పుట:Himabindu by Adivi Bapiraju.pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆ కందరము ఎత్తుగా అందముగా నలంకరింపబడియున్నది. అచ్చట పలువురు స్త్రీలు నడయాడుచుండిరి. అందు కొంద రాంధ్రస్త్రీలవలె కాననయిరి. సువర్ణశ్రీ గుండెలు తోడనే దడదడకొట్టుకొన నారంభించెను. ఎప్పుడు తాను కట్టివేసిన మనుష్యునివంతు మార్చుటకు కొత్త రక్షకభటులు వచ్చెదరో? దీర్ఘ కందరాగతుడై పడియున్న తన బందీని ఎవరైన గుర్తించెదరేమో? తా నేమి చేయవలసియుండునో?

ఇంతవరకు తన్నిక్కడకు కొనివచ్చిన యదృష్టదేవతయే తన్ను రక్షించుగాక యని సువర్ణుడు ప్రార్థించుకొనెను. తాను కానరాక మహాబల గోండుడేమి అలమటచెందునో యనియు నాతడు భయపడెను.

కొంతకాలమునకు మనుష్యులందరు సద్దుమణగుచుండిరి పోత పోసిన విగ్రహమువలె సువర్ణుడచ్చటనే నిలుచుండి యాలోచించుచుండెను. ఇంతలో ముక్తావళీ దేవి కంఠము స్పష్టముగ వినవచ్చినది. “ఎన్నిదినము లీ చీకటి గుహలో మా కీ నిర్బంధము?” అను ఆమెమాటలు ఆ నిశ్శబ్దతలో మారుమ్రోగినవి.

సువర్ణశ్రీ మ్రాన్పడిపోయెను. అతనికి సంతోషము, విషాదము, కోపము ఒక్కసారి ఉప్పొంగిపోయినవి. తాను వారి దగ్గరకు పోవుట మంచిపని కాదు. ఈ చాటుచోటు నెట్లయిన పట్టుకొని తీరవలయును. ఈ స్థలమును రక్షించు సైనికులు నూరు, నూట ఏబదికన్న ఎక్కువయుండరు. యుద్ధముచేసి ఈ స్థలము పట్టవలయు నన్న హిమబిందుదేవి కేమి కష్టము వాటిల్లునో? ఎవరో ఒక విరోధి ఈ స్థలము తెలిసికొన్నాడని వారికి తెలిసి పోయినచో నేమి మొప్పము వాటిల్లునోయని యాతడు తీవ్రాలోచనలో మునింగి “ఇప్పుడే వారిని రక్షింపవలెను. తరువాత కథయంతయు తారుమారు కాగలదు” అను నిశ్చయమునకు వచ్చెను.

ఆలోచన పొడముట ఏమి, అపుడపుడే వెన్నెల కొండశిఖరములపై దాటి యవతలకు ఒరిగిపోయిన కారణమున చిరువెలుగుతో నిండి యున్న యా ప్రదేశములోని కాతడు నడచిపోవుట యేమి?

ఒక రిద్ద రీతనివైపు చూచిరికాని గుహాముఖమున కావలికాయు మనుష్యుడిట్లు వచ్చుచున్నా డని వా రనుకొనలేదు. ఎవరో రక్షకభటుడు ఆ క్రొత్తగ వచ్చిన ముసలమ్మను మందలించుటకును పోవుచున్నాడని భావించిరి.

అతడు తిన్నగ ముక్తావళీదేవి కేకలువిన్న గుహకడకు బోయెను. ఆ గుహ యందెన్నియో మృగచర్మములు పరచియున్నవి. అచ్చట ఇరువురు రక్షక స్త్రీ లాయుధపాణులై కావలిగాచుచు నిలిచియుండిరి. సువర్ణశ్రీ అనుమానమేమియు లేనివానివలెనే నిర్భయముగ నటకు బోయెను.

కాని అతని ప్రాణము లరచేత నున్నవి. 

12. పునస్సందర్శనం

కంఠధ్వని మార్చుకొని, కొంచెము బొంగురుపోయిన గొంతుకతో సువర్ణశ్రీ మాగధిలో “ఏమి ఆ ముసలమ్మ కేకలు వేయుచున్నది? అని ప్రశ్నించెను.

“ముసలమ్మా! ముసలమ్మ కేకలు పెట్టదా మరి! మేము మనుష్యులము అనుకొంటిరా, పశువుల మనుకొంటిరా?” అని ముక్తావళీ దేవి కెంపులుగ్రమ్మిన కన్నులతో వణకుచు కేకలు వేసినది.

అడివి బాపిరాజు రచనలు - 2

• 189 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)