ఇంతలో నా పడవ ఆ కొండచరియ గోడలనుండి వచ్చినట్లు బయలుపడు చుండెను. అందు ఇరువురు మనుష్యులుండిరి. వారు చల్లగ నా పడవను నడిపించుకొని పోయిరి. ఆవలి ఒడ్డున కరిగి ఆ గుట్టలలో, రాళ్ళలో చరియలనుండి నీటికడకు వ్యాపించు తీగలలో, వృక్షములలో, క్రీనీడలందు ఆ పడవ మాయమైపోయెను.
సువర్ణశ్రీ దడదడలాడు గుండెలతో ఆ గుట్టలలో నేరికి గనపడ కుండ ప్రాకుచుపోయి కొంచెము వీలయినచోట నదిలోనికి దిగజారెను. అక్కడ మొసళ్ళుండునేమో యను భయ మాతనికి కలుగలేదు. లోతులుండునో, వడులుండునో, ప్రచ్ఛన్నశిల లుండునో, ఒడ్డునకు మరల చేరుటకు వీలుండునో ఉండదో యని యాత డాలోచింపలేదు.
అతడు నెమ్మదిగ ఈదుకొనుచు ఆ పడవ యాగినదని తాను నిర్ణయించుకొన్న ప్రదేశముకడకు పోయెను. నీటివడి ఎక్కువగ నున్నది. అయినను వీరుడగు నా బాలకుడు మత్స్యతరణవిధాన ముపయోగించుచు నెమ్మదిగ నా ప్రదేశమంతయు గాలించెను. ఆ పడవ యెచ్చట మాయమైనదో ఆతనికి గ్రాహ్యము కాలేదు.
ఇంతలో పెద్దస్ఫటిక శిలప్రక్క నొకగుహవంటి ద్వార మా శిలాతలమున నీటిమట్టమున గాన్పించినది. దానిని గుహాముఖమని ఏరును కనిపెట్టలేనంత విచిత్రముగ నచ్చట శిలాశిఖరములు నీటిలోనుండి తలలెత్తియుండెను. వాన కాలపు వరద లెంతవచ్చినను ఆ గుహలోనికి పడవ కటాకటిగ పోవచ్చును.
సువర్ణశ్రీ యా గుహలోనికి ఈదుకొని పోయెను. అచ్చట పడవ యాగుటకై ఎత్తయిన వితర్దికయు, ఆ వితర్దికనుండి వ్రేలాడు తా డొకటియు నాతనికి గోచరమైనవి. అత డా త్రాడు పట్టుకొని నీటిలోనుండి వెడలివచ్చు చప్పుడు కొంచెముకాగా ఆ వితర్దికపై కెగబ్రాకి, యందు కొంతకాలము చప్పుడుకాకుండ పండుకొనియుండి బల్లివలె ముందునకు కటిక చీకటిలోనికి ప్రాకుకొని వెడలిపోయెను.
11. మహా గుహాంతరము
ఆ గుహాముఖమున అడుగడుగునావుండు రక్షకభటులలో మొదటి వంతు వారప్పుడే భోజనముకు వెళ్ళిరి. రెండవవంతువారు అప్పుడే వచ్చి వెళ్ళిన ఆగంతుకులు తెచ్చిన వార్తల విషయమై ఇతరులతో జర్చింప నేగి కొంత ఆలస్యమొనర్చిరి. ఆ తరుణముననే సువర్ణశ్రీ గుహలోనికి సగము వరకు బల్లివలె ప్రాకుచు పోయెను.
ఇంతలో మనుష్యులు మాట్లాడుకొనుచు తనవైపువచ్చు సవ్వడి విని సువర్ణుడు చైతన్యమును వదలి, రాయిలో రాయియైపోయెను. గోడకు ఒదిగిపోయి ఊపిరియేనియు వదలలేదు. మాటలాడుకొనుచు ఇరువురు రక్షక పురుషులు సువర్ణుని ప్రక్కనుండియే నడచివెళ్ళిరి. వా రట్లు నడచి నడచి గుహాద్వారమునకు వెడలిపోయిరి. వెంటనే సువర్ణుడు తథాగతుని ప్రార్థించి ముందునకు బ్రాకుచు సాగిపోయెను. ఆతడు ఇరువది ధనువు లట్లు పోవుటయు గుహాంతము దూరమున తోచినది.
ఎట్టి ప్రాంగణమునకు కొనిపోవునో యా గుహ, గుహవెలుపల వెన్నెల వెలుగు తెల్లని పూలప్రోవువలె కన్పించుచుండెను. అచట నొక వీరుడు విచ్చుకత్తులతో నిలువబడి యుండెను.
అడివి బాపిరాజు రచనలు - 2
• 187 •
హిమబిందు (చారిత్రాత్మక నవల)