పుట:Himabindu by Adivi Bapiraju.pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

“ఏమీ, దండకాటవికే! నేను భయపడినట్లే అయినది. ఎంతపని చేసినారు! వా రింకా ఎంతదూరాన ఉన్నారో! ఎచ్చట నున్నారో! క్షేమముగా నుండిరా? మన మచ్చోటికింక నెపు డేగెదము?”

“తొందరపడకుము. వీరుడు కోపమున కఱ్ఱ నిప్పును దాచుకొనినట్లు తనలో దాచుకొనును.”

“నాకన్నియు చెప్పుము తమ్ముడూ! మనమచ్చటికి త్వరితముగ పోవలెను.”

“వారిని ఎత్తుకొనిపోయినది సాధారణాటవికులు కారు. వారట్టి పనులు చేయరు, చేయుట చేతకాదు. నగరవాసు లన్న నే మాకు భయము. నగరమును జూచిననే మేము ముడిచికొని పోవుదుము. వారిని ఎత్తుకొని పోయినది ఎవరో చక్రవర్తి విరోధులట.”

“మాగధులా?”

“మాగధులో, వందులో వారి నిరువుర నెత్తికొనిపోయి, ధాన్యకటక నగర ప్రాంతమున దాగికొనియున్న శబరులకు అప్పగించిరట!”

“నే ననుకొనినంతయు నైనది. వారికేమియు ప్రమాదము కలుగ లేదు గదా!”

“వారిని నర్మదాతీరమున నున్న స్ఫటికశిలాపర్వతములవైపు తీసికొని పోయిరట.”

“నడు, మన మచ్చటికే పోదము.”

“అచ్చటికే పోవుదము. ఈలోన మా నాయనగారికి గోండు సైన్యము నుండి సింహములవంటివారిని ఏరి మన సహాయమునకు పంపపలయు నని వార్త పంపినాను.”

“అటులనే అన్నా!”

ఆ ఉదయమున వారొక సరోవరముకడ వంట చేసికొని భుజించి, మరల ప్రయాణము సాగించిరి. ఎంత వేగముగ నడచినను ఒక్క ఆకు కదలిన చప్పుడైన కాదు. మహాబలగోండుడు అనుమాన మేమైన తోచినప్పుడు, సైగచే సువర్ణుని ఆపి ముందునకు బోయి పరిశీలించి, అచ్చట చిన్న పక్షి ఈలవేయును. సువర్ణు డప్పుడు ముందుకు సాగిపోయి, యాతని గలిసికొనును. వా రిరువురు ముందుకు సాగిపోదురు.

మహాబలగోండునకు పాము చెవులు. ఎంత చిన్న చప్పుడెంత దూరముననుండి వినిపించినను ఆతని కర్ణములకు సోకును. ఆతడు ముక్కుపుటములు విస్ఫారితముజేసి, ఎట్టివాసననైన పసిపట్టగలడు.

వారట్లు మహావేగమున బోవుచుండ నొకమధ్యాహ్నము వారి ఎదుట నొక బాణము వచ్చి పడినది. గోండుడు వెంటనే ఆగి, భూమిపై వాలిపోయెను. సువర్ణునిగూడ భూమిపై వ్రాలమని సైగచేసెను. ఆతడును, సువర్ణుడును పాకికొనుచు, దట్టమైన యొకపొదలోనికి దూరిపోయిరి.

మహాబలుడు సువర్ణుని చెవికడ వదనముంచి మనలను విరోధులగు పుళిందులు కనిపెట్టినారు. ఆ బాణమే ప్రశ్న. నీవును గోండుడవు అని వారికి తెలుపవలె. లేనిచో మనలను బాణములచే చెండివేసెదరట. ఆ బాణము వచ్చిన విధమునకు, నా ముందర పడుటకు, ఆ బాణమునకు కట్టిన ఈకలకు అర్థమది” అని తెల్పెను.

“అయిన నిప్పుడేమి చేయవలెను?”

“నీ వూరక చిత్రము చూచుచుండుము” అని చెప్పి మహాబలు డప్పుడు పెదవులు మూసి పామువలె బుసకొట్టినాడు. వెంటనే దూరమునుండి వేరొక మహానాగము బుసకొట్టినది ఆకాశములో చిన్న చిన్న ఈటెల వంటివి వేలకువేలెగిరినవి. “కో” యని,

అడివి బాపిరాజు రచనలు - 2

• 173 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)