మహాగదలతో తాడించుకొన్నవి. భయంకరదంతముల పొడుచుకొన్నవి. కుంభమును కుంభముతో తాకి, తొండములు పెనవైచుకొని మహాయుద్ధ మొనరించుచుండ ఆంధ్ర సైన్యముల హాహాకారము లుప్పతిల్లినవి.
కళింగసైన్యముల జయజయ ధ్వానములు మిన్ను ముట్టినవి. సువర్ణశ్రీ మొదలగు అంగరక్షకులు, సేనాపతులు, వీరులు దూరముగ నిలిచి చూచుచుండిరి. ఇంతలో అందరు వలదనుచున్నను సువర్ణశ్రీ, యంతట తన పరశు వెత్తి గుఱ్ఱమును ముందుకు దుమికించి, చిత్రగతుల శివస్వాతి మహా గజముకడకు పోయి, తన అశ్వమునకు హానిజరుగకుండ నడుపుచు, ఆ గజమును పార్శ్వమునందు తాకినాడు. అతని హుంకారపూరిత గాఢపాతముల నా గజకవచము బ్రద్దలై ఆ ఏనుగు పార్శ్వమునందు భయంకరమగు గాయమై రక్తము మహాప్రస్రవణమై ప్రవహించినది. ఏనుగు గాసిచెంది, వెనుకకు తిరిగి సువర్ణశ్రీని కదియుటయు, సువర్ణశ్రీ యందులకు సిద్ధముగ నుండుటచే ఒక్క మహాప్లుతమున తనబలమును కలిపినాడు. శ్రీకృష్ణుని గజము శివస్వాతి దంతావళమును క్రింద కూల్చినది. ఆంధ్రులు ఆకాశమంట జయజయధ్వానములు చేసిరి.
అది మొదలు ఆంధ్ర సైన్యములు రెండును ఒకజాములో ఒకటి నొకటి కలిసికొన్నవి. సమవర్తి, వినీతమతి, శుకబాణుడు నగరమునుండి తమ సైన్యములతో వచ్చి తాకిరి. మాళవ సైన్యములు పంచబంగాళమై పరుగువారుట ప్రారంభించినవి. రాత్రి మొదటి యామమునకు శత్రువులు ఒక లక్ష హతమారిరి. తక్కినవారు పారిపోయిరి. వేలకువేలు ఆంధ్ర సైన్యముల శరణుజొచ్చిరి. ఉజ్జయిని శత్రునిర్ముక్తమైనది.
23. శుభవార్త
పాటలీపుత్రమును ముట్టడించి విజృంభించుచున్న చక్రవర్తికి, చారుగుప్తునకు సువర్ణశ్రీ కుమారుడు హిమబిందు మంజుశ్రీ ముక్తావళీ దేవుల రక్షించెననియు, నచ్చటనుండి పదివేల గోండులతో ఉజ్జయినీ పురమును జేరి మాళవులను నాశనముచేయుచు, నగరములోని ఆంధ్రసైన్యములఒత్తిడి తగ్గించినాడనియు, సోమదత్తాచార్యులు తన సేనలతో వెళ్ళి ఉజ్జయినికడ మాళవుల తలపడినాడనియు వార్తలు వచ్చినవి.
చారుగుప్తుని ఆనందము వర్ణనాతీతమైనది. ఆ వార్త తెచ్చిన చారునికి పదివేల సువర్ణములు బహుమాన మిచ్చెను. ఒక్కొక్క సైనికునకు, మావటీనికి మూడేసి సువర్ణము లీయ నేర్పాటులు గావించెను. బుద్ధగయా క్షేత్రమునకు లక్ష సువర్ణములు దానము పంపెను. బౌద్ధ సంఘారామములకు నెలదినముల గ్రాసములు అర్పింప నేర్పాటులు చేసెను. బ్రాహ్మణులకు గోదానాదికములు వేలకొలది చేసెను.
శ్రీముఖసాతవాహన, ఆనందరాణుల ఆనందము వర్ణనాతీతము. మంజుశ్రీ దొరకినాడను ఆనందమున, అమృతమందాకినియై మహారాణి వార్త తెచ్చిన చారునికి నిలువు దోపిచ్చినది. అంతఃపురపరిజనులకు దుకూలములు, ఆభరణములు పంచి పెట్టించెను. బౌద్ధ భిక్షువులకు, బ్రాహ్మణులకు చక్రవర్తి పాటలీపుత్ర పరిసరముల నున్నంతకాలము సంతర్పణలు, సమారాధనలు జరుపవలయునని ఆజ్ఞయైనది. విజయానంతరము జరుగు మహోత్సవములకన్న నధికముగ ఆంధ్ర సైన్యముల ఉత్సవములు జరిగినవి.
అడివి బాపిరాజు రచనలు - 2
• 218 •
హిమబిందు (చారిత్రాత్మక నవల)