పుట:Himabindu by Adivi Bapiraju.pdf/214

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చారు: కోటగోడలు సమీపించుటకు వీలులేకున్నది. మనము కోటలోనికి ప్రవేశింపవలయునన్న నాకు బది దినములు గడు విచ్చినచో ఒక ఉపాయము చేయగలను. అది మనవి చేసెదను.

చక్ర: ఏ మా ఉపాయము?

చారు: ప్రభూ! గంగానదియే మనకు దారిచూపునని నా అభిప్రాయము.

స్వైత్రుడు: చారుగుప్తులవారూ! ఆ వైపున తొంగిచూచుటకైన వీలు లేకుండ చేయలేదా విరోధులు?

చారు: కావుననే అటువైపు ఛేదించుటకు ఎక్కువ వీళ్ళున్నవి.

చక్ర: ఈ పదిరోజులును ఆటపాటలతో కాలముపుచ్చవలసినదేనా?

స్వైత్రుడు: నే నొక యాలోచన చేసినాను. అది తమకు మనవి చేయగలను. ధర్మనందులచే పాటలీపుత్ర గోటలు, కుడ్యములు మట్టి బొమ్మలుగా రచింపజేసినాను. అది తమ అందఱి ఎదుటనుంచి నా ఆలోచన మనవిచేయగలను. 

18. ముట్టడిపై ముట్టడి

ఉజ్జయిని పట్టణమున ముట్టడించిన మాళవాది సైన్యముల నాంధ్ర సైన్యములు ముట్టడించినవి. అదివరకే నాలుగురోజులనుండి పదివేల గోండులు ఎడతెగని దాడులచే మాళవులను చీకాకుపరచి నాశనము చేయుచుండిరి.

ఈ దాడులు సాధారణ గోండుల దాడులవలె లేవు. కొన్ని సంవత్సరములు క్రమశిక్షణ నందిన సంశప్తకాంధ్రులవలె గోండులు యుద్ధము చేయుచుండిరి. నేడు తూర్పువైపునవచ్చి తాకుదురు. విల్లులు ధరించి ముందు తీగెలతో దట్టముగా అల్లిన తడకలవంటి కేడెములు ధరించి వత్తురు. కేడెము నొకడు పట్టుకొనును. ఒకడు విల్లును లాగి బాణములు వదలును. ముందు పంక్తివారు వెల్లకిల పండుకొని పాదములతో విల్లు దండమును నొక్కిపట్టి రెండుచేతులతో రెండు చేతుల పొడవుగల ఈటెలను వదలుదురు.

ఆ వెనుక పంక్తివారు మోకాళ్ళపై గూరుచుండి బాణములు వదలుదురు. వెనుకపంక్తి వారు నిలుచుండి అంబుల వదలుదురు. బాణములు మృత్యుదేవతా కటాక్షాంచలములవలె పర్వును. వేలకువేలు విరోధులు చనిపోదురు.

మరునాడా దండంతయు మాయమైపోవును. తెల్లవారు ఘడియలలో, సాయంకాలపు ఘడియలలో శత్రువుల తాకుచుందురు. ఇంకొక దినమున పడమటి వైపున దాకుదురు. వేరొకరోజున ఉత్తరమున ప్రత్యక్ష మగుదురు. ఎంత వేగముగ వచ్చి దాడిసలుపుదురో, అంత వేగముగ మాయమగుదురు.

పట్టణమునకు పడమటగనున్న శీప్రానది వారి దాడుల నరికట్టలేదు. మాళవుల సైన్యముల వేలకువేలు సైనికులు మట్టి పాలగుచున్నారు. అశ్వములు, గజములు నాశనమైపోవుచున్నవి. మాళవాధిపతి “ఎవ్వరీ గోండుల నాయకుడు, ఈ గోండు లేల విరోధము పూని తమపై వచ్చిపడిరి?” అను ప్రశ్నలచే విహ్వలచిత్తుడయ్యెను.

గోండులు వచ్చి తాకిరనువార్త ఉజ్జయినీ నగరములోని ఆంధ్రులకు తెలిసినది. వినీతమతి, సమవర్తి, శుకభాణాదుల యాశ్చర్య సంతోషములకు మేరలేదు.

అడివి బాపిరాజు రచనలు - 2

• 204 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)