పుట:Himabindu by Adivi Bapiraju.pdf/222

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సువర్ణశ్రీ కోపము నభినయించుచు, “అవును, నేను ప్రాణమునకైన వెరువక మిమ్ముల రక్షించితిని. ఇప్పుడు నా అవసరమేమి మీకు? ఇక నాముఖమైన మీకు చూపించి మీ మనస్సును కష్టపెట్టను లెమ్ము” అని ఖండితముగ ననెను. హిమబిందు సువ్వున లేచి కూర్చున్నది.

“నీవు రక్షించు టేమిటయ్యా, మహాబలగోండుని సహాయమున రక్షింపగల్గితివి. అదియు ఒక గొప్పయే! నీ ముఖమును నాకు చూప నక్కరలేదు. ఒకటి మాత్రము జ్ఞాపక ముంచుకొనుము. నీ వీ జన్మమున నిక హిమబిందును ప్రాణముతో చూడలేవు.”

సువర్ణశ్రీ ఎప్పుడును కంట నీరు పెట్టనివాడు కన్నుల నీరు గిర్రున తిరుగ ఆ నేలపై చతికిలబడిపోయి, రెండుచేతులు ముఖమున కడముచేసి కొని, కంటనీరు పెట్టుకొని, కొంతవడికి లేచి చిరునవ్వు ముఖమునకు తెచ్చుకొని “హిమబిందూ, నీవింత అల్లరిపిల్లవైనందుకు మా చెల్లెలివైనచో.... అవి ఏటి మాటలు?” 

21. హిమాలయ శిఖర ప్రత్యక్షము

హిమబిందు సువర్ణశ్రీ స్థితినిచూచినది. ఆశ్చర్యమునంది, మనస్సు వ్యాకులము నంద నాతనికడకు వచ్చి, యాతని రెండుచేతులుపట్టి లేవనెత్తి ఆతని కడ తాను మోకరించి, “ప్రభూ! మీరు దేవతలు! బోధిసత్వులు. నేను సమస్త దేవతల సాక్షిగ, బుద్ధ భగవానుని సాక్షిగ, సర్వధర్మముల సాక్షిగ ప్రతిజ్ఞ చేయుచున్నాను. నేను వివాహమాడినచో నా హృదయము నిండి, నా జీవితమే తానయి, నాఆత్మ కధీశ్వరుడైన వానినే వివాహమాడుదును. లేనిచో భైక్షుక దీక్షనంది బౌద్ధధర్మ మాచరింతును. నా ప్రాణమును నేను ఎప్పుడును బలిగా సమర్పింపను” అని సువర్ణుని పాదములుపట్టి, అందమైన ఆ పాదములపై తన మోముంచి ముద్దుగొని, లేచి, “ఇంక మీ పనిపై మీరు పొండు” అని తెలిపినది.

సువర్ణశ్రీ సంభ్రమాశ్చర్యములకు లోనై, సర్వము మరచి, పది క్షణము లట్లే నిలుచుండిపోయి, కన్నులరమూతలుగా సర్వము హిమబిందు వయిపోవ, ఆ సుందర విగ్రహస్వర్ణపాటలారుణకాంతులు, దీర్ఘ పక్ష్మాంచల వినీలకాంతులు, మాంజిష్టరాగ సంక్లిష్టమృదులరేఖాసమన్వితాధరోష్ఠలో హితద్యుతులు తన్నలమివేయ చేతులు హృదయమున కద్దుకొని, అచ్చట నుండి కదలి ఎటుపోవుచున్నదనియు తెలియక, యా కాపు వేషముననే యా గ్రామాంచలముల ప్రవహించు సుందర శైవాలినీ తీరమునకు బోయి, ఆ కొండలలో, ఆ వనవృక్షములలో, ఆ శిలలలో ఆ సాయంకాలము తాను దివ్యమూర్తియై చంద్రలోకములోని సుధాకరునివలె సంచరించెను. ఆతని ఆనందము రూపరాగ రహితమైనది. ఆతని ఆనందము సాయంకాల నటేశ్వరపాదపద్మపాటల వర్ణాంకితమైనది. ఆతని ఆనందము విశ్వపథ ప్రసారితదివ్యశబ్దాదిత్యమైనది.


ఓ దేవి :

 నిన్ను వలచిన బ్రతుకు
నిన్ను కొలిచిన ఆత్మ
నిత్యమై లోకముల
సత్యమై నిలుచునే!


అడివి బాపిరాజు రచనలు - 2

• 212 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)