పుట:Himabindu by Adivi Bapiraju.pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

 “హో” యని పది, పదిహేను అరపులు వినబడినవి. తర్వాత నంతయు నిశ్శబ్దము. పాముబుస దీర్ఘమై విననైనది. మరల నిశ్శబ్దమా వహించినది.

సువర్ణున కిదియంతయు భయాశ్చర్యముల గొలిపినది. “అన్నా! మన విరోధులందరు మాసిపోయినారు. ఆ శవముల రాక్షసులు భక్షింతురు అని మహాబల గోండుడు పలికినాడు.

సువ: ఛీ! ఛీ ! నరమాంసభక్షణమే? బుద్ధం శరణం గచ్చామి.

మహా: నరమాంసభక్షణము మాకు మాత్రము ఇష్టమా! రాక్షసుల పాలబడినవాని గతి అంతియ. మహాబలగోండు నేమి, మఱి ఏ ఒక్క గోండునేమి శబరుడు, పుళిందుడు యుద్ధమున కాహ్వానించుట చావును తెచ్చుకొనుటే. రాక్షసులు గోండుల ఆజ్ఞచే వచ్చిరని తెలిసిన మరలగోండువిరోధి ఈ అడవుల నుండునా? రాక్షసుల నోడింపగలవా రొక్క గోండులే!

సువ: అబ్బ! నా హృదయమున వెర పింకను పోలేదు తమ్ముడూ!

మహా: నన్ను క్షమింపుము. నీకు నే నీ విషయము తెల్పియుండకూడదు. నీవు వీరుడవు. శిల్పిమాతృడ వేయైన అడవుల కేల వత్తువు? హిమబిందును తలచుకొనుము.

సువ: అన్నియు భగవంతుని చిద్విలాసములు. కానిమ్ము. విచారించుటకు నే నెవడను?

మన మొక్క ఘడియ ఆలసించినకొలది హిమబిందు, ముక్తావళీదేవుల ఇడుమలు ఒక్కొక్కటే అధికమగు నని నా భయము.

వా రంతట ఇంకను వేగముగ సాగిపోయిరి. 

6. నాగరాజు

స్థౌలతిష్యుడు ఓషధీ ప్రభావముచే విషబాలకు గాఢనిద్ర కల్పించెను. విషవైద్య విశారదులగు కొందరు సేవకులు ఆమెను ఏనుగుపై అరణ్య మధ్యమునకు గొనిపోయిరి. శ్రీకృష్ణసాతవాహనుడు వేట నెపమున మాళవమునకు యుద్ధాభిముఖుడై వెళ్ళుచుండెనని యాత డూహించియుండనోపు.

శ్రీకృష్ణసాతవాహనుడు వెళ్ళుదారికి ఒక క్రోశము దూరమున నిబిడమగు నొక కాంతారభాగమున విషబాలను వదలిలేసినారు.

“నీరము లా చుట్టుప్రక్కల కొన్ని క్రోశములవఱకు నుండవు. ఫలములు కానరావు. కంటకావృతమై, ప్రాణరహితమై, బీభత్సమగు దుర్గమారణ్యమున వొంటి విడచి రండు. ఈమె ఇతరులకు మృత్యు వగుగాక!” అని స్థౌలతిష్యుని యాజ్ఞ.

విషబాల కన్నులు దెరచి చూచినది. కర్కశస్థలమున నామె పడియున్నది. ఒక పెనుబా మామెపై ప్రాకుచు చోద్యము చూచుచున్నది. ఆమె ఉలికిపడి లేచి నిలుచున్నది, ఉన్నతములగు చెట్లు, మహోరగముల బోలు తీగలు, కంటకావృత్తము లగు పొదలు, కఠినశిలలతోనిండిన భూమి. ఆమె కన్నులు నులిమికొన్నది. విహ్వలచిత్తయై యామె కెవ్వున నార్చినది. ఆమె కేక ఓ ఒ! ఒ! ఓఓఒ! అని మారుమ్రోగినది. ఆమె పూర్తిగా వివస్త్రయై యున్నది. ఏమి శిక్ష! విషకాంతుల వెలిగిపోవు ఆమె దిగంబరదేహము భయముచే, బిడియముచే ముడుచుకొనినది. ఆ ఉదయమున మలయపవనములు హాయిగా వీచి ఆమెను సేదదీర్చెదమని వచ్చినవి. కాని ఆచ్ఛాదనా రహితమగు నామెతనువు నవి సోకగనే

అడివి బాపిరాజు రచనలు - 2

• 174 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)