పుట:Himabindu by Adivi Bapiraju.pdf/22

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


5. శ్రీకృష్ణశాలివాహనుడు

శ్రీముఖ సాతవాహన మహారాజు అభయభాహు సాతవాహన చక్రవర్తికి ప్రథమ తనయుడు. బౌద్ధశకము 426వ సంవత్సరమున ధాన్యకటకాన కౌశికీదేవి గర్భశుక్తి ముక్తాఫలమై శుభలగ్నమునందు జన్మించినాడు. శ్రీముఖుడు బౌద్ధశకము 453వ వర్షమున ఆంధ్రసింహాసన మధివసించి మహాప్రజ్ఞతో రాజపాలన మారంభించినాడు.

సార్వభౌముడు బంగారు ఛాయవాడు. సంపూర్ణముగ ధనువు పొడువు గలవాడు. కోలనగు మోము, చక్కని కోరమీసములు, దీర్ఘసమ నాసిక, విశాలములై, అరమూతలై నిమ్నములుకాని కళ్ళు, సమఫాలము, పెద్దనోరు శ్రీముఖుని ముఖము సర్వసార్వభౌమ జయశ్రీ విలసితము. కండలు కట్టిన దేహము, కొంచెము చిరుబొజ్జ ఆ విగ్రహానికి ఒకనిండు తెచ్చినవి.

శ్రీముఖుడు మరి మూడేండ్లకు పట్టాభిషిక్తుడగుననగా పెద్దకుమారుడు శ్రీకృష్ణుడు జన్మించినాడు. శ్రీకృష్ణసాతవాహన యువమహారాజు వెనుక, చక్రవర్తికి ఇరువురు రాకుమారికలు, ఒకరివెనుక ఒకరు నాలుగేండ్లు భేదముగా జననమొందినారు. ఆ వెనుక ఇద్దరు కుమారులు పుట్టిపురిటిలనే సందుగొట్టి చనిపోయినారు. తర్వాత రెండేండ్లకు శ్రీకృష్ణునికి పదునారు సంవత్సరముల ఈడున అతనికి తమ్ముడు మంజుశ్రీ రాకొమరుడు జన్మించినాడు. పదునారవ సంవత్సరమున శ్రీకృష్ణుడు యౌవ రాజ్యాభిషిక్తుడై ప్రతిష్టాన నగరపాలన భారము వహించెను. ప్రతిష్టాన నగర పాలకత్వము నందిన యువరాజులు మహారాజను బిరుదము వహింతురు.

శ్రీకృష్ణసాతవాహనమహారాజు ఇప్పు డిరువదిరెండు వర్షముల ప్రాయమున సింహకిశోరమువలె విస్ఫారితవక్షుడైమధ్యమోన్నత శరీరుడైయౌవన పరిమళార్ధ్ర వయస్కుడై, మహావీరుడై, శతృహృదయ విదారకుడై, ప్రతిష్టాననగరాన రాజ్యపాలన మొనర్చుచున్నాడు.

సార్వభౌముని జన్మదినోత్సవములకు మహారాజు శ్రీకృష్ణసాతవాహనుడు ప్రతిష్టానమునుండి ధాన్యకటకమునకు సేనాపరివృతుడై సర్వవైభవోపేతుడై విచ్చేసినాడు. యువరాజు ధాన్యకటక నగరానికి మూడు గోరుతము లెగువను కృష్ణాతీరముననున్న విజయస్థలిత యనుకోటలో విడిదిచేసెను. వచ్చిన మరునాడు శుభముహూర్తమున శ్రీకృష్ణుడు సపరివారుడై, మాతాపితలకు పాదాభివందన మాచరింప సార్వభౌముని మహాభవనమునకు వెడల సన్నద్ధుడగుచున్నాడు. అలంకరణ మందిరమునుండి మంజులశ్రీ మూర్తియై, కిరీటకేయూరాది సకల భూషణాలంకృతుడై, మందహాస వదనుడై బయలుదేరెను. మౌక్తికాలంకృత దుకూలాంబరావృత ధవళచ్ఛత్రముతాల్చి చ్ఛత్రవాహనుడు వెనుక నడువ, చామరగ్రాహిణులగు సుందరులు కరకంకణక్వణన మనోహరముగ నిరుదెసల వీచోపులిడుచుండ, పార్శ్వవర్తిని యగు మనోహరాంగి భుజమున ఎడమచేయినిడి, దక్షిణ హస్తమున లీలానీలకుముదము ధరించి, వేణు, కాహలాది వాద్యముల మధురగీతములు సెలగుచుండ సాయుధులగు నంతఃపుర రక్షకవనితలు పరివేష్టించి నడువ, శ్రీకృష్ణ సాతవాహనమహారాజు బయలుదేరి గుమ్మము దాటుటకు కుడిపాదముంచినతోడనే ఒక శ్వేతోరగము బుస్సుమనుచు, ఎట్టఎదుట ఆడుచు ప్రత్యక్షమైనది.

అడివి బాపిరాజు రచనలు - 2
హిమబిందు (చారిత్రాత్మక నవల)
.12.