ఈ కేకలు, గడబిడయు, సొరంగద్వారమున నున్నవారికి వినిపించి నవికాబోలు వారు మాళవభాషలో “ఏమి టీ గడబిడ!” రా యని కేక వేసి చేత నున్న ధనస్సుల నెక్కుపెట్టిరి.
సొరంగమార్గము ఎచ్చుతగ్గులుగా పక్కల, పైన పెద్దరాళ్ళతో నిండియున్నది. వెనుకవచ్చు కాగాడాలు ముందుపోవు ముక్తావళీ హిమబిందు సువర్ణశ్రీలకు ఒకరకపు గుడ్డిదారిని చూపుచున్నవి. ఎదుట ఇద్దరు బాణము ఎక్కుపెట్టి “ఆగుడు” అని కేక వేసిరి.
సువర్ణశ్రీ హిమబిందు చెవిలో నేమియో యూదెను. హిమబిందు నిర్భయముగ ముందుకు పరుగిడుచు, “ఎవరోవిరోధులు కొండలమీద నుండి దిగి వచ్చిరి. కొందరము సొరంగములోనికి వచ్చినాము. కొందరు మనవారు గుహలలోనుండి యుద్ధము చేయుచున్నారు” అని మాళవభాషలో అరచినది.
తమస్నేహితుడు శక్తిమఖుడును, ఇరువురు రక్షక స్త్రీలు నిట్లు వచ్చుటయు “ఆపుడు, కొట్టుడు, పట్టుకొనుడు” అని వారి వెనుకనుండి కేకలు విన వచ్చుటయు, ఆ ఇరువురివీరుల మనస్సులను కలతపెట్టుటచే వారు ఇదమిత్థమని తేల్చికొనలేక, బాణము లెక్కుపెట్టియే వీరిదెస చూచు చుండ వెనుక మలుపులో దీపములువచ్చు వెలుతు రాడుచుండెను.
ఇంతలో శక్తిమఖుడని వారనుకొన్న వీరుడు విల్లునుండి విడువబడిన బాణమువలె రివ్వునవచ్చి ఒక రక్షకభటుని కౌగలించుకొని “కొంపలు మునిగినవి,” అని కేకలువేయుచు, ఆతని పట్టుకొని, బరబర నీటికడకు లాగుకొనిపోయి, యాతనితో నీటిలో పడెను.
రెండవయాతడు ఏమిది యని వారి వెనుకనే పరుగిడి చూచుచుండ హిమబిందింతలో వచ్చి యా మనుష్యుని నీటిలోనికి త్రోసినది. ఆతడు నీటిలో మునిగిపోయి, పైకి తేలునప్పటికి సువర్ణశ్రీ యాతనిపై కురికి గొంతు పట్టుకొనెను.
సువర్ణశ్రీ నీటిలోనికి త్రోసినవాడు గట్టెక్కవలెనని ప్రయత్నించుచుండ హిమబిందు ఖడ్గపు మొనతో నతనిచేయి గ్రుచ్చినది. అతడుచేయి వదలి నీటిలోనికి జారిపోయెను. రెండవవాడు ప్రాణభయమున గుహాద్వారమునుండి నదిలోనికి గబగబ ఈదుకొనిపోయెను.
ఆత డిట్లేదుకొనిపోవుటచే సువర్ణశ్రీ ముక్తావళీ హిమబిందుల ప్రాణ రక్షణయైనది.
14. “నేలయీనినట్టు నిండెదండు”
అట్లా రక్షకభటుడు ప్రాణరక్షణకై నదిలోనికి ఈదుకుపోవుటయు, అక్కడనే ఒక తెప్పయు, ఆ తెప్పనిండ గోండు లుండిరి.
ఆ తెప్పపైన గోండువీరులు ఈ మనుష్యుడు ఈదుకొనుచు ఎప్పుడు కనబడెనో వెంటనే తెప్పను తెడ్లతో నటకు త్రోసి, యా మనుష్యుని రెక్కపట్టి తెప్పపైకి లాగివేసిరి.
వెంటనే మాటలాడక ఆ మహాశిలలవెనుక దాగియున్న సొరంగపు ముఖ ద్వారమునకు తెప్పను త్రోయించినాడు మహాబలగోండుడు. అట్లు త్రోయించుచు ఆ పర్వతములలో, లోయలలో మారుమ్రోగునట్లు నెమలికేక పెట్టెను. ఆ ప్రతిధ్వనులకు ప్రతిధ్వనులా యనునట్లు నలువైపుల నుండి ఎన్నియో నెమలికేకలు వినవచ్చినవి.
అడివి బాపిరాజు రచనలు - 2
• 194 •
హిమబిందు (చారిత్రాత్మక నవల)