పుట:Himabindu by Adivi Bapiraju.pdf/231

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది



24. స్వప్నము

“మహాప్రభూ! నా కొమరిత హిమబిందును, యువరాజశ్రీ శ్రీ శ్రీకృష్ణ సాతవాహన మహారాజునకు కళత్రముగ నర్పింప నేను ప్రభువుల ననుజ్ఞ వేడుటయు తా మందుకు సంతోషముగా నియ్యకొనిరి. శ్రీశ్రీశ్రీ ఆనందదేవి మహారాణివారును శుభ మనినారు. ఈ విషయము శ్రీశ్రీశ్రీ యువరాజులవారికి తెలియ నంపుటకు తమకడకు వచ్చి యున్నాను” అని చారుగుప్తుడు విన్నవించెను.

“వర్తకచక్రవర్తీ! శుభము. యువరాజును, శ్రీ చిరంజీవి సౌభాగ్యవతి హిమబిందు కుమారియు ఉజ్జయినికడ కలిసికొనిరిగాన అచ్చటికే యీ శుభవార్త పంపినచో మన సంకల్ప మీడేరుటు సుకర మగును.”

“ప్రభూ! తాము నా హృదయమును గ్రహించినారు.”

“మంచిది! కాని తమ పుత్రిక ఈ విషయ మెరుగునా?”

“ఎరుగును మహాప్రభూ! నేను ఈ జైత్రయాత్రకు బయలుదేరక పూర్వమే అమ్మాయికి తెలియజేసితిని. ఆమె ఆనందమందినది. ఇట్టి భర్త లభింపనుండ ఉప్పొంగక యుండు కన్య యుండునా!”

“మీ తనయ అపురూపసుందరి యనియు, సకలగుణాభిరామ యనియు, సర్వశాస్త్ర పారంగత యనియు వింటిమి. ఈ యేటి శకటపరీక్షా మహోత్సవమున నాట్యమాడిన బాలలలో నామె యొకరిత కాదూ?”

“చిత్తము. చిత్తము.”

“సంతోషము. ఆమె గగనమునుండి దిగివచ్చినట్లున్నది. అట్టి బాలిక మహారాణి యగుటచే ఆంధ్రదేశము, మా పెద్దకోడలగుటవలన మా కులముగూడ తరించును.”

చారుగుప్తుడు వెంటనే వ్రాయసకానిచే చక్రవర్తి శ్రీకృష్ణసాత వాహనున కీ శుభవార్త నందజేయునట్లు కమ్మను భూర్జపత్రముపై వ్రాయించి, అది సామ్రాట్టుకడకు పర్యవేక్షణకై పంపినాడు. చక్రవర్తియు నది చదివికొని శ్రీశ్రీశ్రీ కౌశికీపుత్ర శ్రీముఖనామాంకిత ముద్రవేయించి, నమ్మిన చారులచే వెంటనే యా శుభలేఖ నంపించవలసినదిగ ముఖ్య మంత్రికి బంపెను.

చారుగుప్తుడు చిరతరమగు తనకోరిక ఈడేరు సమయ మరుదెంచెనని ఆనంచమున మిన్నంటెను. ఈ సువర్ణశ్రీగాక, శ్రీకృష్ణసాతవాహనులే రక్షించియుండవలసినది తన బాలికను. బాలికల హృదయము మైనము వంటిది. ఒక్కొక్క సమయములో బాలిక యొకనిజూచి మరులు గొనవచ్చును. అది ఆమె హృదయమున నెలకొన్నచో మఱి మరల్ప జాలము. తన బాలిక శ్రీకృష్ణసాతవాహనుని చూచెను. ఆతడు మహా వీరుడు, పరమ సుందరుడు, భావిచక్రవర్తి. తన కోరిక బిడ్డకు దెలిపియే యున్నాడు. పెద్దలమాట జవదాటి ఎరుగని ఆ సుశీల ఈపాటికి తన హృదయమంతయు యువరాజున కర్పించియుండును.

స్థౌలతిష్యులవారు శ్రీ ముక్తావళీ దేవినికూడా తస్కరించి కొని పోవుట మేలయినది. మామగారగు కీర్తి గుప్తులవారు, తన తండ్రిగారును తన అత్తగారును ఆలోచించికదా, ఈ మహాసంకల్పము పూనినది. ఆమె తన మనుమరాలిని వెయికన్నుల కాపాడుచుండును. హిమబిందును ఎత్తు కొని పోవుటయు మంచిదేయైనది. ఉజ్జయిని నగరముననే ఆ బాలిక

అడివి బాపిరాజు రచనలు - 2

• 221 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)