పుట:Himabindu by Adivi Bapiraju.pdf/18

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


 “సమదర్శి! సర్వసైన్యాధ్యక్షుని భవనము చుట్టుప్రక్కలవారికి యుద్ధమనుమాట వినబడుచున్నదట?” అని అమలనాథుడు సమదర్శి దిక్కు మొగంబై ప్రశ్న వేసెను.

ఆనందవసువు: సమదర్శి సమవర్తే. సార్వభౌములు “సాతవాహన శత్రు సమవర్తి” అని బిరుదము ప్రసాదించినారా! చెప్పవయ్యా.

ప్రియదర్శి శాతవాహనుడు తన కొమరునకు సమదర్శియని నామకరణ మీడికొనినాడు. శాతవాహన సామ్రాజ్యము పై ఎత్తివచ్చిన ఆభీరులపైని శ్రీముఖ శాతవాహనుడు సమదర్శిని సైన్యమిచ్చి పంపినాడు. సమదర్శి ఆభీరులను పూర్తిగా ఓడించి తరిమివేసి వారి పతాకములన్నియు కొనివచ్చి సార్వభౌముని పాదములకడ నర్పించెను. అప్పుడానందహృదయుడై చక్రవర్తి “సాతవాహనశత్రు సమవర్తి” యని బిరుదమును నిండుసభలో సమదర్శికి ప్రసాదించెను. అందుచే అతని బందుగులు, మిత్రులు సమవర్తియనియు పిలుచుచుందురు.

సమ: ఏమున్నది? మొన్న బేగిరావు నాడువార్త తెచ్చుటయు మహామంత్రులవారు శీఘ్రముగ మహారాజ దర్శనమున కేగిరట. సర్వసైన్యాధ్యక్షులను పిలిపించిరట.

ప్రభాతశూరుడు: ఆవార్త మాళవమునుండి కాదా?

అమల: మాళవము తిరుగుబాటు చేసిందనే ఊహిస్తున్నాను.

ఆనంద: ఊరుకోండి మామగారూ! మొన్నకదా చండవిక్రములైన వినీతమతుల ఆధిపత్యమున మాళవమునకు సైన్యము లంపుట, అంత కొన్ని దినములకే వార్తాహరులు మాళవము శాంతముగ నున్నదని తెలుపుట జరిగినది?

ప్రభాత: ఆనంద! నీకు తెలివితేటలులేవు. ముగ్గురు సార్వభౌములకడ పనిచేసిన అమలనాథ సేనాపతులు నీపాటి ఆలోచన చేయలేదని అనుకొంటివా?

ఆనంద: చేయలేదనికాదు.

అమల: ఏమో! వృద్ధులమాటలు పడుచువాళ్ళు పాటింతురా? మా చిన్నతనమున పెద్దలకెన్నడు నెదురుచెప్పి యెఱుగము.

ఆ వీరు లొకరిమొగము లొకరు చూచుకొనిరి.

సమ: మామగారూ! కోపగించకండి. ఆనంద చనువుకొద్దీ ఏవో తెలివితక్కువ మాటలు అన్నాడు. ఆ దోషమునకు ప్రాయశ్చిత్తం మీరు విధించదగుదురు. మనలో మనకు అరమరలు కూడవని వీరలోకమునకు మనవి.

ఆనందవసువు విచారమావరించిన మోముతో అమలనాధునికడ మోకరించి “ఈ యపరాధికి దండనమే ప్రసాదము” అని తలవాల్చికొనెను.

అమలనాధు డాతని రెండుచేతులు పట్టుకొని లేవనెత్తి “నాయనా! నీవు రెండురోజులు మౌనవ్రతము దాల్చి మహాచైత్యమున ఆదిశ్రమణునకు దీప మర్పించి, ఆంధ్రమహారాజుల పతాకము సర్వదిశల విజయ కాంతులతో తేజరిల్లవలయునని ప్రార్ధించుము, కళ్ళెములేని అనవసరోత్సాహమును కనుగొనిన నాకు విచారము కలుగునుగాని కోపమురాదుసుమా” యని పలికినాడు. వీరులందరును లేచి అమలనాథుని అభినందించిరి.

అమల: ప్రస్తుత మాలోచింపుడయ్యా! రేపు మనలో వృషభశకట పరీక్షకు ఎవరెవరు నిలబడిరో సమదర్శిని చెప్పనిండు.

సమదర్శి: సార్వభౌముల పక్షమున వరాలకుడును, మా మేనమామగారి రథము నడుపుచు నేనును, కళింగదేశాధిపతి పంపిన శివస్వాతియు నుందుము. మాళవ ఘూర్జర మగధ

అడివి బాపిరాజు రచనలు - 2
హిమబిందు (చారిత్రాత్మక నవల)
• 8 •