పుట:Himabindu by Adivi Bapiraju.pdf/220

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సువర్ణశ్రీ: హిమబిందుకుమారీ! ఈ భయంకర సమయములో అట్టి మాటలనుట తగునా? ఈ సాయంకాలము తూర్పునుండి చక్రవర్తిపంపిన ఆంధ్రసైన్యములు మా గురువులగు సోమదత్తాచార్యుల నాయకత్వమున వచ్చుచున్నవి. ఇంకను రెండుమూడు దినములలో ప్రభువులగు శ్రీకృష్ణ సాతవాహనులు తమ సైన్యములతో పటమట దిక్కునుండి వచ్చుచున్నారు. ఆ వెంటనే మిమ్మిరువురను పాటలీపుత్రమునకు సైన్యము నిచ్చి పంపివేయగలను.

హిమ: మీరట్లు పంపివేయునది నా శవమును మాత్రమే.

సువర్ణ: బుద్ధా! బుద్ధా! ఎంతమాటంటిరి? ఈ దినమున మీకీ విచిత్ర చిత్తవృత్తి సంభవించిన దేమి? హాస్యమునకైన అట్టిమాట లన గూడదు.

ముక్తా: నేను ఎ నూయియో, గోయియో చూచుకొనవలసియుండను. ఈ దినమున హిమమాటలు నా హృదయమును బద్దలుకొట్టు చున్నవి.

హిమ: ఈ మహాసేనాధిపతి నన్ను పంపివేయునట! తన చెల్లెలితో ఆడుకొనిన నన్ను “మీరు” అని గౌరవించుచున్నారు. నే నేమియు మాట లాడను. నే ననిన మాటలన్నియు తప్పులు, మీ యిష్టము వచ్చినట్లు చేయుడు. నేను పోయి పండుకొనెదను.

హిమబిందు కన్నుల నీరుగ్రమ్మ అతివేగమున పరుగిడిపోయి, మంచముపై గభాలునపడి, వెక్కి వెక్కి ఏడువజొచ్చినది.

సువర్ణశ్రీ, ముక్తావళీదేవులు ఒకరి మొగ మొకరు చూచుకొనిరి.

ముక్తా: సువర్ణశ్రీ! నీ ఋణము మే మెప్పుడును తీర్చలేము తండ్రీ! నీవు మహాబంధనమునుండి మమ్ము రక్షించినది మొదలు రెండు మూడు అహోరాత్రములు ఆనందముచే పొంగి పొరలిపోయినది. నీవు మమ్మీ గ్రామమున వదలి వెడలిన నాటినుండియు అల్లరి ప్రారంభించినది. “నే నా బంధమున వృద్ధురా లగువరకు ఉండిపోయిన ఎంత బాగుండెడిది” అనుట మొదలు పెట్టినది. తనకు పెండ్లి వలదట, పెటాకులు వలదట. ఏ రాత్రియో లేచి తాను అడవులలోనికి పారిపోవునట ఇంకను ఎన్నియో మాట లని నన్ను భయంకరస్థితికి తీసికొనిపోవుచున్నది.

సువర్ణ: మామ్మగారూ! మీరేమియు కలతనందకుడు. మీరు ధైర్యము వహించి యుండనిచో ఆమె కింక దిక్కెవ్వరు? పరమసాధ్వి యైన ఆమెతల్లి శరీరము చాలించిన నాటినుండి మీరే ఆమెకు తల్లియైతిరి. చిన్నతనపుమాటలకు అర్థము లేదు.

ముక్తా: తండ్రీ! నీవుమాత్రము చిన్నవాడవుకావా? నీ చరిత్రయే నా కద్భుతమగు చున్నది. మీ గృహమున నీవు రచించిన శిల్పములు, చిత్రలేఖనములు చూచినాను. విశ్వబ్రహ్మ వంశసంజాతుడవై నందులకు, విశ్వబ్రహ్మయే నీలో అవతరించినాడు. ఇటు మహావీరుడవు. ఎన్ని మహా సైన్యములువచ్చిన ఆ గుహను పట్టుకొనగలరు! నీవు మాళవులను చికాకుచేయు విధము అనన్యము. శక్తిమతీదేవి కడుపున త్రిరత్నములు నీవై ఉద్భవించినవి తండ్రీ!

సువర్ణ: మామ్మగారూ, నన్ను పొగడకండి.

ముక్తా: నాయనా, హిమబిందును తండ్రి శ్రీకృష్ణసాతవాహనున కిచ్చి మహారాణిని చేయనున్నాడు. చక్రవర్తి కాదనలేడు. ఇదివరకే ఒప్పుకొని నాడని మా అల్లుడు చెప్పినాడు. నాతల్లికి సర్వవిద్యలు తెలియును. హిమ సంగీతము పాడుట నీవు వింటివో

అడివి బాపిరాజు రచనలు - 2

• 210 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)