Jump to content

పుట:Himabindu by Adivi Bapiraju.pdf/203

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సువర్ణశ్రీ ఆగి, హిమబిందును ముందునకు త్రోసి, ఆమె వెనుక ముక్తావళీ దేవితో పరుగిడ నారంభించెను. బాణములు వర్షమువలె కురియ నారంభించెను. ఆ కనుచీకటి వలనను, సువర్ణు డడ్డదిడ్డముగ పరుగిడుట వలనను, హిమబిందు కుమారికకుగాని, ముక్తావళికిగాని బాణము తగులకూడ దని విలుకాండ్రు శరములు వదలుచుండుటవలనను వా రింకొక పది నిమేషములలో గుహాముఖము చేరిరి. గుహాముఖమున ఖడ్గము త్రిప్పుచు నొకడు నిలిచియుండెను.

సువర్ణశ్రీ ముక్తావళీ దేవిని దింపి, వారి నిద్దరను సొరంగపుగోడ నానుకొని ముందుకు సాగిపోవుడని చెప్పి, సింహమువలె సొరంగముఖముననున్న వీరునిపై నురికెను. ఆ ఉరుకుటలో తనచేతిలోని ఖడ్గముచే ఎదుటి వీరుని ఖడ్గమును క్రిందకు గొట్టి, కాలితో నాతని పొట్టపై దన్ని, యాతడు పడిపోవుటతోడినే ఒక్క ఉదుటున సొరంగ మార్గములోని కురికి వెనుకనున్న విరోధిని కత్తితో నివారించుచు, సగము ఏడ్పుతో, సగము నవ్వుతో ఊగిపోవు హిమబిందును ఒక చేతితో పట్టి “రండ”ని బుసకొట్టి ముక్తావళిని రెండవచేతితో పట్టి ముందునకు సాగెను.

ముక్తావళీదేవి పరుగిడలేదు. కావున సువర్ణశ్రీ ఆమెను కుడిచేతితో బుజమున వేసుకొని “మామ్మగారూ! మీరేమియు భయపడకుడు. బోను దాటి వచ్చినాము ఇంక పది అడుగులలో నదికడకు వచ్చెదము. అచ్చట నా స్నేహితుడు పెద్దసైన్యముతో ఉన్నాడు. మనము తొందరగ పోవలెను అంతియ” అని చెప్పి ముందునకు వేగముగ సాగెను.

పదియడుగులు నడిచెనో లేదో, సువర్ణశ్రీ, కట్టిపడవేసిన శక్తిముఖునకు మెలకువ వచ్చినది కాబోలు నెమ్మదిగ దొర్లుకొనుచు గుహాముఖ మనకు వచ్చుచుండెను. ముందు వేగముగ బరుగిడు హిమబిందు కాలి కాతడు తగిలి, ఆతనిపై తలక్రిందులుగ పడి, “హో” యని కేకవేసి నది. ఆమె మీదపడినప్పు డేమియైనది తెలియక “హో” యని యాతడు భయమున నరచెను.

ఈ రెండు ధ్వనులతో సొరంగమంతయు మారుమ్రోగెను. ఈ లోన సొరంగము లోనికి విరోధులు తండతండముల పొలికేకలు పెట్టుచు పరుగిడి వచ్చుచుండిరి. బాణములు వర్షము కురియుచు “ఖంగు ఖంగు” మని గోడలకు తగులుచుండెను.

సువర్ణశ్రీ ముక్తావళీ దేవిని దింపి “మీరు ముందు వీలయినంత వేగమునపొండు. హిమబిందూ! నీవు మామ్మగారి చేయిపట్టుకొని త్వరితముగ బోయి, సొరంగపు మొగమునకు కొంచెము దూరమున ఆగుము. అక్కడ ఇద్దరు కాపుండెదరు. నేను వచ్చిన వెనుక వారి పని పట్టెదను” అని అరచి, పడిన యతనితో “ఆ బాణములు నిన్ను చంపును. నీవు కేకలు వేయుచు నీ కట్లు విప్పించుకొని బ్రతుకుము. గోడ ప్రక్క దొర్లిపొమ్ము” అని కేక వేసి, పరుగిడెను.

ముక్తావళీ దేవికి యవనరక్త ముప్పొంగినది. ఈలోన ఆమెకు రక్తనాళముల బాగుగా రక్తము స్రవించినది కాబోలు, మనుమరాలు తన చేయిపట్టుకొని దారిచూప, ఆ రక్షక స్త్రీ వేషముతో ముందునకు సాగిపోయెను. కావలికాయువాని కవచమే తన్ను రక్షింప, నమితవేగమున సువర్ణశ్రీ హిమబిందును, ముక్తావళీ దేవిని కలుసుకొనెను. వెనుకవారు అతి వేగముగ కాగడాలు పట్టుకొని పరుగిడి వచ్చుచుండిరి. వారికిని, పారిపోవు వారికిని ఇరువది ధనువులకన్న ఎక్కువదూరములేదు.

అడివి బాపిరాజు రచనలు - 2

• 193 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)