పుట:Himabindu by Adivi Bapiraju.pdf/225

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

“అవును. సంఘారామ విద్యాపరిషత్తునందు మాకు వారు శిల్ప సూత్రములు, నాట్యసూత్రములు, నందికేశ్వర నాట్యశాస్త్రము, గాంధర్వ విద్య అన్నియు పాఠములు చెప్పినారు. నేను నిన్ను తీర్చు మనిన అనుమానము లివి: ఒకరిని ప్రేమించి, ఇంకొకరిని ప్రేమింప వలనుపడునా? ప్రేమింపకయే వివాహ మాడదగునా? మనసు నీయకుండ మే నిచ్చుట పాపముకాదా? ఈ ప్రశ్నలే నా గుహాబంధన జీవితములో సర్వకాలము నాలోచించుకొనెడి దానను. ఇంకొకటి - ఈ ప్రశ్నల కుత్తరము లిచ్చు ముందు ఒకటి మరచిపోవద్దు ప్రభూ! మనము పాటలీపుత్రము చేరునంత వరకు, నన్ను మీరు విడిచి యుండకూడదు. ఎరుగుదురుగదా స్త్రీలు భీరువులని, న న్నేకాకినిచేసిన ఏమగుదునో యని భయమగుచున్నది.” 

22. ఉజ్జయిని విడుదల

సోమదత్తాచార్యుని సైన్యము లొకవంక వచ్చి తాకినవి. ఇంకొక వంక గోండులు వచ్చి తాకిరి. పోరు సంకులమయ్యెను. మాళవులు మహా భీకర సంగ్రామము చేసిరి. ఆంధ్ర సైన్యములన్నియు ఒక్క భయంక రాయుధరూపమున వచ్చి తాకినను, సోమదత్త, సువర్ణశ్రీ, మహాబలగోండుల రణకౌశలము వేలకువేలు మూకల నాశ మొనర్చుచున్నను, మాళవ సైన్యములు వెనుకంజ నిడుటలేదు. దుర్గద్వారములు తెరచి సమవర్తి, వినీతమతియు, శుకబాణాదు నొకప్రక్క మాళవుల రూపుమాపుచుండిరి. యుద్ధము మూడు దినములీ విధమున జరుగునప్పటికి శ్రీకృష్ణసాతవాహన మహారాజు ఏబదివేల సైన్యముతో పడమటి దిక్కునుండి వచ్చి మాళవుల దాకినాడు. ఆ యుద్ధము ప్రళయతాండవమైనది. ద్వంద్వయుద్ధమే అభి సంపాతవిధానమైపోయినది.

సోమదత్తా చార్యుడు సైన్యములతో వచ్చుటతోడనే సువర్ణశ్రీ పోయి, యాతని పాదముల కెరగినాడు. సోమదత్తుడు మహానందమున సువర్ణశ్రీని కౌగిలించుకొని “తండ్రీ! హిమబిందును, ముఖ్యముగ మంజుశ్రీకుమారునిరక్షించినావట. నేనునిన్నుకూర్చి ఊహించినవన్నియు నిజముచేసినావు. ఎప్పుడో మాయమైపోయిన మంజుశ్రీని తిరిగి సంపాదించి ఇచ్చిన నీనేర్పు ఆంధ్ర సామ్రాజ్యమునుద్ధరించినది. నీవు నాకు ఉప సైన్యాధ్యక్షుడవు. మహాబల గోండుని సేనాపతిని చేయుచున్నాను. వ్యూహము తోమర స్వరూపము. ఈ మూడులక్షల విరోధులను నిశ్శేషముగా నాశనం చేయవలయును. నేను సైన్య ముఖమున, నీవు కుడివైపున, మహాబలుడు తన గోండులతో ఎడమ వైపున, తక్కిన అధికారులందరులు ఆ యాస్థానముల నుందురు” అని సువర్ణశ్రీని, మహాబలుని కౌగిలించుకొని భద్ర దంతావళము నధిష్టించి, సేనా ముఖమునకు పోయెను. ఆంధ్రులను తెరలు తెరలైవచ్చు మాళవులెన్ని సారులు తాకినను తోమరవ్యూహ మిసుమంతయైన చలింపక శత్రువ్యూహములోనికి చొచ్చుకొనిపోవుచుండెను.

ఆంధ్ర సైన్యములకు ఉజ్జయినీ నగరము ఇక రెండున్నర క్రోశములు మాత్రమే యున్నది. ఇంతలో శ్రీకృష్ణసాతవాహనుడు మహావేగముతో వచ్చి పడమటి దిక్కున తాకుటయు, మాళవ సైన్యముల నాశనదేవత ఆవహించినది.

అడివి బాపిరాజు రచనలు - 2

• 215 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)