Jump to content

పుట:Himabindu by Adivi Bapiraju.pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

 ఆమె నాల్క ఆరిపోయినది. దాహమని ఆమెనాలుగువైపుల మోముత్రిప్పి కనుగొన్నది. పాపము ఆపాము చేయునది లేకకాబోలు అంతర్థానమైపోయెను.

అత్యంత పిపాసార్ధితయై దిగంబరియగు నా బాల తన తలకట్టే పక్కగా ఒక లెరుంగక నిద్రపోయెను.

మెలకువ వచ్చి చూచునప్పటికి సూర్యుడు నడినెత్తిపై నున్నాడు. ఆమె కాకలి దహించుకొనిపోవుచున్నది. దాహము! ఈ నిర్జనాటవిలో తన గోడెవరాలకింతురు? ఆ పాముజాడకూడ లేదు. మానవుడు వీడిన యా యనాథబాలను క్రిమికీటకాదులుకూడ వీడిపోయినవా? ఇంతలో బుస కొట్టుచు నెచ్చటినుండియో యా పా మచ్చటకు వచ్చెను. దాని నోట ఒక కప్ప యున్నది. విషబాలిక కా పామాహారము కొనివచ్చినది కాబోలు!

విషబాల పక్కున నవ్వినది. “ఓ ప్రాణ స్నేహితుడా! నా కాహారము కొనివచ్చినావా? కాని నీ ఆహారము నాకు సరిపడదే! నీ ప్రేమయే నా కాహార మగుగాక! ఈ యది నరక మని నాకు తోచుటలేదు. గాఢారణ్యమై యుండు ననుకొనియెదను. అయిన నే నిచ్చట కెట్లు వచ్చితిని? అయ్యో! మా తాతయ్య ఇచ్చట దిగవిడిచి చనలేదుకదా! అమ్మో! నా ఒడలు వణకుచున్నది. నే నేమి చేయుదును? నాకు దిక్కెవరు?” అని గాఢవిషాదమున ఆమె అతికరుణముగా ఏడ్చినది. ఆమె మరల నొడలు మరచి పడిపోయెను.

ఆమెకు జ్ఞానము వచ్చుసరికి సాయంకాలమైనది. ఎల్లయెడల కారుచీకట్లు క్రమ్మినవి. కీకురుకీకురు మని కీచురాళ్ళ చప్పుడు, అడవి మెకముల అరపులు దూరమున వినబడుచున్నవి. విషబాల యిప్పుడున్న అడవి భాగమునకు వన్యమృగములుకూడ రా వెరచును. అక్కడ చుట్టుప్రక్కల రెండామడలవరకు నీరములు లేవు. ఆకాశమువరకు పెరిగిపోయి, పాతాళమునుండి నీరుత్రావు పెద్ద పెద్ద వృక్షములు, వర్షకాలమున చిగిర్చి పెద్దవియై తరువాత ఎండిపోవును. కీటకములకుగూడ దారి యీయని కంటక నికుంజములుతప్ప అచ్చట నేమియు గానరావు.

ఆ నాగుబా మీ దినమున అడవిలో తిరుగుచు మనుష్యుల అడుగుల జాడ కన్పించి భయపడెను. మానవు డెచ్చటను కానరాలేదు. ఆ అడుగుల వాసనలచే నా భుజంగము ఆ పాదములజాడనే ధనువులు, క్రోశములు గడిచి యా విషబాలను కనుగొన్నది. మానవస్త్రీని చూడగనే భయపడి వెనుకకు బారి, భయము కలిగించు వాసనకొట్టనందున ఆ పన్నగము మెల్ల మెల్ల బాలికను సమీపించినది.

ఆకలిబాధ చేతను, దాహముచేతను ఆ విషబాలిక నిశ్చేతనమగు గాఢమూర్చలో మునిగినది. ఆమె రాత్రియంతయు నట్లే పడిపోయియుండెను. మరల తెల్లవారినది. ఒక యామము గడచినది. ప్రకృతియే యామెను సేద తీర్చినది. ఆకలిబాధ ఎట్లో మందగించినది. దాహముకూడ ఏ విధముననో తగ్గినది. కాని కదలలేనంత నీరసస్థితిలో ఆమె అట్లే పడియున్నది.

మరల నిద్రపోయినది. మధ్యాహ్నమగువేళ విషబాలకు మరల మెలకువ వచ్చినది. ఆమెకు కన్నులు విప్పుటకుగూడ శక్తి చాలలేదు. కాని తానొక్కతెయే యచ్చట లేదను నభిప్రాయ మామెకు కలిగినది. నరకలోకము వీడి దేవలోకము వచ్చిన ట్లామెకు భావ మొండు కలిగెను. కన్నులు విచ్చి చూచెదమా యని కోర్కె, కనులు విప్పనీయని నీరసము. ముక్కుపుటముల, గళమును, వాయకోశముల నార్పివేయు విషవాయువులు వీచు నీ ప్రదేశమున సువాసనాపూరితములై వీచు నీ తెమ్మెర లెక్కడివి? అనుకొనుచు ఆమె కన్నులు తెరచినది.

అడివి బాపిరాజు రచనలు - 2

• 176 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)