పుట:Himabindu by Adivi Bapiraju.pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

“స్వప్నమువలన నట్లు చెప్పవచ్చునా? ఈ జ్యోతిష్యాదులు నిజమా? యన్న ప్రశ్నలు నాలో నప్పుడప్పు డుద్భవించును. ఈ ప్రపంచమంతయు మాయ యందురుకదా! ఈ ప్రపంచమెంతయున్నది? దీని కాధారము మేరు పర్వతమేనా? ప్రపంచమధ్యమున జంబూద్వీపమా? ఆ ద్వీపములో నవవర్షములు. అందు మనము నివసించు భారతవర్షము అనంతమైన జగత్తులో మనమేపాటి? మనస్వప్నము లేపాటి?”

“ప్రభూ! తాము సెలవిచ్చినది సత్యమే. మహత్తత్త్వమువలన ఈ సర్వ భూమండలము పరిభ్రమింపవచ్చును. లోకాలోకపర్వతము వరకు పోవచ్చును. మనవారు జంబూద్వీపాంతరములకుబోయి సువర్ణద్వీపములు చూచి రాజ్యము లేర్పరచుకొన్నారు. యవనరాజులతో వర్తకములు చేయుచున్నారు. అనేక వర్షములలో చిత్రచిత్ర మనుష్య జాతులను, మృగజాతులను జూచుచుండిరి. ప్రపంచమెంత విశాలమైనను సనాతనమైన ధర్మమొక్కటే దీనిని ధరించుచున్నదికదా!”

“అవును, మహాశ్రమణకుని బోధకు, ఆర్యఋషుల బోధకును సర్వవిషయముల నొకేభావము ద్యోతకమగుచున్నను, నిర్వాణాది విషయములందు, సత్యదర్శనమందు కొలది భేదములు మాత్రము కనబడుచున్నవి. సర్వప్రపంచమిట్లు ప్రత్యక్షమై రాజ్యములకై, సంపదకై దారాపుత్రాదులకై సంతోషాదులకై మనమిట్లు తాపత్రయముల బడుచుండియు, నిదియంతయు భ్రమ అనుకొనుట ఏల?”

“మహారాజకుమారా! అంతమాత్రమున జగత్తు సత్యమగునా? మనమును సత్యము కాము. ఒక మహాకర్మమున నేమియులేని శుద్ధానందములో నుండి వికృతినంది మన మీ విచిత్రనాటక మాడుచున్నాము. దానికి ద్రష్టలమును మనమే అయ్యు అహంకార మమకార వశుల మగుచున్నాము. అదియే దుఃఖనాటకము.”

ఇట్లు సంభాషించుచు మహారాజు సపరివారుడై అటవీ మధ్యము జొచ్చెను.

ఆ దినమంతయు వేట జరిగినది. అనేకమృగములు హింసింపబడినవి. అరణ్యమంతయు గగ్గోలుపడిపోయినది.

ఆరాత్రి మహారాజు చిన్నపట్టణమునకు సరిపడు తన పరివార జనమందరితో నొక శైవాలినీకూలమున శిబిరముల వేయించి విశ్రమించెను.

యామములు యామము లాతనికి ఏదియో ఆవేదన. యుద్ధమెట్లుండునో? భరుకచ్చము పట్టుకొనుట, ఆభీరులతో యుద్ధము, వివాహము! ఈ ఆలోచనలు ఆషాఢ మేఘములవలె అతని మనఃపథమున సంచరించినవి.

కొంతకాలమునకు యౌవనశ్రీసుభగుడు నా శాతవాహన కుమారుడు తన మృదుపల్యంకమునుండి లేచి క్రిందికి దిగి మెత్తని పాదరక్షలు తొడుగుకొని మైనపువత్తి దీపములు వెలుగు దీపస్తంభముకడకు పోయి, యా దీపములకొడులన్నియు సరిచేసి, యక్కడనొక ఆసనముపై కూరుచుండి, తన్ను కలచివేయు వివిధాలోచనముల జెదరగొట్టుచుండెను.

ఎన్నిసారులు దూరముగ త్రోసిపుచ్చినను మరల మరల తన వివాహవిషయము అతనికి ప్రత్యక్షమగుచున్నది. ఏమి వివాహము? ఎవరితో? మహారాజుల కొమరితలు తనకు వలదు. వారు తనపుత్రులకు తల్లు లగుదురేగాని తనమనోవేదన తీర్చశక్తి కలుగు వారగుదురా? వారలలో కొందరు అందకత్తియలు నున్నారట. అందచందములు జంతువులకు మాత్రము లేవా?

అడివి బాపిరాజు రచనలు - 2

• 178 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)