పుట:Himabindu by Adivi Bapiraju.pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

 మణిబంధకూర్పరపాదగుల్నోరుపజిహ్వాదినాడులన్నియు బరీక్షించెను. అత డంత లేచి, మహారాజుకడకు బోయి “ప్రభూ! ఈ బాలిక బ్రతికియున్నది. ఆమెయందు మహాసర్పనాడి వ్యాప్తమై యున్నది. అయినను ఆమెలో భోజనము, నీరము గైకొనని నీరసముతప్ప వేరొండు దోషమేమియు లేదు. ఆ దోషములైనను ఇప్పుడు కొలదిగ మాత్రమున్నవి. ఆమె ఇప్పుడు నిద్రపోవుచున్నది. మహావిషదిగ్ధయగు నీ బాలిక ఇతిహాసములలో, విష శాస్త్రములలో చెప్పినట్లు ఈ.....బా....లి.....క....“వి......ష......క......న్య.....క...” యని వణంకుచు చెప్పి తలవంచుకొనెను.

శ్రీకృష్ణ: విషకన్యకయా!

సింహగర్జనవలె ఆ ప్రదేశముల మారుమ్రోగ నిట్లడిగిన యువరాజు వదనమాలోకించి,

“చాణక్యదేవుడు పర్వతకుని పై విషకన్య ప్రయోగముచేసెనని వినరా మహారాజ కుమారా!” అని మంత్రవేత్త పలికెను.

శ్రీకృష్ణ: అట్టి బాలిక ఇక్కడ నెట్లు పడియుండును?

విషవైద్యుడు: ప్రభూ! ఆమె నాశనము గోరి ఎవరో ఇచ్చట వదలి యుండవచ్చును.

శ్రీకృష్ణ: కార్తాంతికులవారిని పిలువనంపుడు.

వెనుక వేరొక గజముపైవచ్చు కార్తాంతికు డచ్చటికి విరుగుడు మందులు సేవించి కొలదికాలమునకు వచ్చెను.

శ్రీకృష్ణశాతవాహను డాయనవైపు తిరిగి “పండితులవారూ, ఎవరు ఈ బాల? ఈమె నా కంటబడిన ఫల మేమి?” అని యడిగెను.

కార్తాంతికు డంతట తనలో నొకింతసేపు గుణించుకొని “మహారాజా! ఈ బాలిక రెండు మూడు సంవత్సరములు ఈ స్థితిలో నుండును. ఈమె సత్కులవంశజాత. ఈమె జాతకము పరమోత్కృష్ఠము. ఈమె మహారాజ్ఞి యగును. మీ జీవితమునకు ఈమె జీవితమునకు ఏమియో సంబంధమేర్పడు సూచనలున్నవి. ఈమెను వెంటనే వలయు నుపచారములతో, కట్టుబాటులతో మనతో గొనివచ్చు ఏర్పాటులు చేయుడు. ఒక శిబికపై ఈమె ప్రయాణము చేయును. ఈ మహావైద్యు లీమె రక్షణకై వలయున వన్నియు నిర్వర్తింతురు” అని మనవిచేసెను.

విషవైద్యుడు, “ప్రభూ! తాము నా అనుమతిలేనిదే రెండునెలల పాటు ఈమెను సమీపింపనని మాట ఇచ్చినచో నే నీ భారము వహింపగల” నని విన్నవించెను. 

10. నర్మదానదము

నర్మదానదము ఎంత శ్యామలమో అంత ప్రసన్నము. ఎంత గంభీరమో అంత సుందరము. సింధునది మహాశక్తిమతి. ఆమె అనాది చరిత్రకలది. ఆమె వేదములతోడనే ఆవిర్భవించినది. ఆమె అదితిదేవి. దెస దెసల ఆవరించు వెలుగు వాకలై ప్రవహించు మహానది ఆమె. ఆమె గర్భమున దేవనదులే ఇమిడిపోయినవి. ఆమె కాళికారూపిణి. ఆమె సర్వమతములు తనలో జీర్ణించుకొన్నది. ఆమె దస్యులకు, అసురులకు, యవనులకు ఆశ్రయమిచ్చినది.


అడివి బాపిరాజు రచనలు - 2

• 184 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)