పుట:Himabindu by Adivi Bapiraju.pdf/202

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆమె అప్పటికే రెండవ ప్రతీహారిణితో చక్రవర్తి శ్రీసుశర్మ కాణ్వాయనుల ఆజ్ఞగా వచ్చిన సేనాపతి యని చెప్పి, యామెను సిద్ధముచేసి చక్రవర్తి ఉంగరము ఆనవాలుగ చూచుటకు ఎదురుచూచుచుండుటయు, నా నూత్న పురుషుడు లోనికి రమ్మని పిలిచెను.

ఆ ప్రతీహారిణి లోకరక్షణభారమంతయు తాను మోయుచున్నట్లు భావించుకొనుచు లోనికి బోయినది. ఇరువది మూడుకలల కాలములో హిమబిందీవలకు వచ్చి రెండవ యామెను లోనికి బిలిచెను. మరి పదికాష్టలలో మొదటి ప్రతీహారిణి వచ్చి గుహాముఖమున నిలబడినది. 

13. బంధ విమోచనము

ఈ చిన్ననాటకము నెడమ వైపుననున్న గుహనుండి ఆరుగురు నాయకులు గమనించిరి. బందీగా కొనిరాబడిన వారలలో పెద్దయామె మొదట ఏవియో కేకలు వేసినదనియు, అల్లరిచేయ ప్రారంభించుటచే గుహాముఖమున కావలికాచు యోధుడు వచ్చి సరైననియు వా రనుకొనిరి.

ఆతడు రెండవసారి వచ్చి, అక్కడ కావలిగాచు రక్షక స్త్రీలతో మాటలాడుట వారిలో నొకరికి అనుమానము కలిగినది.

“ఏమయ్యా, ఆ భటుడు రెండుసారులు గుహకడకు వచ్చినాడేమి?”

రెండవయతడు: ఎవరు వచ్చినది?

మొదటి: గుహాముఖమున కావలికాయు భద్రుడు.

మూడవ: అవును. భద్రుడు తనస్థానము కదలుట ఎందుకు? గుహాముఖమున శక్తిమఖుడు లేడే? అత డేమయినాడు?

తక్కినవారు: ఏమీ! శక్తిమఖుడు లేడా?

మొదటి: అతడు కనపడలేదు, ఇది ఏదో వింతగ నున్నది. నీవు శంఖమూదుము. వెంటనే కత్తులు ధనుర్బాణములు పుచ్చుకొని రండు!

ఒకడు వెంటనే శంఖము నెత్తి, “భోం! భోం!” అని ఆ గుహా ప్రాంగణావరణమంతయు మారుమ్రోగునట్లు ఊదెను.

నిదురపోవు వా రులికిపడి లేచిరి. కత్తులతో, కటారులతో, శూలములతో గుహలనుండి వీరులు బయటి కురికిరి. పలువురు ధనుర్బాణములు ధరించి ఈవలకు పరువిడి వచ్చిరి. మన నాయకు లిర్వురలో ఇద్దరు హిమబిందు గుహవై పునకు, నలుగురు గుహాముఖమునకు పరువిడిరి.

ఈలోననే సువర్ణశ్రీ ఇరువురు రక్షకస్త్రీలతో గుహాముఖమువైపు పరుగిడెను. పెద్దదైన ముక్తావళి పరుగిడలేక మోకాళ్ళు బిగిసికొనిపోయి ముందునకు బోర్లగిలపడెను. తరుముకొని వచ్చువారు ఘుల్లున కేకలువేసి అటకు ఉరికిరి. కాని సువర్ణశ్రీ యామెను సునాయాసముగ నెత్తి, గుహాముఖమువైపు పరుగిడెను. ఈలోన మొదటి నలుగురిలో ఒకడు గుహా ముఖమును ముందుగా జేరెను.

కరవాలము మాత్రము చేత ధరించి, హిమబిందు తూలుచు సువర్ణశ్రీ వెనుకనే పరుగెత్తి వచ్చుచుండెను. సువ్వున పది బాణములు వీ రున్నదెసకు వచ్చి, పర్వత కుడ్యమునకు తగిలి ఖంగు ఖంగున మ్రోగినవి.

అడివి బాపిరాజు రచనలు - 2

. 192.

హిమబిందు (చారిత్రాత్మక నవల)