పుట:Himabindu by Adivi Bapiraju.pdf/237

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈ ఈశానునకు నేనలంకార మెట్లగుదును? ఆత డమృతస్వరూపుడు. నేను మృత్యుకల. పరమేశ్వరుడు నన్నీ దివ్యమూర్తికంట నేల బడవైచినాడు? ఆ మహారణ్యమున దుర్భర క్షుత్పిపాశావశనైన నాకు అంత మేల రాలేదు? ఈ దివ్యమూర్తికి నే నెట్లు సేవచేయగలను? దూరముననుండియైన ఈ మహారాజుతో మాటలాడుటకు వీలులేదు. నా సేవచేయు నీ పరిచారికలే మహర్షియైన ఆ వైద్యుని సహాయము పొందియు నాకడకు వచ్చుటకు గజగజలాడి పోవుదురు. క్రిమికీటకాదులుకూడ నాకడకు వచ్చుటకు భయపడును.

“నన్ను కుట్టిన చీమయు చచ్చిపోవునుగదా! నేను భవన గవాక్షముల నుండి తోటలోనికి తొంగిచూచినప్పుడు ఆ తోటలోని బాలబాలికలు వెన్నెల కిరణములవలె ఎంత చక్కగ నాడుకొనుచుందురు! వారిదికదా ఆనందము! జన్మము మృతితో అంతము కాదుకదా! అయినచో నే నిది వరకే మరణమును హృదయమున కద్దుకొనియుందును. ఈ మహారాజు నన్ను ప్రేమించుచున్నాడు. ఆతని చూచిన మొదటి లిప్తలోనే నాథునిగ ప్రేమించితిని.

ప్రేమ ఎంత దివ్యానందదాయకము! తాతగారు వచించిన మోక్ష మున్నదియో, లేదో తెలియదు. ఆ మోక్షము శుద్ధానంద స్వరూపమట! ఆ విషయమును గూర్చి నే నేమి చర్చింపగలను? కాని ఇన్నాళ్ళకు నిజమగు ఆనందమేమియో తెలిసినది. శ్రీకృష్ణసాతవాహన మహారాజును నాశనము చేయ నన్ను ప్రయోగించినారు తాతగారు. ఆ శ్రీకృష్ణుని నే నిట్లు ప్రేమించుట ఏమి! ఇట్టిది జరుగునని భయమందియేకదా నన్ను ప్రయోగింపవల దని తాతగారి నా దినమున వేడికొనినది! తాతగారుచేసిన పనియు మంచిదే యైనది. కాకున్న నే నీ ప్రభువును, ఈ దివ్యమూర్తిని ఎట్లు చూడగలుగుదును? ప్రయోగ మన, నాశన మన, ప్రేమ యన నేమియో ఆ దినముల దెలిసెడివి కావు!”

పాట మాని ఆలోచనావశయై యున్న విషకన్యకడకు శ్రీకృష్ణసాతవాహనుడు వచ్చియున్నాడు. ఆతడు దివ్యునివలె భాసిల్లుచుండెను. ఆతడు వచ్చుటయు, చకితయై విషకన్యక లేచి, దూరముగ నుండియే నమస్కరించుచు, మోకరిల్లినది.

శ్రీకృష్ణుని కన్నులవెంట నీరు తిరిగినది. ఆమె అది చూచినది.

విషకన్యక: ప్రభూ! ఎందులకా కన్నుల నీరు? ఆమె మాట లాడువిధమే ఈ దినములలో మారిపోయినది.

శ్రీకృష్ణ: దేవీ! నీకు సర్వసౌకర్యములు జరుగుచున్నవా?

విష: వచ్చినప్పుడెల్ల అట్లడిగెదరు, నాకేమి లోపమని? ఆ లోపము నీ సౌకర్యములు తీర్చగలవా? అట్టి శంకతోడనా మీ కన్నుల నీరు?

శ్రీకృష్ణ: అదికాదు చంద్రా! కన్నుల నేదియో పడి నీరు తిరిగినది. వేరు కారణము లేదు. మీ తాతగారిని చూడ నీకు కోరిక పుట్టుట లేదా?

విష: మాతాతగారిని నేనెట్లు చూడగలను? నా కేమియు ఆ ఆలోచనలు కలుగవు ప్రభూ! మీ రెందుకు ఈసారి పూర్తిగ ఏడుదినములు ముగియకుండగనే వచ్చినారు?

శ్రీకృష్ణ: నేను ఏడు దినములు గడపుట బ్రహ్మప్రళయ మగుచున్నది. దినదినమును చూచుటకు వీలులేకపోవుచున్నది.

విష: అమ్మ! దినదినము నీ విషకీటకమును చూచుటకు వచ్చి మీ రేల ఆపద పాలగుదురు?

శ్రీకృష్ణ: ఆపద సంభవించకుండ దినదినము నిన్ను చూచుటకు రావలెను. లేనిచో నాసర్వస్వము మహాసముద్రమున పడిపోవుచున్నది.

అడివి బాపిరాజు రచనలు - 2

• 227 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)