూ! శ్వేతపన్నగములు మనుష్యుల కండ్లపడవు. పడినచో నా పురుషునకు గాని, వనితకుగానీ ఏదియో ఉత్తమశుభము చేకూరగలదని సర్పశాస్త్రము శకునశాస్త్రము చెప్పుచున్నవి. శ్వేతపన్నగ సందర్శనమునకు మంత్రతంత్రములేమియు నవసరములేదు.

అడివి బాపిరాజు రచనలు - 2

• 15 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)