పుట:Himabindu by Adivi Bapiraju.pdf/23

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


భయావృతమనస్కులై ఎచటి వారచట ఆగిపోయారు. పార్శ్వవర్తిని కెవ్వున అరచి రెండుచేతుల కళ్ళుమూసికొనినది. శ్రీకృష్ణకుమారు డాశ్చర్యమున, ఒక్కతృటికాల మట్లే యుండిపోయినాడు.

ఇంతలో నీలాంబుదావృత విశాలాకాశము వెలిగించి, మాయమగు విద్యున్మాలవలె నా శ్వేతపన్నగి వారందరు చూచుచుండగనే మాయమైపోయినది.

అద్భుతాశ్చర్యహృదయులై, వారందరు శ్వేతఫణి తమతమ పాదాలను చుట్టినదేమో అని చేష్టలుదక్కి ఆ సుందర మందిర పురోభాగమున మలచిన ప్రతిమలవలె క్షణకాలము గన్పట్టిరి.

రక్షకభటులు, దౌవారికులు, పారిపార్శ్వకులు, ముఖపతులు, మంత్రు లొక్కసారి సాయుధహస్తులై యా మందిరమంతయు వెదకనారంభించిరి.

శ్రీకృష్ణమహారాజు ఆ శ్వేతపన్నగినే తలంచుకొనుచు, చిరునవ్వు వెలుగులు మరల మోమున నలమికొన, పార్శ్వవర్తినితో “మన ప్రయాణము సాగనిమ్ము” అని యాజ్ఞనిడెను.

అయిదు లిప్తలలో మరల పరివార జనము, మంత్రులు, సేనాధిపతులు యథాస్థానములకుజేరి మహారాజు కనుసన్నల ముందుకు సాగిరి.

మహారా జిట్టు దుర్గప్రవేశమొనర్చి అంతఃపురముచెంత దన పరిజనమును నిలిపి, లోనికరిగి, దర్శనసభలో సింహాసనాసీనులైయున్న తల్లిదండ్రుల పాదములకు సాష్టాంగ ప్రణామ మాచరించినాడు.

బుద్ధభిక్షులు, విప్రులు ఆశీర్వచనములు పలుక, సార్వభౌముడు, సామ్రాజ్ఞియు సింహాసనములనుండి లేచి, నయనముల ఆనందబిందువులు నృత్యమాడ, వంగి కుమారుని చేరియొక చేయిపట్టి లేవనెత్తుచు, “చిరంజీవివి, సత్వర వివాహితుడవు, సిద్ధసకలాభీష్టుడవు కమ్ము తండ్రీ” అని ఆశీర్వదించిరి.

జననీ జనకుల నోటినుండి ఆశీర్వాదము వెలువడుచున్నప్పుడు శ్రీకృష్ణకుమారుని హృదయమున తెల్లని పామొకటి ఆడుచు కనిపించినది.

సార్వభౌముని అనుమతిగొని యువరాజు తల్లితో అభ్యంతరమందిరమునకు బోయినాడు.

మహారాణి: కుమారా! ప్రయాణము కుశలముగ జరిగినదా?

శ్రీకృష్ణుడు: దేవమూర్తులైన తమ ఆశీర్వాదబలము నాకు వజ్రకవచముగదా తల్లీ!

మహారాణి: మా కడుపును పవిత్రము చేయుటకు పుట్టినమూర్తివని నేను వేయిదేవులకు సర్వదా నమస్కరించుకొందును తండ్రీ!

శ్రీకృష్ణుడు: మా తమ్ములు బంగారు తొనల బొమ్మ, మంజుశ్రీ మూర్తి జాడలు తెలియలేదుకదా?

మహారాణి: నాయనా నా కడుపులో ఆ బాధ ఎప్పుడును కుములుచునేయుండును. ఏ దుర్మార్గునకు చేతులు వచ్చినవో!

శ్రీకృష్ణుడు: ధనమునకాశించి ఇట్టిపని జరిగి ఉండదు. అమ్మా! మీరు పరిపూర్ణ ధైర్యమువహించి ఇంకను కొన్నినెలలుమాత్ర మోపికపట్టుడు.

మహారాణి: నాయనా! నేను పైకి ధైర్యమువహించినా, అసలు నా హృదయములోని బాధ ఏలాగు తీసివేసుకోగలనయ్యా! నీవు తమ్ముని వెదకి ఆరునెలలలో అమ్మగారి ఒడిలో కూర్చుండపెట్టుదునని ప్రతిజ్ఞపట్టితివని వింటిని. తండ్రీ! నా చిన్ని బాబును ఒడిలో

అడివి బాపిరాజు రచనలు - 2
హిమబిందు (చారిత్రాత్మక నవల)
• 13 •