పుట:Himabindu by Adivi Bapiraju.pdf/236

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది



26. వీణాగానము

విషకన్యక శ్రీకృష్ణసాతవాహనుడు తనకడకు వచ్చుటకుముందు వీణ వాయించు చుండెను. ఆమె చేతనున్న వీణ కాండవీణ. కాండవీణ, కర్కారి, వాణవీణ వేదవాద్యములు. ఆంధ్రులకు కాండవీణయనిన పరమప్రేమ. వారు కాండవీణను మయూరిగా నొనర్చి రత్నఖచితముచేసి, పన్నెండు స్వర భేదములకు పన్నెండు తీగెలను బిగించెదరు. ఆ వీణ ఎక్కుపెట్టిన ధనుస్సువలె వంగి యుండును. ఏ మేళము వాంఛింతురో ఆ మేళమునకు సరిపోవునట్లుగ తీగ లన్నియు శ్రుతి కలుపవలెను.

విషకన్యకకు వేదసాంప్రదాయసిద్ధమైన సామగానమే స్థౌలతిష్యులు నేర్పించినారు. లౌకిక సాంప్రదాయమున ఆంధ్రులు శుద్ధస్వరములతో కనకాంగీ మూర్ఛనను లోకమున వెదజల్లిరి. సామగానమున తారశ్రుతినుండి మంద్రమునకు వచ్చి దిగుదురు. లౌకికమున మంద్రమునుండి తారకు బోదురు. సామము అవరోహణము. లౌకికము ఆరోహణము.

లౌకికమున మాగధు లొక విధాన మవలంబించిరి. ఆంధ్రులు మరి యొక విధాన మవలంబించిరి. ఔత్తరాహులు మధ్యగ్రామవాదులు, పంచమము సాందీపినియై మూడవ శ్రుతిస్థానము చెందును. ఆంధ్రులు షడ్జ గ్రామవాదులు. పంచమము నాలుగు శ్రుతులలో ఈ గ్రామము మహదానంద స్వరూపమైనది.

భారత యుద్ధానంతరమున కలిగిన మహాప్రళయమునను, జాతిసంకరమునను లౌకిక విధానము పెరిగిపోయినది. బౌద్ధమతము దానిని ప్రోత్సహించినది. కాని బౌద్ధులైన ఆంధ్ర సాతవాహనులకాలము వచ్చువరకు దానికి ఎక్కువ పోషణ లేకపోయినది. అతిపురాతన మగు వేదసంప్రదాయము నాశనమగుచున్నదని స్థౌలతిష్యులు మహా పండితులచే పరిష్కరింపజేసి విషాదస్వర ప్రారంభ మగు సామగాన గ్రామవిధానమున సంగీత శాస్త్రమును పరమాభివృద్ధినందింపజేసిరి. సామగానమున కైలాసేశ్వరునైన నాట్యముచేయింపగలదు విషకన్యక.

అంతర్గాంధారయుక్తమై, ఔడవమైన ఆభోగి రాగముతో సామగాన మార్గమున -

“నీవే శివుడవు
నేనే నీ పదపూజకు
సూనమునై వ్రాలెద నిట.
గానములోనే రాగము నీవై
రాగములోనే స్వరమును నేనై
దివ్యములగు నీ చూపులె ఈశా
దీనను నను మండింపగ లేవా! నీవే.”

ఆ పాట పాడుకొనుచుండగనే ఆమె కన్నుల నీరు పద్మములందు చేరిన హిమబిందువులవలె మిలమిలలాడిపోయినది. “ఈ జన్మసాఫల్యమునకు ఈ కృష్ణసాతవాహన మహారాజు అవతార మెత్తిన పరమశివుడు. హాలాహలమును ఈశానుడు తన కంఠమున నిలిపికొన్నాడట. హాలాహల విషసదృశనైన నన్ను తన పాదములనైన నీ ఈశానుడు నిలుపుకొనునా? కాలకూటవిషవదనమగు మహానాగ మతనికి అలంకారమట.

అడివి బాపిరాజు రచనలు - 2

• 226 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)