పుట:Himabindu by Adivi Bapiraju.pdf/238

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విష: నవ్వుచు, అయినచో నావంటి యొక సాలభంజికను చేయించి, దానిని దినదినము చూచుకొనుచుండుడు.

శ్రీకృష్ణ: సాలభంజికనా! ప్రతిమలు నా కెట్లు తృప్తినీయగలవు? చంద్రబాలికా! నేను నిన్నే పూజింపవలయును.

విష: నన్నా! నన్ను పూజింపకూడదు. పాముతో ఆటలాడెదరా? అగ్నిని ఒడిని ధరించెదరా? ఎవరైనను మృత్యువును పూజించెదరా?

శ్రీకృష్ణ: నీవు మృత్యువని ఎవరు చెప్పిరి?

విష: మా తాతగారే యనిరి.

శ్రీకృష్ణ: మీ తాతగా రెంత మూర్ఖుడు! అంత తపస్వి ఇట్టిఘోరమున కెట్లు పాలయినాడు? ఆ మాటల కేమి పోనిమ్ము. నీ మందిరమునకు నేను వచ్చుచుండ నీవు దివ్యగాంధర్వ మాలాపించుచుంటివి? ఏదీ, నీ వీణపై నా యీ సర్వవేదనలు మరచునట్లు వాయింపుము. చంద్రదేవీ! నీ గానచంద్రికామృతాస్వాదినై దివ్యత్వ మందెదనుగాక!

విషకన్యక సంతోషమున, సిగ్గున తన రత్నకంబళి పై నధివసించి కాండవీణను చేతదాల్చి మధురసుధాగానాలాపన మారంభించినది. 

27. గాంధర్వ ప్రభావము


గీతి గానేన యోగ స్స్యాత్ యోగాదేవ శివైకతా
గీతిజ్ఞో యది యోగేన సయాతి పరమేశ్వరం.

(సూత సంహిత)

ఆమె కిప్పుడు గానమున బరమార్థము గోచరించినది. ఇంతకు మున్నామెకు పాటలు బాల్యక్రీడలు. యవ్వనము వచ్చినవెనుక, పరభృతము తన పెంటికి మరులుగొల్పు విధమున, అప్రత్యక్షుడై యున్న తన నాయకుని కొరకై ఆమె పాటలు పాడినది. గానముచే కాలక్షేపము చేసినది. నేడు నాయకుడు ప్రత్యక్షమైనాడు. ఇప్పు డామె నిండుజవ్వని. ఇప్పుడామె భక్తురాలు. ఆమెకు నాయకుడే భగవంతుడు. ఆమెకు భగవంతుడు, నాయకుడు వేరు వేరుగా స్ఫురింపనే లేదు.

ఆమె ఆలపించిన భైరవిరాగము సామగానగ్రామము. ఆమె కంఠమున వెన్నెలలు కురిసినవి. మల్లెలు, జాజులు, శేఫాలికలు గుత్తులు గుత్తులై విరిసిపోయినవి. ఆమె నాదమున అమృతనదులు పొంగుచు, పొరలుచు, గట్టులమీరి ప్రవహింపుచు వచ్చినవి. ఆమె పాటపాడు విధానమున తారకా కాంతుల నొరసికొని నాట్యమాడు కల్యబాలికా నృత్తగతులవలె నుండెను. తప్తజంబూనదమున శోణవర్ణము కలిసినట్లున్న యామెగళము ఆమె పాడు నప్పుడు, ముడుచుకొనియుండి విడివడబోవు బంగారు కమలకోరకముపై ఉదయార్కకిరణములు ప్రసరించి నట్లుండెను.

ఆమె ఈ కొలదిదినములలో కొంచెము చిక్కినది. ఆమె ఈ నెల దినములలో కొంచెము పొడు గెదిగినది. ఆమెలో నేదియేని యొక దివ్యమగు తృప్తి భాసమానమై పోయినది.

ఆమె అందము వర్ణనాతీత మగుటవలన ఆమె ప్రతి అణువును మోక్షార్తుడగు మహర్షివలె శ్రీకృష్ణసాతవాహనునికై ఆర్తి చెందుచుండెను.

అడివి బాపిరాజు రచనలు - 2

228

హిమబిందు (చారిత్రాత్మక నవల)