లేదో! ఏ రాగముపాడిన తదనుగుణములయిన విచిత్రములు సంభవించును. శైలాలి కృశాశ్వసూత్రము లామెకు కంఠస్థములు. ప్రాతిశాఖ్య అమ్మాయి వ్యాఖ్యానముతోకూడ చెప్పును. జతులు, రాగములు, గాంధారగ్రామము, పరమమహాశబ్దము ఆమెకు కొట్టిన పిండి. ఈ తల్లి మృదంగము వాయించగలదు. వీణను స్పందించి ఆమె పాడునప్పుడు రాళ్ళే కరగిపోవును. భరతనాట్య సూత్రములకు వన్నెతెచ్చునట్లు నాట్యమాడగలదుగదా! మా యవన దేశములలో గాని, మన ఖండమునందుగాని యిట్టి సుందరాంగియైన బాలికను ఎందును చూచియుండరు. నీవీ రహస్యమును గ్రహించియే కాబోలు నాతల్లి బొమ్మను లిఖించినావు.
సువర్ణ: మామ్మగారూ! హిమబిందుకన్న సకలభారతవర్షమునకు సామ్రాజ్ఞి కాదగినవారు వేరొక్కరు లేరు. భగవంతు డామెను రక్షించి సామ్రాజిని చేసి తీరునుగాక!
ముక్తా: తండ్రీ! అదే మా కోరిక.
సువర్ణశ్రీ: నీవు హిమబిందుతో చెప్పి మరియు వెళ్ళుము. లేనిచో నన్ను చంపి వేయును. ముక్తావళీ దేవికి హిమబిందు సువర్ణుని ప్రేమించుచున్నదని స్పష్టముగ తెలియును.
ఒకనాడు ప్రేమించినవారి హృదయమునకు ఇతరుల హృదయములు స్పష్టముగ తెలియునుగదా! తాము గుహలో బంధితులై యున్నప్పుడు ఒక్కనిమేషము హిమబిందు సువర్ణశ్రీ పేరు తలంపక యుండలేదు? సువర్ణశ్రీయే వచ్చి తమ్ము రక్షించు నని ప్రతిదినము ఎన్నిసార్లో అనునది. వెనుక బాలనాగి మాటలవలననే హిమబిందు సువర్ణశ్రీని ప్రేమించుచున్నట్లు తాను గ్రహించినది. ఇట్టి సంఘటన కలుగుట బుద్ధభగవానుని యిచ్ఛయేమో! తండ్రియేమో శ్రీకృష్ణసాతవాహనున కీయ సంకల్పించినాడు. ఏమి కానున్నదో?
ఈ దేశమున బాలికలు తండ్రిమాట జవదాటరు. ప్రేమించినచో ప్రేమించిన వారిని భర్తయని యనుకొందురు. ప్రేమ యొక్క ఈ యౌన్నత్యము యవనబాలికల కేమి తెలియును? వారు భోగప్రియులు. పురుషుని ఆటవస్తువులు. ఒకనికి భార్యగానుండి ఇతరుని కామించుట యవనస్త్రీ దోషముగా నెంచదు. ఆర్యస్త్రీలు ఎంత పవిత్రమైన హృదయము కలవారు! ఒప్పుకొని ఒకనిని పెండ్లి చేసికొనినచో తమసర్వస్వమును వారికి ధార పోయుదురు. ఆ దివ్యధర్మము పాతివ్రత్యమట! ఎంత ఉత్కృష్టధర్మ మిది! గ్రీకుదేవతలు, ఆంధ్రదేవతలు తనయందు ప్రేమగలవా రగుటచే తన్నీ విధమున ఆర్యస్త్రీ నొనరించినారు.
ముక్తావళీదేవి యిట్లాలోచించుకొనుచు ఆ బ్రాహ్మణుని గృహమున ముందటి సావిడినుండి దొడ్డిలోనికి వెడలిపోయినది. సువర్ణశ్రీ హిమబిందు కడకు పోయినాడు.
హిమబిందు మంచముపై పరుండి వెక్కి వెక్కి ఏడ్చుచున్నది. సువర్ణశ్రీ నెమ్మదిగ నడచిపోయి, అస్పష్ట స్వరమున “హిమబిందూ!” అని పిలిచినాడు. హిమబిందు పలుకలేదు. మరల స్వరము నింకకొంచెము హెచ్చించి సువర్ణశ్రీ “హిమబిందూ! నీ విటుల చేయుట న్యాయము కాదు. విధి సంఘటన ఎవరు తెలిసికొనగలరు? త్వరలో నీతండ్రిగారి కడకు నిన్ను పంపించెదను” అనెను. హిమబిందు మంచముపై నున్న దిండ్లకు మోము నొత్తికొని కఠినస్వరమున “నీవు మా తండ్రిగారికడకు పంపనక్కరలేదయ్యా. సోమదత్తాచార్యులవారు వచ్చుచుంటి రని చెప్పి యుంటివికదా! వారే మా ప్రయాణమునకు వలయు ఏర్పాటు లన్నియు చేయుదురు” అని మరియు రోదించినది.
అడివి బాపిరాజు రచనలు - 2
.211.
హిమబిందు (చారిత్రాత్మక నవల)