పుట:Himabindu by Adivi Bapiraju.pdf/219

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రమణకుని సేవ చేసెదననియు, అమృతపాదార్హతులు తనకు గురువగుననియు నామె ఖండితముగ ముక్తావళీదేవితో చెప్పినది.

ముక్తావళీదేవి యవనవంశజాత. ఇంద్రియభోగము, ఇహసౌఖ్యము నామె యేవగించు కొనదు. ఆమెకు భక్తియున్నది. ఆమెకు భగవంతుడు లేడను బౌద్ధబోధ అర్థము కాలేదు. శనికన్న గురువు బలవంతుడగుటచే, ఆతడు భగవంతుడయ్యెను. గురువుకన్న బుద్ధదేవుడు బలవంతుడైనాక కదా ఆతడు భగవంతుడగుట! ఇటుల ఆమె వాదించుకొనును. శని గురువులు యవనదేవతలు. హెరాక్లిసు మనుష్యుడే దేవుడైనాడు. డైనోసీయసు మేరుపర్వత నివాసి యని గ్రీకులమతము.

యవనులు భారతదేశమువచ్చి అచ్చటి ఆర్యసంప్రదాయముల నర్థము చేసికొనలేక ఎట్లో కొన్నిటి సమన్వయ మొనర్చుకొనిరి. భారతీయులు మహేశ్వరుడే వారి జ్యూస్ (ద్యోఃపిత) మహేశ్వరుని అంకమునుండి డైనోతయసు అను స్కందుడు పుట్టినాడు. 

20. ముగ్ధకోపన

యవనులు భారతీయ దేవతానిసరమును, వేదాంతమును ఏమియు అర్థము చేసికొనలేకపోయిరి. అందుకనియే ఎన్నియో యవకతవకభావములు వారి కుద్బవిల్లినవి.

ముక్తావళీదేవికి తనయన్న మొదలగువారికన్న భారతీయభావములు ఎక్కువగ నర్థమైనను, తన మనుమరాలు బిక్కుణి యగుట ఏలనో గ్రహింపలేదు. ఆడువారు సన్యాసు లగుట యేమి? పురుషులమాత్ర మేల సన్యసింపవలెను?

సువర్ణశ్రీ వచ్చుటతోడనే హిమబిందు లేచి, యాతనికడకు వచ్చి “ఓ శిల్పిశేఖరా! ఇన్ని దినములు ఆలస్యముచేసివచ్చిన మీ ఉద్దేశమేమి? యుద్ధ మన నంత వెఱ్ఱి ప్రేమ ఎక్కడనుండి వచ్చినది? ఉత్తమకళ లన్నియు మరచిపోదురా? మీరును గోండులవలె అడవిమనుష్యులగుదురా?” యని ప్రశ్నించెను.

ముక్తావళీదేవి: ఏమయ్యా! ఎంతకాలము మేమీ గ్రామమందుండుట నాయనా! నీ కింకను ఈ యుద్ధపువెఱ్ఱి వదలదా ఏమి? ఈ గ్రామమున మమ్ము విరోధులెవరయినా గుర్తించి, మరల మమ్ము నెత్తుకొనిపోవుదు రేమో!

సువర్ణశ్రీ: ఈ గ్రామముచుట్టును మహావీరులైన గోండులు కావలి కాయుచున్నారు. విరోధులీగ్రామమునకు రాలేరు. వచ్చినవాడు హతమారిపోవును. మీ కేమియు భయములేదు. పదివేల గోండులు నాశనమమైనగాని మి మ్మెవరును తేరిచూడలేరు.

హిమబిందు: అమ్మమ్మా, నాకు ధాన్యకటకనగరముపోవుట కిచ్చలేదు. ఈ అడవులలోనే ఉండిపోవలెనని ఉన్నది.

ముక్తా: అది ఏమి, వెర్రి తల్లీ! వట్టి మతిమాలినదానవై పోవుచున్నావు.

హిమ: అమ్మమ్మా, నాకు మతిలేదు; నిజము. పిచ్చి ఎత్తుచున్నది. నే నీ అడవులోనైన నుండవలయును, భిక్షుకురాలినైన గావలయును, లేనిచో దేహమును త్యజింపనైన వలయును.

ముక్తా: ఛీ! ఛీ! ఎంతమా టంటివి? నీ వీ దినమున నా మనస్సును పూర్తిగ పాడుచేయ దలచుకున్నావా? తల్లీ! నా యీ ముసలితనములో నిన్ను చూచుకొని బ్రతుకుచుంటిని. నీవలన నీ తండ్రియు, నీ తాతలును జీవములు నిలుపుకొనియున్నారు.

అడివి బాపిరాజు రచనలు - 2

209

హిమబిందు (చారిత్రాత్మక నవల)