మంజుశ్రీకి బంధనవిముక్తి నొనరించిన మహావ్యక్తి సువర్ణశ్రీయని తెలియగనే చక్రవర్తి ధర్మనందికి వార్తపంపి, తనమందిరమునకు రప్పించుకొని యాతని కౌగిలించు కొనెను.
“ధర్మనందులవారూ! మీ పుత్రుడొనరించిన యుపకృతి మా జన్మము నందెప్పుడును మరచిపోము. శకటపరీక్షయందు జయమందిననాడె యాతడు మహాపురుషుడని మే మూహించితిమి.”
“ప్రభూ! తమకరుణ ఇది. మావాడు వీరబలగోండుమహారాజు తనయుడైన మహా బలగోండుని సహాయమున రాజకుమారులను, సౌభాగ్యవతి హిమబిందును, మహాభాగుడగు కీర్తిగుప్తులవారి పత్ని ముక్తావళీ దేవిని విడిపించినాడు. గోండుల సహాయమే సర్వము సాధించినది.”
“ఓహో! మంచివాడవయ్యా ధర్మనందీ! కుమారుని పరాక్రమము కప్పిపెట్టుకొను చుంటివి. పోనిమ్ము. గోండులు మనకు స్నేహితులని హిమబిందును వెతుకపోయిన మనసేనాపతుల కేల తోచలేదు? గోండుల సహాయముతో మీ చిరంజీవి మాళవుల చికాకు పరచుచున్న విధాన మప్రతిమాన మని శుకబాణులవారి కమ్మలో నున్నది. రావయ్యా, మనము చారుగుప్తుల వారికడకు పోవుదము” అని సింహాసనమునుండి లేచెను.
ఇంతలో “రోజుచువచ్చిన చారు డొకడును, వానివెంట సేనాపతి యొకడును ద్వారమున వేచియున్నా” రని ప్రతీహారిణి యోర్తు జయధ్వానము పలికి, నమస్కరించి విన్నవించినది. సార్వభౌముడు త్వరితముగ నా చారుని కొనిరమ్మని ఆజ్ఞనిచ్చి మరల సింహాసన మధివసించెను. ధర్మనందియు తన యాసనముపై కూర్చుండెను.
చారుడును, సేనాపతియు లోనికి వచ్చి సార్వభౌమునకు, ధర్మనందికిని వీర నమస్కారము లిడిరి. చారు డప్పుడు తన శిరస్త్రాణమున దాచియుంచిన భూర్జ పత్రమును సార్వభౌమునకు మోకరించి యర్పించెను. సార్వభౌముడా లేఖను విప్పిచూచి, “శుభము! శుభ”మని కేకవేసి, ముద్రాంకితము చూచి, “ధర్మనందీ! మా కుమారుడు శ్రీకృష్ణసాతవాహన మహారాజు వ్రాసిన లేఖయిది. దీనిని చదువుడు” అని ధర్మనంది చేతికిచ్చెను. సేనాపతిని కూర్చుండుడని యాజ్ఞ నిచ్చును, చారుని తనకడకు రమ్మని తన కంఠముక్తావళినితీసి “నీవు తెచ్చిన శుభవార్తకిది మా బహుమాన” మని వాని కొసంగెను.
ధర్మనంది యిట్లు చదివెను.
“మహాసాతవాహన వంశభానులు, శ్రీశ్రీశ్రీ సాతవాహన సార్వ భౌములగు పితృపాదుల పాదారవిందములకు ప్రణమిల్లి, కుమారుడు శ్రీకృష్ణుడు మనవి చేసుకొను చున్నాడు. ప్రభూ! ఉజ్జయిని ముట్టడి అంత మొందినది. మాళవపతి శూర సేనపతులు పారిపోయిరి. శత్రు సైన్యములో మూడవవంతు నాశనమైనది. ఒకవంతు మాచే పట్టుబడినది. ఒక వంతు పారిపోయినది.
ఈ యుద్ధ విజయమునకు మొదటి కారణము శిల్ప చక్రవర్తియగు ధర్మనందులవారి తనయుడు సువర్ణశ్రీ. మహామండలేశ్వరుడు, ఉప సైన్యాధ్యక్షుడు నగు ఆ కుమారుడే నా ప్రాణములు రక్షించినాడు. ఆతడే తమ్ములు మంజుశ్రీని రక్షించినట్లు శ్రీ సోమదత్తాచార్యులు తమకు మనవి పంపియున్నారు. శ్రీ చారుగుప్తులవారికుమార్తె శ్రీ హిమబిందుదేవిని, వారిముత్తవ శ్రీముక్తావళీ దేవిని రక్షించినవిధానము చిన్నతనమున మేము విన్న
అడివి బాపిరాజు రచనలు - 2
• 219 •
హిమబిందు (చారిత్రాత్మక నవల)