పుట:Himabindu by Adivi Bapiraju.pdf/230

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నరవాహనదత్త విద్యాధర చక్రవర్తి కథను జ్ఞప్తికి తెచ్చును. తదనంతరమున మహాబల గోండు కుమారప్రభువు సహాయముతో నర్మదా నదీకూలమున నున్న రహస్య కందరాంతర ప్రదేశమును పట్టుకొనినారు.

“సువర్ణశ్రీ కుమారవీరులు శ్రీ హిమబిందుదేవిని, శ్రీముక్తావళీ దేవిని ప్రప్రథమమున రక్షించిన దా గుహనుండియే! ఆగుహ మనవారల కై వసమగుటతోడనే మాతమ్ములు మంజుశ్రీ ప్రభు వందు దొరికినాడు. మా అనుంగుతమ్ములు క్షేమము. శ్రీ అమ్మగారిని, శ్రీ నాన్నగారిని ఎప్పుడు చూచుట అని తొందర చేయుచున్నారు. తమ్ముల నెత్తుకవచ్చిన విరోధులు ఇన్ని సంవత్సరములు మహాప్రభువువలెనే పెంచినారు. తమ్ములను దాచి యుంచిన గుహ సుందర పాతాళమందిరమువలె నుండునట. ఆ మందిరము వేయిసంవత్సరములు వెదకినను ఏరును కనిపెట్టలేరట! అట్టిది సువర్ణశ్రీ కుమారులు కనిపెట్టినారు. నిన్నటి యుద్ధమున నేనధివసించిన దంతావళము విరోధిగజముచే పరాజయమంది, నాశనమంద సిద్ధముగానున్న సమయమున, అదివరకే గాయము లంది అఖండ విక్రమము చూపుచు, సంశప్తక సమరము నాటి యర్జునునివలె విజృభించియున్న సువర్ణశ్రీ విరోధి ఏనుగుపై గవిసి భల్లముచే దానిమీను గాడునట్లు నాటెను. నా గజమప్పు డా దంతావళమును గూల్చినది సువర్ణశ్రీ కుమారు డట్లొనర్పక పోయినచో నేమయ్యెడి దోయని తలంచుకొన్నచో నొడలు జలదరించుచున్నది. సువర్ణశ్రీ కుమారుల నేనెంత పొగడినను చాలదు. ఆయనకు గాయములు చాలా తగిలినవి. కాని మొప్ప మేమియు లేదు. గోండు లావీరునికి వైద్యము చేయుచున్నారు. శ్రీ హిమబిందు కుమారి సర్వోపచారములు చేయుచున్నది. తమ్ములు నిన్నటివరకు వారితో నుండిరి. ఇప్పుడు నాకడనున్నారు. స్థౌలతిష్యులవారు తమ్ములకు పండితులచే విద్యలు గరపించుచుండిరట. రాజద్రోహనేరములకు పాల్పడి, ఇప్పుడు శ్రీశ్రీ అమృతపాదార్హతుల కడనున్న చంద్రస్వామి గారి చెల్లెలును, బావమరదియు తమ్ములకు పోషకులు. వారెన్నియో రహస్యములు మాకు నివేదించినారు. అవన్నియు తమ సమక్షముననే! వినీతమతుల మాళవ ప్రభు నొనరింప తమకు నామనవి. సమవర్తి సాతవాహన ప్రభుని విదేహరాజ్యమునకు మహామండలేశ్వరుల నొనరింపను విన్నవించుచున్నాను. వినీతమతి నిచ్చట నేబదివేల సైన్యముతోనిలిపి, మేమందరము తమపాదసన్నిధికి రేపటి దినమున బయలు దేరుచున్నాము. శుభవర్తమానములు శ్రీ చారుగుప్తులవారికి, శ్రీధర్మనందులవారికి అందజేయ దేవరవానిని వేడుకొను పాదసేవకుడు కుమారుడు ఆనందపుత్ర శ్రీకృష్ణసాతవాహనుడు.”

ఈ ఉత్తరము చదువుచున్నప్పుడే ధర్మనంది డగ్గుత్తికపడెను. ఆతని కన్నుల నీరు తిరిగినది. సార్వభౌముడులేచి తనతో లేచిన ధర్మనందిని గాఢముగా కౌగిలించెను. “శిల్పి సార్వభౌమా! మీవంశమునకు సర్వదా మా వంశము కృతజ్ఞము. మా పుత్రులిర్వురను మాకు తిరిగి ఇచ్చిన మీ పుత్రునికి తిరిగి మే మేమి ఈయగలము? ఈ పాటలీపుత్రమున నాతడు మా ప్రతినిధి యగుగాక!” యని ఉచ్చైస్వరమున బలికెను.

ధర్మనందియు ఆ శుభవర్తమానము కొనితెచ్చిన చారునికి తన కంఠహారము బహుమాన మిడెను. చక్రవర్తి ఈ వార్త తెచ్చిన సేనాపతిని ఉప సైన్యాధ్యక్షునిగ నొనరించి తన ప్రక్కనున్న రవ్వల ఒరగలిగిన ఛురికను బహుమాన మిచ్చెను. ఆ చారుడు యాదార్హ వర్ణనాయకుడైనాడు. ధర్మనంది తథాగతుని ప్రార్థింపుచు ఆ రాత్రి గడపెను.

అడివి బాపిరాజు రచనలు - 2

• 220 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)