పుట:Himabindu by Adivi Bapiraju.pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

 తమ మాండలికులలో అద్భుతసౌందర్యముగల యువతు లున్నారని ఎన్నియో సంబంధములు వచ్చినవి. తండ్రిగారు తన భావ మేమని కోరినప్పు డా ప్రస్తావనకు తాను ప్రతియీయలేదు. వివాహ మేమి? కామ నిర్వహణమునకు తనకడనున్న బాలికలు చాలరా? అనాఘ్రాత పుష్పములై కుసుమపేశలదేహలై, పరీమళోచ్ఛ్వాసనాసికాసుందరులైన యా బాలల కన్న తన కామాగ్ని కింధనము లగుటకు వేరు వనిత లేల? అయిన వారిని తా నంటినదియు లేదు. వారి యౌవనామృతరసము నాస్వాదన చేసినదియు లేదు. తుచ్ఛానందము దేహసంయోగమాత్రమున జనించును. గాఢమై, గంభీరమై, అనంతమై, అత్యంత గోప్య మగు మానవప్రకృతి కాసౌఖ్యము తృప్తినీయగలదా? కురూపులై భరింపరాని దుర్గంధముల నోలలాడు ఈ కిరాతులలో స్త్రీ పురుషులానందమొందుటలేదా? ఈ దేహసౌఖ్యమాత్రమునకు అందముగూడ నెందుకు? సాధారణ వృక్షములును మహౌషధులు నన్నియు గుసుమించి ఫలించుటలేదా? బీజధర్మ మంతట నొక్కటియే కదా!

శ్రీకృష్ణశాతవాహనుడు పోయి మంచమున మేనువాల్చి నిదుర గూరెను. వేకువనే వైతాళికులు ఉషోదయగీతికల బాడిరి.

వేటజనమంతయు లేచెను. సర్వము సిద్ధముచేసికొని వేటసాగింప బయలుదేరెను, మహారాజు శ్రీకృష్ణశాతవాహన కుమారుడు.

ఏనుగుపై నెక్కి కొంతదూరము సాగెనో లేదో ఎదుట నొక గిరినాగు ఏనుగునకు కొలదిదూరములో కానవచ్చినది. గిరినాగము లన్న ఏనుగులకేమి, సింహములకేమి, మనుష్యులకేమి యన్నింటికిని భయమే. గిరినాగము కంటబడినవాడు దానిబారినుండి పారిపోలేడు. మంత్రవేత్తలు, పాములవాం డ్రానాగములవైపునకైన పోవరు.

“మనుష్యునకు కనంబడని యీ పాము నేడింత నిర్భయముగ నడవుల సంచరించుచున్నదేమి?” యని వారందరు సంభ్రమాశ్చర్యముల నందిరి.

అప్పుడొక పాములవాడు ముందునకు వచ్చి, మహారాజు గజము వైపు తిరిగి చేతులు జోడించుకొని “మహాప్రభూ! ఈపాము దేవరవారిని ఎక్కడకో రమ్మని అడుగుచున్నది. ఈ పాములమాట మే మెవ్వరము జవదాటి ఎరుంగము” అని మనవిచేసికొనెను. 

8. మహావిష సాన్నిధ్యము

ఆ మహానాగము ముందు, వెనుక శ్రీకృష్ణశాతవాహనుడు కతిపయ పరివారము తోడను అమితవేగమున వెడలజొచ్చిరి. ఉత్తరాభిముఖమై ఆ పొదలలో, నిబిడ వృక్ష సమూహములలో, నల్లనిబండరాళ్ళలో ఆ పర్వత నాగేంద్రుడు వారిని కొనిపోయినాడు.

శ్రీకృష్ణసాతవాహనుని మత్తగజము లెక్క సేయక వేగమున బారు నా పన్నగేంద్రు ననుసరించి పోవుచుండెను. వెనుక ఏనుగులు, గుర్రములు, బండ్లు, ఎద్దులు వచ్చు చుండెను.

యువరా జెక్కిన మదగజముపై మంత్రగురువు, విషవైద్యుడు, పాములవాడును ఎక్కిరి. వారట్లు రెండుక్రోశములదూరము పోవునప్పటికి దారి దొరకుటయే కష్టమగు

అడివి బాపిరాజు రచనలు - 2

• 179 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)