పుట:Himabindu by Adivi Bapiraju.pdf/212

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బౌద్ధులు. కాని కామరూపమునకు, వంగదేశమునకు, వారణాసికి, నేపాళమునకు అతివేగమున వార్త లంపుటచే వంగమునుండి ఇరువదివేల సైన్యము, నేపాళమునుండి ఎనిమిదివేల యక్షసైన్యము, కామరూపమునుండి నాలుగువేల సైన్యమును వచ్చినవి.

మగధదేశమునందు మాండలకులు ముప్పదివేల సైన్యము నంపిరి. ఈ లక్ష పదివేల సైన్యము పాటలీపుత్రమును సంరక్షించుచుండ, ఉజ్జయిని పడిపోవుటతోడనే మాళవ మహారాజు తన లక్షసైన్యముతోడను, శివస్వాతి అరువదివేల సైన్యముతోడను, మాగధసైన్యము లక్షయు, పుళిందాదుల ఆటవిక సైన్యములు, ఔఘలుని సైన్యము అన్నియు వచ్చినచో ఆంధ్ర సైన్యములు తుత్తునియలైపోవును. ఆంధ్రదేశమునెత్తిపోయి, ఆంధ్రుల నోడించుటకంటె ఇదియ ఉత్తమమైనది అని సుశర్మ యూహించినాడు. పాటలీపుత్రమున విజయహోమములు, దేవతారాధనలు జరిగినవి. అంతకు ముందుగనే బౌద్ధులందరు పారిపోయిరి. సంఘారామములు పాడు పడిపోయినవి. మహా చైత్యముల నిదివరకే పాడు పెట్టి నాశనము చేసిరి.

గంగానది వేసవివరదలతో నిండియున్నది. ఉత్తరమున గండకీ నది పూర్తిగా ప్రవహించుచువచ్చి, గంగానదిలో కలియుచున్నది. శోణానదిలో గోగ్రలో జలములు చాల తక్కువయున్నవి. వైశాఖమాసాంతపు టెండలకు, వేడిగాడ్పులకు ముట్టడించిన ఆంధ్ర సైన్యములు మాడిపోవుచున్నవి. పాటలీపుత్రనగరము చుట్టును ఎన్నియో తోటలుండుట సైన్యమునకు మంచిదైనది.

సైన్యములు వచ్చి ముట్టడించిన మూడవదినమునుండి చారుగుప్తుడు ప్రత్యాసారులను చుట్టునుండు గ్రామగ్రామములకు పంపి, కోట్లకొలది తాళపత్రముల తెప్పించి ఏబదివేల శిబిరములు నిర్మించెను. మృణ్మయ కలశములు శిబిరములందుంచ బడినవి.

పానశాలలు, వీరపాణశాలలు, అంగడులు విరివిగ నేర్పరుపబడినవి. వైద్యశాలలు ఏర్పాటు గావింపబడినవి. వేరొక మహాపట్టణమే ఎత్తివచ్చినట్లు ఆంధ్ర సైన్యము లమరింపబడినవి.

చారుగుప్తుడు పదివేల గోవులను, ముప్పదివేల మహిషములనుకొని వచ్చెను. అవియుగాక అతడు ధనము వెదజల్లుటచే చుట్టుప్రక్కల గ్రామాదులనుండి గోపకులు పాడిపశువుల గొనివచ్చిరి. వర్తకులు వచ్చి అంగడులు పెట్టిరి. నర్తనశాలలు ఏర్పరుప బడెను. గాయకులు, కవులు వచ్చిరి. ఇదియంతయు నిట్లుండ, యుద్ధము విషయములో కోటలు, కుడ్యములు ఛేదించుటకు ఎత్తయిన దిబ్బలు చిన్నబురుజులు ప్రతిగా నిర్మింప బడినవి. వారిపై మహాధన్వులగు ఆంధ్రులు ప్రవేశించిరి. సర్వతో భద్రాదియంత్రములు నెలకొల్పినారు.

ఒక్కొక ఏనుగుపై పదిమంది విలుకాండ్రుందురు. అన్ని ఏనుగులకు సంపూర్ణ కవచములున్నవి. ఖడ్గమృగపు చర్మముచే చేయబడి, నున్నగ మైనము పూయబడి ధనువు ఎత్తుననున్న కేడెములు ధరించి తలపై రక్షక భటుడు అడ్డముపట్ట, ధన్వి బాణములు వేయును.

ధనుర్యుద్ధమం దాంధ్రు లప్రతిమానులు. కోట గోడలపై సైనికుడు పొడసూపుటేమి బాణము సువ్వునవచ్చి, ఎట్టికవచమునై నను దూసుకొని పోయి, ఆ సైనికుని ప్రాణము

అడివి బాపిరాజు రచనలు - 2

• 202 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)