పుట:Himabindu by Adivi Bapiraju.pdf/218

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సువర్ణశ్రీ మారువేషమున హిమబిందు నివసించు గ్రామముననే యుండెను. అచ్చట నొక ఫలముపై దుకూల మంటించి, దానిని చిత్రరచన కనువగున ట్లమరించి, చిత్రము నొండు రచించెను. ఆతని కుంచెల వత్సకర్ణ రోమములచే, ఉడతతోక వెంట్రుకల నాతడే నిర్మించుకొనును. ఆతడు వర్ణము లెచ్చట వీలయిన నచ్చట సముపార్జించును. నీలిరంగు, ఇంగిలీకము, సత్తుభస్మము, హరిదళము, గైరికము కాసీసము, ఖజ్జలి, మంజిష్ట, లక్షారసము మొదలుగునవి సముపార్జించుకొనినాడు. వానిని నూరి రంగులుగ నొనర్చి, తూలికతో నా చిత్రము రచించినాడు.

ఆ చిత్రమునందు తన హృదయమునే చిత్రించినాడు. ఆకాశమున గంధర్వరాజు తేలిపోవుచున్నాడు. అతని యెదుట వీణవాయించు గంధర్వాంగన త్రిభంగాకారయై పద్మాసనాసీనయైయున్నది. దిగువ కొండల మధ్య చెరువుకడ తపస్సుచేయు నొక బాలకుడు.

ఆ చిత్ర మతిమనోహరము. ఆకాశమున మేఘములు, పక్షులు, కొండలలో జంతువులు, వృక్షములు; బాలతపస్వికడ పాములు, పూల మొగ్గలు, చెరువులో పద్మములు, ఆకులు, కొంగలు, అంచలు ఇవియన్నియు చిత్రభావమునకు శ్రుతిగ నున్నవి.

ఏ నాటికైన తనకు సన్యాసమే, భిక్షుకత్వమే! ఆమెను రక్షించి ఆమె తండ్రికి అప్పగించుట తోడనే తనధర్మము పూర్తియగును. అటుపైన ఆంధ్రదేశమునకు అతి దూరమున, ఏ సంఘారామ క్షేత్రముననైన ధర్మమును, సంఘమును కొలచుచు నుండవచ్చును.

హిమబిందు తనకు దేవత. ఆమె ప్రజ్ఞాపరితాదేవియే! ఆమెను దూరమునుండి పూజచేయును. తానామె దేహమును కాంక్షించియుండెను. తన్ను ఆమెకూడ అట్లే కాంక్షించి యుండునా? ఉండదు. అట్లు కాంక్షించియున్న ఇతరుల నెట్లు ఉద్వాహము కానిచ్చగించినది?

ఆమె ఇతరుల వివాహమాడ ఇచ్చగించియుండునా? తండ్రిమాట జవదాటలేక అట్లు ఒప్పుకొనియుండునా? ఏది అయిన నేమి? ఆమె పరతంత్ర. తన ప్రభువునకు కోడలు కాబోవుచున్నది. భావి ఆంధ్ర సామ్రాజ్ఞి.

ఆమెను మనస్సులోనైన తాను తలంపగూడదే! ఎంత ప్రయత్నించినను ఆమెను మరవలేని నీరసత్వము తనగుణములందు ఏర్పడినది. అట్లు మరచుట కుపాయ మేమి? అమృతపాదార్హతులు తన కుపశమన మీయలేరా? తన గురువు సోమదత్తాచార్యులు వచ్చుచున్నారు. వారికడ నేర్చిన విద్య నేటికిట్లు ప్రదర్శిత మగుచున్నది. ఈ మాత్రము ప్రభు సేవ మొనర్చి తన ప్రభుఋణమును, గురువుల ఋణమును, హిమబిందును రక్షించి ప్రేమఋణమును, ఎచ్చటనైన సంఘారామమునకు శిల్ప మర్పించి పిత్రూణమును తాను తీర్చుకొనుగాక! ఆ పైన హిమాలయములే తనకు శరణ్యములు. హిమాలయ శిఖరములు, మహానదులు, మహోన్నత ప్రదేశములు, హిమము ఏ అగ్నిపూరిత హృదయమునకైన పరమశాంతిని ప్రసాదించగలవు.

సువర్ణశ్రీ రెండుదినములవరకు హిమబిందుకడకు బోలేదు. ఆమెను దర్శించుట ఆమె ఆజ్ఞవల్లనే. కాబోవు మహారాణి ఆజ్ఞ అనుల్లంఘనీయము కదా!

సువర్ణశ్రీ వెళ్ళుటతోడనే హిమబిందుమోము రాకాచంద్రబింబము వలె వికసించెను.

అంతవరకు ముత్తవతో నామె వాదనలు సలుపుచునే యుండెను. తాను శ్రీకృష్ణ శాతవాహనుగాని, మరి ఏరినిగాని వివాహమాడననియు, తాను భిక్కుణియై మహా

అడివి బాపిరాజు రచనలు - 2

• 208 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)