పుట:Himabindu by Adivi Bapiraju.pdf/217

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ధనుర్వీరులు బాణ వర్షము కురిపించెదరు. మంటలు దాటి గోండువీరులు వెళ్ళుటకు వీలు లేదు. గోండువీరులకు మంట లావల ఏమగుచున్నది కనబడదు. అట్లు గోండులు చీకాకునందగనే వీరివెనుక చెట్లలో దాగికొనియున్న పుళిందులు ఒక్కుమ్మడి గోండులపై గవిసెదరు ఆ సంకులసమరములో శిబిరములనుండి అందుకు సిద్ధమైయుండిన వేలకు వేలు శత్రువులు వచ్చి గోండులను తాకెదరు. ఇట్లు జరిగిన ఒక రణమున గోండులు వేయిమంది వరకు హతమారిరి. సువర్ణశ్రీ హృదయము చివుక్కుమనిపోయినది. ఆతడాలో చించి ఒక దినమూరకొని, యుద్ధమున గాయపడినవారిని వైద్యమునకై దూరపు టడవులకు పంపివేసెను.

ఆ దినమంతయు ఆలోచించి, రాక్షస గోండు నాయకుల చేర్చి వారేమి కార్యము లొనరింపవలయునో బోధించి పంపెను.

ఆ రాత్రియంతయు రాక్షసులు శిబిరముచుట్టు నున్న చెట్లపై కొమ్మలలో దాగి యుండిరి. కొందరు రాక్షసులు కుండలతో నీళ్ళు పట్టుకొని పోయి, నూనెపోసి సిద్ధము చేసియుంచిన భోగిమంటల దుంగల పై, నూనె తడిపిన గుడ్డప్రోగులపై నీళ్ళుపోసి తడిపి వేసిరి. గోండులు తమబాణము లకు నూనెతో తడిపిన గుడ్డలను చుట్టిరి.

అటు అన్నివిధముల సిద్ధమై ఒక్కసారిగా మూడువైపులనుండి ప్రత్యూషకాలముననే వచ్చి, శత్రువుల తమ సింహనాదములచే కలచి వేయుచు దాకిరి.

యధాప్రకారము మూడువైపుల మంటలంటింపబోయిన నవియంటు కొనలేదు. ఈలోన గోండుల అగ్నినారాచములు వేగమునవచ్చి పాకల, గుడారముల తగులబెట్టు చుండెను. గుర్రములు, ఏనుగులు, పశువులు చెదరిపోయెను. అటు కోటలనుండి ఆంధ్ర వీరులు తలుపు తీసికొనివచ్చి తీవ్రముగ తలపడిరి. ఈ సంకులసమరములో మాళవ సైన్యములు ధైర్యము కోలుపోయి చిందరవందరయైపోయెను. వేలకువేలు నశించి పోయిరి. చెట్లపై దాగుకొనుటకుపోయిన పులిందులను, ఆ చెట్లపై ఇదివరకే దాగు కొనియుండిన రాక్షసులు నాశనముచేసిరి.

మరల తెల్లవారుసరికి గోండులు లేరు. కోటలోనికి ఆంధ్రసైన్యములు తిరిగి పోయినవి. సమరభూమిలో, శిబిరములలో, మాళవ సైనికులు, పుళిందులు, వైదేహులు, కాళింగులు, విదర్భులు, శూరసేను లనేకులు శవములై యుండిరి.

విజయులై గోండులు, రాక్షసులు అడవులలో మాయమైనారు. మాళవుల సైన్యాలు, నూరు గజములు, అయిదువందల ఆశ్వికులు, రెండు వందల రథములు, వేయి పదాతులుగా నాలుగువైపులకు జీలిపోయి, గోండులు దాగియున్న ప్రదేశములు కనుగొని, వారని వేటాడుటకు నిశ్చయించుకొన్నవి.

ఈ విషయము సువర్ణశ్రీ గ్రహించకపోలేదు. గోండు సైన్యాలు కనబడియు కనబడనట్లు, వేరువేరు భాగాలై శత్రుసైన్యములను గోండువన దేశమువైపు దూరాటవులకు కొనిపోయి, అచ్చట వారిని చిందరవందరచేసి నాశనముచేయ సువర్ణశ్రీ, మహాబలగోండు లాజ్ఞయిచ్చిరి. ఈ వ్యూహా విధానమునకు నాయకత్వ భారము మహాబలగోండునిపై బడినది. సువర్ణశ్రీ మాటుమణిగెను. హిమబిందు కుమారియు, ముక్తావళియు కొలది దినముల వరకు దాము ప్రచ్ఛన్నముగ నివసించియున్న ఇంటనే తలదాచుకొన సువర్ణశ్రీ యుపదేశించెను.

అడివి బాపిరాజు రచనలు - 2

.207.

హిమబిందు (చారిత్రాత్మక నవల)