పుట:Himabindu by Adivi Bapiraju.pdf/224

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

“తామే పదివేలగోండు స్నేహితులంతటా యున్నారని నిర్భయమున వచ్చినాను. ఇదిగో వినండి....” అని హిమబిందు భరద్వాజ పక్షివలె కూతవేసినది. వెంటనే సంపూర్ణాయుధోపేతు లగు నలుగురుగోండు లట ప్రత్యక్షమైరి.

సువర్ణశ్రీ వారిని జూచి, నవ్వుకొని “ఈ రహస్య మెప్పుడు గ్రహించినావు? ఆ కూత నీ కెట్లు పట్టుబడినది?” యని ప్రశ్నించెను.

“మమ్ము గుహాబంధమునుండి విడిపించి తెచ్చినపుడు మీసాంకేతికము నేను వినలేదుకాబోలు! మహాబలగోండుడు నాకు గురుత్వముచేసెను. అన్నట్లు మీరెప్పుడు నాకు చిత్రలేఖనము సంపూర్ణముగ నేర్పుట? ఇంకను ప్రొద్దుపోలేదు. అదిగో, ఆ సెలయేటిగట్టున రాతిపై కూర్చుందుము. (గోండు భాషలో గొండులను జూచి) మీరుపోయి, ఈ పరిసరములనే కాచియుండుడు.”

వారిరువు రొక శిలాతలముపై కూరుచుండిరి. సువర్ణశ్రీ ఏమి మాటలాడ గలడు? హిమబిందు మూగనోముపట్టిన యాతని భావభరము నెఱింగి,

“శిల్పాచార్యా! నేను రచించిన ఈ పాట వినుడు” అని అత్యంత మనోహర స్వరమున.

“కుసుమ మొకటి అర్చనకై
కోసికొనిన దొక బాలిక,
మధుర సౌరభాంచితమై,
మధుపూర్ణము దాని ఎడద.
పూజింపగ నా పుష్పము
పొలతితీసె, కుసుమములో
మధుపానం బొనరించెడి
భ్రమర మొకటి నామె చూచె.
అళి మూచూచిన పువ్విది
అర్చనకై పనికిరాదు
అనుచు బాల ఆ పుష్పము
అంజలితో వదలె నదిని.
ఆ భృంగము ఆ పుష్పము
ఆనందమె జీవితమై
అలల నూగి ఝరుల తేలి
కలిసిపోయె మహాజలధి-”

అని పాడినది.

ఆ పాట ముగియునప్పటికి హిమబిందు చిత్తవృత్తి యంతయు నాతని కవగతమైనది. ఆ బాల “శిల్పమూర్తీ! నీవు సర్వకళాకోవిదుడవు నీకు తెలియని రహస్యమేమున్నది! నాకు కొన్ని అనుమానములున్నవి. తీర్పగలవా?”

“హిమబిందూ, నా కేమి తెలియును? శిల్పరహస్యములు మా జనకుడు తెలుపు చుండ వినవలెను, సర్వకళలకు దేశికులు వారు.”

అడివి బాపిరాజు రచనలు - 2

• 214 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)