పుట:Himabindu by Adivi Bapiraju.pdf/216

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వినీతమతి, సమవర్తి: ఏమి, మంజుశ్రీ దొరికినాడా? ఎంత ఆనందము! నిజమేనా?

వినీతమతి: ఓ దొరా! నీవు అసాధ్యుడవు. దేవదూతవలె నున్నావే! నీకు మా హారము లన్నియు ఇవిగో!

సమవర్తి: ఎవరక్కడ? ఈగోండుమహావీరుని నోటినిండ మిఠాయి లుంచుడు! నాకు నాట్యముచేయ బుద్ధివేయుచున్నది. ఈహారములను తీసికొనుము. శుకబాణుల వారూ! వెంటనే ఈ వార్త పాటలీపుత్రము చక్రవర్తికి అందజేయుడు.

గోండుడు చెక్కుచెదరని మోముతో గంభీరముగ గూరుచుండి, వా రిచ్చిన హారములు మెడను ధరించెను.

గోండు: మీలో “చిలుక ఈటె” అనువా రున్నారట.

శుకబాణుడు పకపక నవ్వుచు ఆంధ్రప్రాక్రృతమున వినీతమతి, సమవర్తులతో “నేను “చిలుక ఈటె” నట వినుటయ్యా!” యని మరియు నవ్వుచు “ఓ గోండుదొరా! నేనే యా చిలుక ఈటెను” అనెను.

గోండు డేమియు నవ్వక “ఓ చిలుకదొరా, నేను మా మహారాజు కడ నీ ఉద్యోగము వంటి ఉద్యోగమునే చేయుదును. నేను మా మహారాజును కొలుచు కొన్ని గూడెముల నాయకుడను. నా పేరు “గాలిదొర” అందురు. గాలివలె వచ్చి గతివలె పోగలను. గాలి రాకపోకలు తెలిసి తీరును. నా రాకపోకలు తెలియనే తెలియవు.”

శుకబాణుడు సువ్వున లేచి యీ గోండు దొరకు తమ యపసర్ప నమస్కారము లిడెను. అతడును తమజాతి యపసర్ప నమస్కారమును రెండు చేతులతో కళ్ళనుమూసి, చెవులు మూసి, నోరునుమూసి చూపించెను.

ఆ వెనుక వారిరువురును కౌగలించుకొనిరి.

గోండుడు: ఇదివరకే మా దొరలు పాటలీపుత్రమునకు వార్త పంపినారు. ధాన్యకటకమునకు వార్తలు పోయినవి. అటు తూర్పునుంచి సువర్ణశ్రీదొర గురువు ఆంధ్ర సైన్యములతో వచ్చుచున్నారు. వారునాలుగు దినముల దూరములో నున్నారు. పటమటవైపునుండి మహారాజు శ్రీకృష్ణ సాతవాహనులవారు వచ్చుచున్నారు. వారు పది రోజుల దూరములో ఉన్నారు. ఈ రాత్రి నేను మా దండును కలిసికొని మరల మీకు వార్తలను పట్టుకొని వచ్చెదను.

19. సైన్యాధిపతి - శిల్పి

శత్రువులను సర్వవిధముల నాశనము చేయుచు, కోటపై ఒత్తిడి తగ్గించుచు, సువర్ణశ్రీ అద్భుత యుద్ధము చేయుచుండెను. ఆతడు గోండు వీరుల యుద్ధవిధానమే మార్చివేసెను. ఒక దినమున తెల్లవారుఘడియలలో గోండువీరులను మూడు జట్లుగ విభజించినాడు. వారి నొక్కపర్యాయమే విరోధుల మూడువైపుల బోయి తాకుడని ఆజ్ఞయిచ్చెను.

ప్రథమ గోండుయుద్ధ విధానము మాళవాది సేనాపతులకు అవగత మగుటచే వారందుకు సిద్ధపడియుండిరి. సైన్యశిబిరములకు నాతిదూరము నుండి గూఢచారులు దాగుకొని యుందురు. గోండులు వచ్చుచున్నా రనగానే యా ప్రక్కపెద్ద భోగిమంటలు లేచును. మంటలకు దూరము నుండి కుడ్యములవలె గట్టి గట్ల చాటుననుండి శత్రు

అడివి బాపిరాజు రచనలు - 2

• 206 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)