ఎట్టఎదుట మబ్బులు గ్రమ్మియున్న యామె చూపులకు తలపై వంగిచూచు ఒక పురుషునిముఖము మిరుమిట్లు కొలిపినది. ఆమె మాట రాకపోవుటచే నోరు మెదపి మరల కన్నులు మూసివేసుకొనెను. ఇంతలో ఆమె పెదవులపై తీయని, పుల్లని శీతల మగు సుగంధపూరితములగు రసబిందువులు పడినవి. ఆమె నోరు చప్పరించెను. మరల రసబిందువులు వొలికినవి. ఆమె నాలుక జాపినది. అందుపై ప్రాణము లేచివచ్చు నాగరంగఫలరసము నెవ్వరో పిండినారు.
7. ఆచ్ఛాదనము
వేట రాజుల వ్యసనము. బ్రాహ్మణ ప్రభువులకుగూడ వేట తప్పదు. బుద్ధభగవానుని ధర్మము నాశ్రయించినను రాజులకు వేట ఏల తప్పును?
మృగయావినోదియై శ్రీకృష్ణసాతవాహనమహారాజు పరివారసమేతుడై వెడలినాడు. వేటకుక్కలు, డేగలు, గరుడులు, చిందుగులు, ఏనుగులు, కిరాతులు, సామువాండ్రు కూడ బోవుచుండిరి. వారితో శుల్బములు మృగబంధనములు, భారయష్టులు, డప్పులు, వృక్షాదనములు, క్రకచములు, మృగబంధనములు, భారయషులు, డప్పులు, నారాచములు, త్రిశూలములు, ఔషధములు, కాగడాలు, శిబిరములు, మంచములు, ఆసనములు మొదలగు పరికరము లెన్నియో తెచ్చుచుండిరి.
విషవైద్యులు, కార్తాంతికులు, భిషక్కులు, వంటవారు, ఆఖేటన విద్యాచతురులు తోడరా మహారాజు సేనాపతిద్వితీయుడై చనుచుండెను.
చిందుగులు వేటాడుటయందు ప్రసిద్ధినందిన జంతువులు. చిందుగులను సివంగు లనియు బిలుతురు. అడవి ఎర్రకుక్కలను కూడ చిందుగులవలె బోనులలో పెంచి మృగములను వేటాడించువారు ఆంధ్రులు.
ఆంధ్రశాతవాహనులు బుద్ధపదారాధనాతత్పరులయ్యు, సంధ్యార్చనాదికముల మరవరు. క్రతువుల నాచరింతురు కాని వానిని హింసాపూర్వకముగా జేయరు. శ్రీకృష్ణ శాతవాహనమహారాజును రేపకడనే స్నానమాచరించి సంధ్యార్చనాదికముల నిర్వర్తించి కవచము ధరించి సకలాయుధోపేతుడై శుభముహూర్తమున విప్రాశీర్వాదములు చెలగ ఏనుగు నెక్కబోవుచుండ దూరమునుండి తీయని ఒక బాలికాకంఠము తెల్లవారుగట్ల పాటపాడుచు వినంబడినది.
రాజజ్యోతిషికుని తనతో భద్రదంతావళము నెక్కగోరి శ్రీకృష్ణుడు గజారోహణ మొనర్చెను. గజమును కదలినది. వేటపరివారమంతయు గదలినది. శ్రీకృష్ణుడు జ్యోస్యునితో తన కలయంతయు తెలిపి దాని ఫలితము వినిపించ ప్రార్థించినాడు. ఒక యరనిమేషము ఆలోచనాధీనుడై యా కార్తాంతికుడు శ్రీకృష్ణుని జూచి,
"ప్రభూ! తమ స్వప్నమును, తాము ప్రాయాణోన్ముఖులై నప్పుడు వినిపించిన యా మధురగీతాలాపన పరమార్థమును సమన్వయించిన, తమకు కొన్ని చిక్కులు వివాహవిషయమై రాగలవనియు, అవియన్నియు తీరి పరమానందముగ వివాహమగుదు రనియు, తమకీ ప్రయాణమున అఖండ విజయము, ఆ విజయమునకు ముందు వివాహాదివిషయమువలెనే కొన్ని చిక్కులు, ప్రాణాపాయస్థితులు సంభవించుననియు, నాకు తోచుచున్నది” యని మనవి చేసెను.
అడివి బాపిరాజు రచనలు - 2
• 177 •
హిమబిందు (చారిత్రాత్మక నవల)