పుట:Himabindu by Adivi Bapiraju.pdf/198

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సువర్ణశ్రీ పదినిమేషములు తీవ్రాలోచనలో మునింగి కర్తవ్యము నిశ్చయించుకొనెను. అతడు ఇటునటు తడవినంత రెండుచిన్న రాళ్ళు దొరకినవి. తన నడుమునకు కట్టియున్న చురకత్తియను వదులుచేసికొని, ఎడమచేత దృఢముష్టిని ధరించి, కుడిచేత నా రాయిని నేల పైగొట్టి “టికటిక” చిన్న చప్పుడు చేసెను.

గుహాముఖమున నున్న ఆ రక్షకభటుడు స్తంభించిపోయెను. ఇటు నటు పరిశీలించి యాతడు నెమ్మదిగ సువర్ణశ్రీ వైపునకు వచ్చెను. ఆ కటికచీకటిలోగూడ సువర్ణశ్రీ చూపు మార్జాలదృష్టివలె నైనది. అది అటవీ సంచరణ విద్యాఫలము.

సువర్ణశ్రీ లేడిపై నురుక పొంచియున్న శార్దూలమువలె సర్వావయవములు పొంగ ఛెంగున విరోధిపై నురుక సన్నద్ధుడైయుండెను. అజానుబాహుడైన యా రక్షకభటుడు తనతో నొక దివిటీ తీసికొనిరాక పోవుటయే దోషము.

తన ప్రక్కనుండి యాతడు పోవుచున్నప్పుడు చప్పుడుకాకుండ సువర్ణశ్రీ ఆ రక్షకభటుని వీపుపై ఉరికి కుడిచేత విరోధినోరు గట్టిగమూసి ఎడమచేత నా మనుష్యుని చుట్టి నొక్కిపట్టుచు, కుడిచేయి మణికట్టు గట్టిగ నొక్కిపట్టెను.

తనగురువు సోమదత్తాచార్యులు నేర్పిన మల్లయుద్ధపు నేర్పు నుపయోగించి విరోధిముద్దయై ఒరుగునట్లు మోకాలు డొక్కలో నొక్కి వేసెను. వాని చేతులు బంధించియే బొటనవ్రేల మెడరక్తనాళము గట్టిగ నొక్కుటయు, అయిదు నిమేషములలో స్పృహతప్పి ఆ మనుజు డొరగి పోయెను. క్రిందకు బడిపోవు ఆతని కత్తిని వెంటనే వేగమున పిడితో పట్టుకొని, వానిని క్రింద చల్లగ బరుండబెట్టి, వాని నడుమునకు బిగించు కొనిన కాసెకోక వదలించి, నెమ్మదిగ లాగి, ఒక చివర ఆతని నోటిలో కుక్కి కిక్కురుమనకుండ బంధించి వేసెను. తన నడుమునకు చుట్టియున్న త్రాటితో ఆ మనుష్యుడు కదలకుండ గట్టిగ కట్టివేసినాడు. అచ్చటినుండి త్వరితముగ తన అలంకరణవిధ మంతయూ నూడ్చి యా రక్షకభటుని గోండునుజేసి, తా నా రక్షకభటుని వేషము వైచికొనెను.

ఒక అరగడియలో సువర్ణశ్రీ మాళవ సైనికుని వేషమున నిర్భయముగ లేచి గుహ వెలుపలికి వెడలిపోయెను.

అక్కడ సువర్ణశ్రీ సందర్శించిన దృశ్యము పరమాద్భుతమైనది. అది వింధ్య పర్వతములో ప్రకృతి ఏర్పరచుకొనిన చక్రాకారమగు లోయ చుట్టును మనుష్యుడు ప్రాకలేని ఎత్తయిన శిఖరములు పెట్టని కుడ్యములై ఆకాశము నంటుచుండెను.

ఆ విశాల చక్రాకార కందరాప్రదేశము ఎనుబది ధనువుల వెడల్పు నూటఇరువది ధనువుల పొడవు నున్నది. ఆ భృగుకుడ్యము చుట్టును ముప్పది, నలుబది బిలము లున్నవి. కొన్ని గహ్వరము లయిదారు ధనువుల ఎత్తున నున్నవి. ఎత్తయిన యా బిలములకు పోవుటకు మెట్లున్నవి.

ఈ పర్వతాంతరస్థలమునకు వచ్చుటకు సువర్ణశ్రీ వచ్చినమార్గము తప్ప వేరొండు లేదనియే యాతనికి తోచినది. ఆ ప్రదేశమునందు మూడు నాలుగు వందల జను లుండవచ్చును. అందు బ్రాహ్మణులు, క్షత్రియులు, ఆటవికులు, నాగరజనులు అనేకులు కనబడిరి. కొందరు అక్కడక్కడ నులకమంచములపై పండుకొనియుండిరి. కొందరు తన గుహాప్రాంగణముల ప్రక్కలు వైచుకొనియుండిరి. అన్నింటికన్న మధ్యగానున్న గుహ యొక్కటి సువర్ణుని దృష్టి నాకర్షించినది.

అడివి బాపిరాజు రచనలు - 2

• 188 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)