పుట:Himabindu by Adivi Bapiraju.pdf/215

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇంతలో నొకనాటి రాత్రి గోండు డొకడు ఎటుల కోటలోనికి వచ్చెనో, సమవర్తి ఎదుట నిలుచుండినాడు. సమవర్తి సంభ్రమంబున నాతని రమ్మని సైగ చేసి తమ రథంబున కూర్చుండబెట్టుకొని వినీతమతి భవనమునకు బోయెను. వా రిరువురు శుకబాణునకు వార్తనంపిరి. అతడు వెంటనే యచ్చటికే వచ్చెను. శుకబాణునకు సర్వభాషలు తెలియును. అతడు గోండునితో సంభాషించెను.

“ఎవరు పంపిరి?”

“సువర్ణశ్రీ.”

“సువర్ణశ్రీయా!”

“ధాన్యకటకమున బొమ్మలు వేయువాడు. గొప్ప వీరుడు. మా మహామల్లగోండు మహారాజు స్నేహితుడు.”

“ఆత డెట్లు మీ దేశము వచ్చెను?”

“హిమబిందుకుమారిని వెదకుచు వచ్చెను. మా యువరాజు సహాయము కోరెను. వారు రాక్షసుల సహాయమున ఆమెను దాచిన ప్రదేశము గుర్తెరిగినారు. సువర్ణశ్రీ నర్మదానదీతీరమునందున్న గుహాంతరమునుండి వారిని రక్షించినాడు దొరా!”

శుక: సమవర్తితో హిమబిందును రక్షించినారట!

సమవర్తి: హిమబిందును రక్షించినారా? నిజముగా ఆమె క్షేమముగా నున్నదా? ఆమె ఏమనుచున్నది? ఎచ్చటనున్నది? త్వరగా చెప్పు మనుడు శుకబాణులవారూ!

శుక: తొందరపడకండి. ఓయీ గోండువీరా! ఆ బాలిక, ఆ బాలికతో వచ్చిన ముసలిస్త్రీ క్షేమమా?

గోండు: దొరా! వారిద్దరు క్షేమము. వారికి మా దొరసానివారు పంపిన గోండు స్త్రీలు సేవలు చేయుచున్నారు. వారు ఇచ్చటకు ఏబదిమైళ్ళ దూరముననున్న నొక గ్రామమున బ్రాహ్మణుని ఇంట నివసించి ఉన్నారు.

శుక: సమవర్తి సేనాపతీ! వారిరువురు క్షేమం. ఆరాటపడకుడు.

సమ: అమ్మయ్య. సువర్ణశ్రీ ఎంతపనిచేసినాడు! ఈత డింతటి వీరు డెప్పుడైనాడు! ఆ దినమున బండిపందెములో నన్నోడించినాడు. నేడు హిమబిందును రక్షించినాడు. ఈ హార మీ శుభవార్త తెచ్చిన గోండు వీరున కీయుడు.

శుక: గోండువీరా! నిన్నెవ్వ రిచ్చటికి బంపినారు? నీవు తెచ్చిన శుభవార్తకు మా సేనాధిపతి నీకు బహుమాన మిచ్చుచున్నాడయ్యా!

గోండు: దొరా! సువర్ణశ్రీ దొరయు, మా దొరయు నన్నంపిరి. వారు చెప్పుమనిన ముఖ్యవార్త “ఆ కొండలలోని గుహాగ్రామమును మేము పూర్తిగ పట్టుకొనినప్పుడు, అచ్చట ఆంధ్రచక్రవర్తులవారి కుమారుడు మంజుశ్రీ రాజకుమారుడు మాకు దొరికినారు. వారును క్షేమముగ నున్నారు” అని మీతో చెప్పుమని మా దొరల ఆజ్ఞ.

శుకబాణుడు “ఏమిటి గోండు దొరా! నీవు చెప్పినది నిజమా! రాజ కుమారుడు మంజుశ్రీయే మీకు దొరికినది? ఓహో ఎంత సంతోషము!” అనుచు ఆంధ్రప్రాకృతమున “ఆంధ్రా సేనాధిపతులారా! ఈ మహోత్కృష్టమగు వార్తవినండి. రాజకుమార మంజుశ్రీ, సువర్ణశ్రీ పట్టుకొనిన గుహలలోనే దొరికినాడట. ఎంత ఆనందము! నేను చేయలేనిపని సువర్ణశ్రీ చేసినాడు. ఆ బాలునిఎప్పుడు కలుసుకొందును? ఎప్పుడు కౌగిలింతును” అని వినశుడై పలికెను.

అడివి బాపిరాజు రచనలు - 2

. 205.

హిమబిందు (చారిత్రాత్మక నవల)