పుట:Himabindu by Adivi Bapiraju.pdf/213

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గొనును. అట్టి బాణములు మహా వర్షపాతపు జినుకులకు బాఠము నేర్పునట్లు ఆంధ్రుల విండ్లు వీడివచ్చి పడుచుండును. కోటగోడలపై, బురుజులపై, గోపురములపై పాటలీపుత్ర పుర సైనికుడు తలచూప భయపడిపోవుచుండెను. ఈలోన అగ్ని గోళములు, శతఘ్నులు శిలాఘ్నులు శిలావర్షము కురియుచున్నవి. ఆంధ్ర సైన్యములపై గూడ ఆ భయంకరా యుధములు వర్షము కురియుచున్నవి. ముట్టడి ప్రారంభించిన ఎనిమిదిదినములవరకు ఆయుధ వర్షములతోడనే ఇరువాగుల సైన్యములు పోరాటము సలుపుచుండెను.

ఇంతలో పదవదినమున శుకబాణునికడనుండియు, ధాన్యకటకము నుండియు వార్తలు వచ్చినవి. ధాన్యకటకపురి సేనానాయకులు హిమబిందు జాడలు తెలియుటకు సర్వప్రయత్నములు చేయుచుండిరనియు, శ్రీధర్మనందిగారి కుమారుడు సువర్ణశ్రీ అడవులలో ఆమెను వెదుకబోయెననియు ధాన్యకటకమునుండి వార్తలు వచ్చెను.

హిమబిందు మాళవులచేతిలో బడెననియు, ఆమెచే నుత్తరము వ్రాయించి సమవర్తిని యుద్ధ పరాజ్ముఖునిచేయ బ్రయత్నించిరనియు, ఉజ్జయినిలో ఆంధ్రసైన్యములు ధైర్యముతో బోరుచున్నవనియు, తానుగూడ కొందరు చారులనుబంపి హిమబిందును వెదకించెదననియు వార్తనంపినాడు శుకబాణుడు. శ్రీకృష్ణ సాతవాహనుడు అభీరుల నోడించి, భరుకచ్ఛము పట్టుకొనినాడట. స్థౌలతిష్యుడు శిష్యగణముతో కాశికాపురయాత్రకై బయలుదేరినాడట. ఆంధ్ర సైన్యములు పోయి ఉజ్జయినిని ముట్టడించిన మాళవ సైన్యమును తాకినారట. ఈలోన గోండులు వేలకు వేలు వచ్చి వేరొక ప్రక్క తాకినారట. గోండు సైన్యమువలన మాళవ సైన్యములకు సంభవించిన నాశనము వర్ణనాతీతము.

ఈ వార్తలన్నియు సమాలోచించుటకు చక్రవర్తి భవనమునకు చారుగుప్తుడేగెను. చక్రవర్తి పాటలీపుత్ర మాండలికుని భవనమొకటి యాక్రమించి యందుచేరినారు. ఆలాగుననే పట్టణము బయటనున్న అనేక భవనములలో, పరిసరములనున్న గ్రామాదులలో సేనాపతులు, మంత్రులు, ధర్మనంది మొదలగువా రందరు చేరినారు.

చారుగుప్తుడు చక్రవర్తిచే ననుజ్ఞాతుడై వారి సభామందిరము జేరి, సామ్రాట్టుకు నమస్కరించి, యుచితాసన మధివసించెను. ఇంతలో స్వైత్రుల వారు, అచీర్ణులవారును వచ్చిరి.

చారు: ప్రభూ! మన సైన్యములు నెమ్మదిగ ముట్టడిసాగింపనెంచినచో ముందు ముందు చిక్కు లెక్కువయగును. అఖండవేగమున మన కున్న శక్తినంతయు నుపయోగించి, పాటలీపుత్రమును ఛేదింపవలయును.

మహామాత్యుడు అచీర్ణుడు: ప్రభూ! ఆంధ్ర సైన్యములు హిమపాతము రీతి మహాకల్లోలమువలె పాటలీపుత్రముపై విరుచుకుపడుటకే నేను సర్వసన్నద్ధములు చేయుడని సైన్యాధ్యక్షులతో మనవి చేసియున్నాను.

స్వైత్రుడు: ప్రభూ! ఇక్ష్వాకులు ఉత్తరపు నదీతీరమునను, పూంగీయులు వారికి బాసటగాను, పల్లవులు వారి నంటియు మొనతీర్చియున్నారు. తూర్పున మంజష్టులు, యక్షులు, నాగులు మోహరించియున్నారు. వేంగీయులు, వజ్రభూములవారు దక్షిణ తీరమున నున్నారు. ప్రతీకారపు బురుజులు సిద్ధమైనవి. సొరంగములు త్రవ్వుచున్నారు.

చక్ర: ఎన్నియైనను ముట్టడి ఆటపాటలుగ సాగుచున్నది. ఎవ్వరికిని వేడి ఎక్కలేదు. ఎక్కడో ఏదియో లోటు కనబడుచున్నది.

అడివి బాపిరాజు రచనలు - 2

• 203 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)