పుట:Himabindu by Adivi Bapiraju.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కూర్చుండ బెట్టుకోగల భాగ్యము మాకు వచ్చునా! అందుకు మీరందరు ఏమరుపాటులేక ప్రయత్నములు చేయుచునే యున్నారు, అయిన నా అదృష్టమెట్లుండునో!

శ్రీకృష్ణుడు: అమ్మా! మీరు కంట తడి పెట్టకుడు. తమ్ములు బ్రతికి క్షేమముగ నున్నారని తెలిసికొన్నాను. ఆ సాక్ష్యము అనుమాన రహితమైనది, శుకబాణులవారే తెచ్చినారు.

మహారాణి: అవును తండ్రీ, మహారాజుగారు ఆ విషయమును చెప్పినారు. అందుకే ఈ మాత్రము ధైర్యముగ నున్నాను. నేనును, మహారాజుగారును త్రయంబకమునకు...

శ్రీకృష్ణుడు: అవును జననీ! తామును చక్రవర్తియు ఎప్పుడు త్రయింబక గౌతమీ జన్మస్థలమునకు రాగలరు?

మహారాణి: సార్వభౌముడు ఒకసారి పశ్చిమదేశాలకు రావలెనని యనుకొన్నారు. త్వరలోవారు ఏదియేని నిర్ణయమునకు వచ్చెదరనుకొందును.

శ్రీకృష్ణుడు: అమ్మా! తమ పాద సేవ చేయుటకు వచ్చుచుండ, నాకీదినమున ఒక తెల్లని తాచుపాము శకునమైనది. దానికి ఫలమేమో యని ఆలోచించుచున్నాను.

మహారాణి: ఏమిటి తండ్రీ! పామా! బుద్ధభగవానుని రక్ష, నీకు పరమేశ్వరామృత రక్ష! చిరంజీవ! చిరంజీవ! ఎచ్చట ఈ పాము కనబడినది? రాచబాటనా!

శ్రీకృష్ణుడు: లేదు తల్లీ! మహాభవనానికి పయనమై అలంకార మందిరము దాటివచ్చిననాకు మందిరాంగణమునం దది ఆడుచు ప్రత్యక్షమైనది.

మహారాణి కొమరుని శిరము పొదవిపట్టుకొని తనమోమున కాన్చి కొని మరల వదలినది.

శ్రీకృష్ణ సాతవాహనుడు ఇంచుక నవ్వుచు తల్లిమోమున చూడ్కివఱపి

“జననీ! తాము మహాంఘారామానికై కట్టించు విహారము పూర్తియయినదను కొందును. గురువులగు అమృతపాదార్హతులకు దాని నర్పించు శుభ ముహూర్తమెపుడు?” అని ప్రశ్నించెను.

“బాబూ! మీ తండ్రి గారును, నేనును సౌందర్యనిధియగు కోడలిని వరియించినాము. బాలిక చిత్రమును జూచి నీ యభిప్రాయము చెప్పవలయును. నీ వివాహమును, విహారార్పణము ఒకమారే” అని కుమారుని వైపునకు తిరిగి యా సామ్రాజ్ఞి చిరునవ్వు తెచ్చుకొనుచు పలికినది.

శ్రీకృష్ణసాతవాహనుడు నవ్వుచు “శ్వేతపన్నగ సందర్శన ఫలితమా తల్లి!” అనుచు వంగి తల్లిపాదముల నంటెను.

సార్వభౌముని దేవేరి, పుత్రుని నవ్వుచూచి, ఏదియో అవగతము చేసికొన ప్రయత్నించుచు, చిరునవ్వుతో తీవ్రాలోచనసలిపి, సుతునిశిరముపై చేయినుంచినది.

శ్రీకృష్ణసాతవాహనునకు తన తమ్ముని, మంజుశ్రీని, చోరులు తస్కరించుకొని పోవుటలోని ఉద్దేశ్య మెంత ప్రయత్నించినను అర్థముకాలేదు.

చక్రవర్తి అంతఃపురములోనికి చొచ్చుకొనిపోయి, మాయావేషములతో మహాధైర్యముతో వేయిమంది రక్షకభటుల, రక్షకస్త్రీల, కంచుకుల, ద్వారపాలుర దాసీజనముల మధ్యనుండి రాజకుమారుని ఎత్తుకొనిపోగల దిట్టరి ఎవడు?

ఇది ఒకరిపని కాదు. అత్యంత సమర్థుడైన పురుషుడు కొన్ని వేలమంది సహాయంతో, అంతఃపురములోని దాసదాసీజన సహాయముతో, కొందరు రక్షకభటుల

అడివి బాపిరాజు రచనలు - 2

•14 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)